దొరికేశాయ్ కొత్తకొత్త జీవులు!
ఏంటి మమ్మల్ని వింతగా చూస్తున్నారు.. కొత్తగా ఉన్నామనా?... మా అయిదుగురినే ఇలా చూస్తున్నారు... ఇక మొత్తం 71 జీవులం వస్తే ఏంటీ మీ పరిస్థితి! ఇంతకీ మేం ఎవరం? అసలు ఈ 71 ఏంటనా? మీ సందేహం.. ఇంకెందుకాలస్యం చదివేయండి మరి!
ఏం లేదు ఫ్రెండ్స్.. మమ్మల్ని మీ శాస్త్రవేత్తలు ఈ ఏడాది కాలంలో కొత్తగా గుర్తించారు. 2019 సంవత్సరం మరి కొన్ని గంటల్లోనే ముగియనుంది! అందుకే మా గురించి చెప్పుకొందామని ఇలా వచ్చాం. కానీ అందరం కట్టకట్టుకొని వస్తే బాగుండదు కదా.. అందుకే ఇలా అయిదుగురం మీ ముందుకు వచ్చాం.
శోధించి సాధించారు!
* మేము ఎప్పటి నుంచో మీ మధ్యే ఈ భూమి మీదే ఉన్నా.. మమ్మల్ని ఈ మధ్యే గుర్తించారు!
* నిజానికి మేం అనే కాదు.. ప్రతి ఏడూ.. ఏవో కొన్ని జీవాలు మీ శాస్త్రవేత్తల కంటపడుతూనే ఉంటాయి.
* మేం అంత తేలిగ్గా ఏమీ.. మీ సైంటిస్టుల కంటికి చిక్కములెండి.
* ఎందుకంటే మాలో కొన్ని భూమ్మీద మారుమూల ప్రాంతాల్లో.. మరి కొన్ని సముద్రపు అట్టడుగున ఎక్కడో ఉంటాయి మరి!
* మా కోసం మీ వాళ్లు ఏకంగా 5 ఖండాలు, మూడు సముద్రాలను జల్లెడ పట్టారు.
* ఇలా కాగడా పట్టుకుని మొత్తానికి 71 జీవుల్ని కనుక్కొన్నారు.
* ఇందులో బల్లులు, సముద్ర స్లగ్‌లు (గుల్ల లేకుండా నత్తలా ఉండే జీవులు), చేపలు, సాలీళ్లు, పగడాలు, పూలమొక్కలు ఉన్నాయి.
* ఈ భూమి మీద మారుమూల ప్రాంతాల్లో ఇంకా గుర్తించాల్సిన జీవులు చాలానే ఉన్నాయని మీ శాస్త్రవేత్తలు ఇప్పటికీ చెబుతున్నారు.
ఆ వంకా.. ఈ వంకా.. వకండా!
నా పేరు సిర్ర్‌హిలాబ్రస్ వకండా! పలకడానికి ఇబ్బందిగా ఉంది కదూ! అందుకే నన్ను ముద్దుగా వకండా చేప అని పిలుచుకోండి సరేనా! వకండా అనేది ఓ దేశం పేరు. కానీ నిజంగా ఆ దేశం లేదు! మార్వల్ కామిక్స్ వారు కథల్లో ఈ దేశాన్ని ఆఫ్రికా ఖండంలో సముద్ర తీర దేశమని కల్పించారు. ఇదంతా భలే తమాషాగా ఉంది కదూ! సరే ఇక నా విషయానికి వద్దాం. నేను సముద్రంలో అట్టడుగున చీకటి ప్రదేశాల్లో ముఖ్యంగా పగడాల దిబ్బల్లో బతికేస్తాను. అందుకే నన్ను ఇన్ని సంవత్సరాలు మీ శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. నేను పర్పుల్(ఊదా) రంగులో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాను. నాలాగే మరో 16 కొత్త రకం చేపల్ని మీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
సముద్ర నత్త
నిజానికి నేను నత్తను కాను.. నన్ను సీ స్లగ్స్ అంటారు. అంటే కవచం లేకుండా ఉండే నత్త అనుకోండి. నిజానికి నా కంటే ముందు నా గుడ్లను కనుక్కొన్నారు. వీటిని పాప్వా న్యూ గినీ ద్వీపానికి ఆనుకుని ఉన్న సముద్ర గర్భంలో గుర్తించారు. ఈ ద్వీపం ఆస్ట్రేలియా ఖండానికి పై భాగాన ఉంటుంది. ముందు మా గుడ్లను చూసి ఏవో వింతగా ఉన్నాయని లోతుగా శాస్త్రవేత్తలు పరిశోధిస్తే మా గురించి తెలిసింది. మాతో పాటు మరో అయిదు రకాల సీ స్లగ్‌లను కనిపెట్టారు.
పువ్వల్లే నవ్వుల్.. నవ్వుల్!
గర్వేసియా సర్రేటిఫోలియా... ఇది నాపేరు. నన్ను మడగాస్కర్‌లో కనుక్కొన్నారు. కేవలం మెరిజెజ్జీ నేషనల్ పార్కులోనే కనిపిస్తాను. ప్రపంచంలో ఇంకెక్కడా లేను. నాకు చిన్న చిన్న అందమైన పూలు పూస్తాయి. ఈ సంవత్సరం మొత్తం ఎనిమిది రకాల కొత్త పూల మొక్కలను మీ సైంటిస్టులు కనిపెట్టారు.
భలే.. భలే.. బల్లి
నన్ను మధ్య ఆఫ్రికాలోని అంగోలా పర్వత శిఖరంపై కనుక్కొన్నారు. నన్ను గిర్‌డెల్డ్ లిజర్డ్ అని పిలుస్తున్నారు. నాకింకా సరైన పేరు పెట్టలేదు. పోనీ.. మీరు ముళ్ల బల్లి అని పిలుచుకోండి సరేనా! మా ఒంటి మీద ముళ్లలాంటి నిర్మాణాలుంటాయి. చూడటానికి ఓ రకంగా డ్రాగన్‌లా ఉంటాం. ఇంకా నాతో పాటు 16 మచ్చల ఊసరవెల్లులు, బల్లులను శాస్త్రవేత్తలు 2019లో గుర్తించారు.
పగడాల కొమ్మ..
నా ఫొటో చూసి ఏదో మొక్క కొమ్మ అనుకొని పొరబడుతుంటారు. నిజానికి నేను సముద్రజీవిని. క్రోమోప్లెక్సురా కార్డెల్‌బాంకెన్సిస్ నా పేరు. శాస్త్రవేత్తలు నన్ను ‘సీ ఫాన్ కోరల్’గా తేల్చారు. అంటే ఓ రకంగా పగడం అనుకోండి! నన్ను శాన్‌ఫ్రాన్సిస్కో తీరం నుంచి 60 మైళ్ల దూరంలో గుర్తించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad: విశ్రాంత ఐఏఎస్ అధికారికి మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా
-
India News
Amit Shah: బెంగాల్లో ఘర్షణలపై హోం మంత్రి అమిత్ షా ఆరా.. గవర్నర్‌కు ఫోన్
-
Sports News
GT vs CSK: రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ మిస్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ