సాహసాలు.. సరదాలాటలు!

కబడ్డీ. ఖోఖో. వాలీబాల్‌. క్రికెట్‌... అంటూ రకరకాల ఆటలు ఆడేస్తాం... కానీ కొన్ని ఆటలున్నాయి... వాటిల్లో ఒకటి ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటే... మరోటి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది... ఇంకోటి భలే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది... ఇంతకీ ఆ ఆటలేంటో? వాటి ముచ్చటేంటో?....

Updated : 25 Sep 2019 05:09 IST

కబడ్డీ. ఖోఖో. వాలీబాల్‌. క్రికెట్‌... అంటూ రకరకాల ఆటలు ఆడేస్తాం... కానీ కొన్ని ఆటలున్నాయి... వాటిల్లో ఒకటి ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటే... మరోటి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది... ఇంకోటి భలే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది... ఇంతకీ ఆ ఆటలేంటో? వాటి ముచ్చటేంటో?

* సింగిల్‌ బాంబూ డ్రిఫ్టింగ్‌

పడవలపై వెళుతూ పోటీ పెట్టుకోవడం విని ఉంటారు. కానీ నీళ్లలో ఒక వెదురుబొంగుపై వెళుతూ పోటీ పడటం గురించి తెలుసా? అదే ఈ పోటీ. చైనా సంప్రదాయ ఆట. ఇది భలే గమ్మత్తుగా ఉంటుంది. నీళ్లలో ఏడు మీటర్ల పొడవైన వెదురు బొంగుపై నిల్చుని, సన్నని కర్రను చేతితో పట్టుకుని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. కొంచెం అదుపు తప్పినా నీళ్లలో పడిపోతాం. అందుకే దీని కోసం ఎంతో సాధన చేసి పోటీల్లో పాల్గొంటారు.

* చెస్‌ బాక్సింగ్‌

చదరంగం తెలుసు. బాక్సింగ్‌ తెలుసు. చెస్‌ బాక్సింగ్‌ ఏంటీ? అనే సందేహం వచ్చే ఉంటుంది కదూ. థింకింగ్‌, ఫైటింగ్‌ కలిసిన ఆటన్నమాట. అంటే అటు మెదడుకూ ఇటు శరీరానికీ సంబంధించిన రెండు ఆటల కలయికే ఇది. బాక్సింగ్‌ రింగ్‌లోనే చదరంగమూ ఉంచుతారు. పోటీదారులు సిద్ధంగా వస్తారు. మొత్తం 11 రౌండ్లలో ఆరు రౌండ్లు చెస్‌, ఐదు రౌండ్లు బాక్సింగ్‌ ఆడేస్తారు. జర్మనీ, యూకే, భారత్‌, రష్యాల్లో ఈ ఆటను ఎక్కువగా ఆడుతుంటారు.

* వాల్కెనో సర్ఫింగ్‌

నీటిపై చేసే సర్ఫింగ్‌, మంచుపై జర్రున జారే స్నో సర్ఫింగ్‌ తెలుసు కదా? మరి అగ్నిపర్వతంపై సర్ఫింగ్‌ ఏంటబ్బా? అనుకుంటున్నారా? ఇది సాహసికుల కోసమే.  ఈ వాల్కెనో సర్ఫింగ్‌కి పెట్టింది పేరు సెర్రో నీగ్రో అనే అగ్నిపర్వతం. ఇది మధ్య అమెరికాలోని నికరాగ్వా అనే దేశంలో ఉంటుంది. సాహసికులు ప్రత్యేకమైన దుస్తులతో కళ్లజోడు, హెల్మెట్‌ పెట్టుకుని ఇక్కడికి వస్తుంటారు. సర్ఫింగ్‌ బోర్డులతో 2,380 అడుగుల ఎత్తుండే ఈ పర్వతంపై నుంచి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో రయ్యిమంటూ దూసుకుపోతారు. ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 1999లో పేలిందట. జర్రుజర్రున జారడానికి వీలుండే ఇక్కడి ప్రత్యేకమైన ఇసుక వల్లే ఈ సర్ఫింగ్‌కి వీలవుతుందట. ఏటా వేలాది మంది ఈ వింత ఆట ఆడుతూ తమ సరదా తీర్చుకుంటారు. కొంతమంది రికార్డులూ కొట్టారు.

* థంబ్‌ రెజ్లింగ్‌ 

చుట్టూ బోలెడంతమంది ప్రేక్షకులు. వన్‌... టూ... త్రీ... ఆట మొదలైంది. రింగ్‌లో రెండు బొటనవేళ్లు ఒకదాంతో ఒకటి గెలుపు నీదా? నాదా? అంటూ పోటీపడుతున్నాయి. పోరాడి పోరాడి ఒక బొటనవేలు గెలిచింది. ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా? థంబ్‌ రెజ్లింగ్‌ ఆట ఇది. దీన్నే థంబ్‌ వార్‌ అనీ అంటారు. బొటనవేళ్ల మల్లయుద్ధమన్నమాట. ఎవరైతే బొటనవేలును కిందకు వంచి దాన్ని కదలకుండా చేస్తారో వాళ్లే విజేత. ఈ ఛాంపియన్‌ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా దేశదేశాల పోటీదారులు పాల్గొంటారు. న్యూజి లాండ్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, పోలాండ్‌, అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఈ పోటీలు నిర్వహిస్తుంటారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని