Published : 17 Dec 2019 00:29 IST

కంటికి.. పంటికి.. ఒంటికి..

Light Amplification by Stimulated Emission of Radiation

లేజర్‌ లైట్‌ అనేది ఆడుకునే బొమ్మేనా?! కేవలం వినోదం కోసమేనా? దీని వల్ల ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఉంటే.. ఏఏ రంగాల్లో లేజర్‌ను వాడుతున్నారు.. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందామా!
మీరు ఎగ్జిబిషన్లలో, బొమ్మల దుకాణాల్లో, ఆన్‌లైన్‌లోనో ఎక్కడో ఓ చోట.. ఎప్పుడో ఓ సారి లేజర్‌ గన్‌ కొనుక్కొని ఆడుకునే ఉంటారు కదా! అప్పుడు మీరు మాములు టార్చ్‌లైట్‌కు లేజర్‌ లైట్‌కు తేడా గమనించి ఉంటారు! మాములు లైట్‌ నుంచి వచ్చే వెలుగు అన్ని వైపులకూ వెళుతుంది. లేజర్‌ లైట్‌ మాత్రం చెల్లాచెదురు కాదు. అందులోని కాంతి నేరుగా ప్రయాణిస్తుంది.


అంతరిక్షానికీ వెళుతుంది!

మాములు టార్చ్‌లైట్‌ కాంతి కొంత దూరమే వెళుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక కిలోమీటరు దూరం వరకు కాంతి వెళ్లే టార్చ్‌లైట్లూ దొరుకుతున్నాయి. దీనికే మనం ‘అయ్‌..బాబోయ్‌!’ అని ఆశ్చర్యపోతాం కానీ.. లేజర్‌ కిరణాలు ఎంచక్కా అంతరిక్షం వరకూ పోతాయి. నిజానికి లేజర్‌లో చాలా రకాలే ఉన్నాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా ఉపయోగపడుతుందన్నమాట. రాకెట్లు, శాటిలైట్లతో (ఉపగ్రహాలు) సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి రేడియా సిగ్నళ్లతో పాటు లేజర్‌ కిరణాలూ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతే కాదు.. వాతావరణ సమాచారం కోసమూ శాస్త్రవేత్తలు లేజర్‌పై ఆధారపడతారు. ముఖ్యంగా మేఘాలు ఎంత ఎత్తులో ప్రయాణిస్తున్నాయి. అవి ఎంత దట్టంగా ఉన్నాయి.. ఇలాంటి విషయాలు తెలుస్తాయి. శాటిలైట్లు, వాతావరణానికి సంబంధించిన సమాచారం మనకు ఎంత అవసరమో మీకు తెలిసిందే కదా! విచిత్రం ఏంటంటే.. సీడీ, డీవీడీ ప్లేయర్లలోనూ లేజర్‌ ఉంటుంది.


శత్రువులకు ఇదంటే వణుకే!

లేజర్‌ కిరణాలను రక్షణ అవసరాల కోసమూ వాడుతున్నారు. ఎలా అంటే.. మన దేశం మీద ఎవరైనా శత్రుదేశాల వాళ్లు మిసైళ్ల (క్షిపణులు)తో దాడికి దిగారనుకోండి. అప్పుడు ఈ లేజర్‌ కిరణాలు ప్రయోగిస్తే.. వాటిని గాల్లోనే నాశనం చేస్తాయి. మీరు ఆడుకునే లేజర్‌తో పోల్చుకుంటే.. ఈ కిరణాలు కొన్ని వేలరెట్లు శక్తిమంతమైనవి. కొన్ని రకాల లేజర్లు వేడిని, నిప్పును సైతం పుట్టిస్తాయి. మరి కొన్ని రకాల లేజర్లైతే ఏకంగా వజ్రాల్లో రంధ్రాలు చేయగలవు. వెన్నముద్దను కోసినంత సులువుగా స్టీలు దూలాన్నీ నిశ్శబ్దంగా ఈ కిరణాలు కోసేయగలవు.


* 1954మొదటి సారిగా డా.చార్లెస్‌.టౌన్స్‌ మొదటిసారిగా లేజర్‌ను ప్రతిపాదించారు.
* 1960లో హెచ్‌.మైమన్‌ ఆయన అనుచరులు పరిశోధనశాలలో ప్రదర్శించారు.
* మొట్టమొదటి లేజర్‌ ‘రూబీ’. 2.5 సెంటీమీటర్ల పొడవు, పెన్సిలంత మందం ఉండేది.
* ఇది అల్యూమినియం, ఆక్సిజన్‌ మూలకాల మిశ్రమం.
* దీనిలో క్రోమియంను ప్రవేశపెట్టి కొన్ని ప్రక్రియలతో లేజర్‌ వెలువడేలా చేశారు.


వైద్యానికీ లేజర్‌

లేజర్‌ అంటే కేవలం నాశనం చేయడమే కాదు. దీనికి బాగుచేసే లక్షణమూ ఉంది. ప్రస్తుతం వైద్య రంగంలో లేజర్‌ను చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఆపరేషన్లు(శస్త్రచికిత్సలు), ముఖ్యంగా కాస్మోటిక్‌ సర్జరీల్లో ఉపయోగిస్తున్నారు. రూట్‌కెనాల్‌ అనేది పంటికి సంబంధించిన వైద్యం. ఇది చేసేటప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. ఈ బాధ తగ్గాలంటే లేజర్‌ రూట్‌కెనాల్‌ చేసుకుంటారు. అంటే లేజర్‌.. చిగుళ్లు, పంటిని సుతిమెత్తగా కోస్తుంది. కంటి ఆపరేషన్లలోనూ ముఖ్యంగా ఏదైనా ప్రమాదం వల్ల రెటీనా కాస్త అటు ఇటూ జరిగినా.. లేజర్‌ కిరణాలను ఉపయోగించి సరిచేస్తారు. కానీ ఈ లేజర్‌ వేరు. మిగతా లేజర్లైతే నేరుగా కంటిలో పడితే చాలా ప్రమాదం.

- ప్రొ।। ఈవీ సుబ్బారావు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు