దుర్గం కాదిది స్వర్గం!

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఎలా ఉన్నారు? నేను మీ చిన్నూనొచ్చేశా. మొన్న సెలవుల్లో సరదాగా చాలా ఊళ్లు చుట్టేశా. బోలెడన్ని కోటలు చూసేశా. అబ్బ! ఎంత బాగున్నాయో! ఆ ముచ్చట్లు మీతో పంచుకోవాలనే ఇలా వచ్చేశా. ఆ కోటల్లో నాకు బాగా నచ్చింది రాజస్థాన్‌లో చిత్తోర్‌గఢ్‌లో ఉన్న పే...ద్ద కోట. ఈరోజుకు దాని ముచ్చట్లు చెప్పేస్తా. మరి వినేస్తారా?....

Updated : 24 Oct 2019 00:20 IST

కోట కథలు- చిత్తోర్‌గఢ్‌

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఎలా ఉన్నారు? నేను మీ చిన్నూనొచ్చేశా. మొన్న సెలవుల్లో సరదాగా చాలా ఊళ్లు చుట్టేశా. బోలెడన్ని కోటలు చూసేశా. అబ్బ! ఎంత బాగున్నాయో! ఆ ముచ్చట్లు మీతో పంచుకోవాలనే ఇలా వచ్చేశా. ఆ కోటల్లో నాకు బాగా నచ్చింది రాజస్థాన్‌లో చిత్తోర్‌గఢ్‌లో ఉన్న పే...ద్ద కోట. ఈరోజుకు దాని ముచ్చట్లు చెప్పేస్తా. మరి వినేస్తారా?
* రాజస్థాన్‌లో ఉదయ్‌పుర్‌
తెలుసుగా! దీనికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ చిత్తోర్‌గఢ్‌. ఇప్పుడైతే చిన్న పట్టణం గానీ.. దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఎప్పుడో ఏడో శతాబ్దంలో ఇక్కడ ఈ కోట కట్టార్ట. మౌర్యుల వంశానికి చెందిన చిత్రాంగద మోరీ హయాంలో దీన్ని నిర్మించారని అక్కడి గైడ్‌ అంకుల్‌ చెప్పాడు. తర్వాత రాజపుత్రుల పాలన కొనసాగిందట. చిత్తోర్‌గఢ్‌ను రాజధానిగా చేసుకొని కొన్ని వందల ఏళ్లు మహారాణా కుంభా, రాణా ప్రతాప్‌సింగ్‌, ఉదయ్‌సింగ్‌ లాంటి రాజులెందరో పరిపాలించారట.
మహారాణా కుంభా మందిరం, కీర్తి స్తంభం, విజయ స్తంభం లాంటి నిర్మాణాలు చెక్కు చెదరకుండా రాజపుత్రుల రాజసానికి గుర్తుగా కనిపిస్తాయి. అద్భుతమైన శిల్పాలతో నిర్మించిన విజయ స్తంభం తొమ్మిది అంతస్తులతో ఉంటుంది. పైకి వెళ్లడానికి 157 మెట్లు ఉన్నాయి. చివరి అంతస్తుకు వెళ్తే కోట పరిసరాలన్నీ చూసేయొచ్చు.

* ఈ కోట అలా ఇలా లేదు. భలే అందంగా ఉంది.
అందుకేనేమో దీన్ని సొంతం చేసుకోవాలని ఎందరో రాజులు ఎన్నో యుద్ధాలు చేశారట.  రాజులు మారినా, రాజ్యాలు మారినా.. కోట సౌందర్యం మాత్రం ఇప్పటికీ తగ్గలేదు.
* కోటమొత్తంలో పద్మిని కాంప్లెక్స్‌ నాకు ఎంత నచ్చేసిందో! మొన్నీమధ్య ‘పద్మావత్‌’ సినిమా వచ్చింది చూశారా? ఆ పద్మావతే ఈ మహారాణి పద్మిని. ఆమె పేరిట ఉన్న రాజమందిరం ఇప్పటికీ చూడొచ్చు. పద్మిని ఉద్యానవనం, జల్‌ మహల్‌ ఈ కాంప్లెక్స్‌లో ఉన్నాయి.
* ఇక కోట విషయానికి వస్తే... 180 మీటర్ల ఎత్తున్న గుట్టపై ఈ కోటను నిర్మించారు. బిరాచీ, గంభీరి నదుల మధ్యనున్న గుట్టపై దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. కోట పరిధి 13 కిలోమీటర్ల పైమాటే. చుట్టూ ఏడు పెద్దపెద్ద ద్వారాలున్నాయి. ఒక్కో ద్వారానికీ ఒక్కో పేరు. కోట లోపలికి వెళ్లామా..! ఎటు చూసినా అద్భుతాలే. రాజ మహళ్లు, ఆలయాలు, గజశాలలు, అశ్వశాలలు, చెరువులతో అచ్చం స్వర్గంగా కనిపిస్తుంది.
* ఇంకా ఇక్కడ ఆలయాలు బోలెడున్నాయి. అరుదైన శిల్పాలతో ఉన్న ఆరు జైన మందిరాలు అందరినీ ఆకర్షిస్తాయి. అద్భుతనాథ్‌ ఆలయం, సమాధీశ్వర గుడి, కాళికా దేవాలయం, తుల్జాభవాని గుడి, శ్యామ్‌ మందిరం ఇక్కడ ఉన్నాయి. శ్రీకృష్ణుడి పరమ భక్తురాలు మీరాబాయి ఆలయం కూడా ఇక్కడ ఉంది. ఆమె ఈ కోటలోనే ఉండేదట.
* కోటపై సహజ సిద్ధంగా వచ్చే నీటిధారతో ఏర్పడిన సరస్సు భలేగా ఉంది తెలుసా? ఇదొక్కటే కాదు... ఈ కోటలో దాదాపు 84 చిన్న చిన్న కొలనులు ఉండేవట. ప్రస్తుతం ఇరవై వరకు నీళ్లతో ఉన్నాయి. కోటలో సామాన్య జనావాసాలు ఉన్నాయి.
* ఈ కోటను చూడ్డానికి నాలా చాలా మందే వచ్చేశారు. దేశదేశాల నుంచి పర్యటకులు వస్తుంటారట. అప్పుడప్పుడు కోటలో వేడుకలూ జరుగుతుంటాయి. అప్పుడైతే సందర్శకుల తాకిడి ఇంకా ఎక్కువేనట. సరే అయితే కుదిరితే మీరూ వెళ్లిరండి. ఉంటానే బై బై!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని