Published : 04 Dec 2019 00:29 IST

దరికొచ్చిన అంతరిక్షం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా? నేను ఎవరని చూస్తున్నారా? నేనండీ  బస్సును.. బస్సంటే మాములు బస్సును కాదు! ఎన్నెన్నో అంతరిక్ష విశేషాలు.. మోసుకు వస్తున్న దాన్ని. ప్రస్తుతానికి వరంగల్‌కు వచ్చాను.. మీరంతా ఇక్కడికి రాలేరు కదా.. అందుకే మీ కోసం నేనే ఇలా వచ్చా... మరి ఆ విశేషాలేంటో తెలుసుకుంటారా..?!

మీకు భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌సారాభాయ్‌ తెలుసుగా! ఇస్రోను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన శతజయంతి సందర్భంగా ‘ఇస్రో’ పాఠశాల పిల్లల కోసం దేశమంతా
బస్సును తిప్పుతోంది. బస్సంటే అది మామూలుది కాదు, ఒక్కమాటలో చెప్పాలంటే ఓ బుల్లి అంతరిక్ష కేంద్రం! ఆ బస్సును నేనే! ‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో నన్ను తిప్పుతున్నారు. నేను మంగళవారమే వరంగల్‌ చేరుకున్నా. జాతీయ సాంకేతిక సంస్థ(నిట్‌)లో నేటినుంచి రెండు రోజులపాటు ప్రదర్శన జరగనుంది. నేను మోసుకొచ్చిన అంతరిక్ష విశేషాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. వీటిని చూసేందుకు సుమారు 20 వేల మంది విద్యార్థులు రానున్నారు.  

మీ కోసం ఎన్నో... నమూనాలు తెచ్చా!
మీరు నిజమైన ఉపగ్రహాలను చూసి ఉండకపోవచ్చు. అందుకే మీ కోసం వాటి బుల్లి నమూనాలను నాతోపాటు తీసుకొచ్చా! ఏదైనా రాకెట్‌ ప్రయోగం జరిగినప్పుడు.. వార్తల్లో ఎక్కువగా.. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ అనే పేర్లు వినిపిస్తుంటాయి... కనిపిస్తుంటాయి. అంటే ఏంటి? వాటి పనితీరు ఏంటి? రాకెట్లను ఎలా ప్రయోగిస్తారు? రాకెట్లలో ఉపగ్రహాలను ఎలా భద్రపరుస్తారనే వివరాలనూ మోసుకొచ్చాను. ఇంతేనా? భారత అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? అది ఎలా విజయాలు సాధిస్తూ వస్తోంది.. ఇలాంటి విలువైన సమాచారం, మరెన్నో అంతరిక్ష విశేషాలనూ తీసుకొచ్చా.

అంతరిక్ష కేంద్రంలో ఉన్నట్లే!
మీరు ఇక్కడకు వస్తే.. అంతరిక్ష కేంద్రంలోకి వచ్చినట్లే అనిపిస్తుంది. చంద్రయాన్‌-1, మంగళ్‌యాన్‌ యాత్రకు సంబంధించిన నమూనాలు అబ్బుర పరుస్తాయి. శ్రీహరికోటలో రాకెట్లను ప్రయోగించే పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ లాంచింగ్‌ ప్యాడ్‌లు, లాంచింగ్‌ వెహికల్స్‌కు అచ్చుగుద్దినట్టుగా బుల్లి నమూనాలున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందించిన కొన్ని గొప్ప ఉపగ్రహాల నమూనాలనూ చూడొచ్చు. నిజమైన ఉపగ్రహాలు పెద్ద కారు పరిమాణంలో ఉంటే, ఇక్కడి నమూనాలు మన చేతిలో పట్టుకునేంత చిన్నగా ఉంటాయి. త్రీడీ నమూనాలూ ఆకట్టుకుంటాయి. బస్సు లోపలే కాదు, బయటా ప్రదర్శన ఉంటుంది. ఆర్యభట్ట నుంచి చంద్రయాన్‌-1 వరకు అనేక రకాల ఉపగ్రహాల నమూనాలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. వీటి గురించి శాస్త్రవేత్తలు ఓపిగ్గా వివరిస్తారు. అవన్నీ పూర్తయ్యాక.. మీరూ వ్యోమగామిలా మారొచ్చు! ఎలాగంటే ఇక్కడ వ్యోమగామి దుస్తుల నమూనా ఉంది. అందులో మనం తల పెడితే అచ్చం వ్యోమగామిలా కనిపిస్తాం. అప్పుడు ఓ ఫొటో తీసుకోవచ్చన్నమాట.

దేశమంతా.. ప్రదర్శనలు
నిజానికి నేనొక్కదాన్నే కాదు.. నాలా.. మరో అయిదు.. అంటే మొత్తం ఆరు బస్సులున్నాయి. ‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ దేశవ్యాప్తంగా తిరుగుతుంటాయి. ఇలా ఏడాదిలో వంద ప్రదర్శనలు ‘ఇస్రో’ ఆధ్వర్యంలో జరగనున్నాయి. నేను మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో తిరుగుతాను అన్నమాట. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 25 చోట్ల ప్రదర్శనలు జరిగాయి. విక్రమ్‌ సారాభాయ్‌  గౌరవార్థం ‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’ కార్యక్రమం ఆగస్టులో ఆయన జయంతి రోజు అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. 2020 ఆగస్టు వరకు వందచోట్ల ప్రదర్శనలు పూర్తి కానున్నాయి. విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం ఉన్న కేరళలోని తిరువనంతపురంలో చివరి ప్రదర్శన చేయనున్నారు. అన్నట్లు చెప్పడం మరిచిపోయా.. హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్ సెన్సింగ్‌ సెంటర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటోంది.

సరే ఫ్రెండ్స్‌.. ఈ రెండు రోజులు నన్ను చూడటానికి చాలామంది విద్యార్థులు వస్తారు కదా..  నేను కాస్త బిజీ.. ఉంటాను మరి బైబై!
- జి.పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని