Published : 05 Nov 2019 00:21 IST

పర్పుల్‌ కొండపై పచ్చల దండ!

చుట్టూ పచ్చని చెట్లు... మధ్యలో అందమైన భవనం... అచ్చం పచ్చల పేరులో పొదిగిన రత్నంలా ఉంటుందది... ఇంతకీ ఏంటది? దాని సంగతులేంటి?

* తూర్పు చైనాలో నాన్‌జింగ్‌ అనే ఓ నగరం ఉంది. దీనికి ఆరు కిలోమీటర్ల దూరంలో అందమైన జోంగ్షాన్‌ పర్వతం. దానిపై ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైంది ఏంటో తెలుసా? మీలింగ్‌ ప్యాలెస్‌. ఎందుకంటే చుట్టూ హారంగా పెరిగిన చెట్ల మధ్యలో.. లాకెట్‌లా ఈ భవనం భలేగా కనిపిస్తుంది. రుతువులు మారినప్పుడు కొన్ని చెట్ల ఆకుల రంగులూ మారతాయి! అలా ఈ భవన పరిసరాలు ఓసారి పచ్చలహారంగా.. ఇంకోసారి కెంపు సొంపులతో అలరిస్తాయి. రాత్రి వేళలో విద్యుద్దీపకాంతుల మధ్య ఈ ప్రాంతమంతా బంగారు వడ్డాణంలా మెరిసిపోతుంది.

* ఇంతకీ దీన్ని ఎవరు? ఎప్పుడు? కట్టారంటే.. 1931-34 మధ్యకాలంలో చైనా మాజీ అధ్యక్షుడు చియాంగ్‌ కై-షేక్‌ తన భార్య సూంగ్‌ మీలింగ్‌కు ప్రేమ కానుకగా కట్టించాడట. అందుకే దీన్ని ప్రేమ సౌధంగా పిలుస్తుంటారు.

* ప్యాలెస్‌ రెండు అంతస్తులతో ఉంటుంది. మీలింగ్‌ పుట్టిన రోజు మార్చి 4ను ప్రతిబింబించేలా 34 పాలరాతి స్తంభాలతో భవన నిర్మాణం చేశారు. ప్రతి స్తంభంపై అందమైన చిత్రాకృతులు కనిపిస్తాయి.

* పైకప్పును ఆకుపచ్చ రంగు టైల్స్‌తో, వాటిపై కనువిందు చేసేలా హంసల చిత్రాల్ని తీర్చిదిద్దారు.

* పైకి ఈ భవనం చైనా నిర్మాణ శైలిలో కనిపించినా.. లోపల విదేశీ వైభవం దర్శనమిస్తుంది. బల్లలు, సోఫాలు, షాండ్లియర్లు, మంచాలు ఖరీదైన వస్తువులు... ఇలా అన్నీ విదేశాల నుంచి తెప్పించినవే.

* చియాంగ్‌ దంపతులు సెలవుల్లో, ప్రత్యేక సందర్భాల్లో మీలింగ్‌ ప్యాలెస్‌కు వచ్చేవారట. 1949లో చైనా అంతర్యుద్ధం ముగిసే సమయంలో వీరిద్దరూ ప్యాలెస్‌ వదిలి తైవాన్‌కు వలస వెళ్లారు. ఈ భవనం మాత్రం మీలింగ్‌ ప్యాలెస్‌గానే నిలిచిపోయింది. ఇక్కడి ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుని జోంగ్షాన్‌ నేషనల్‌ పార్క్‌కు అప్పగించింది. చాలా కాలం ఈ భవనం ఖాళీగా ఉంది.

* కొన్ని సంవత్సరాల కిందట ఈ ప్యాలెస్‌కు మరిన్ని హంగులు అద్ది సందర్శక ప్రాంతంగా మార్చారు. అప్పటి నుంచి వేలాదిగా పర్యటకులు వస్తున్నారు.

* మీలింగ్‌ ప్యాలెస్‌ ఉన్న జోంగ్షాన్‌ హిల్‌కి మరో పేరు పర్పుల్‌ పర్వతం. సూర్యాస్తమయ సమయంలో ఈ కొండపై మేఘాలు ఎరుపు, నీలం కలిసిన రంగులో మెరిసిపోతూ దర్శనమిస్తాయట. అందుకే దీనికా పేరు వచ్చింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు