కొండవీడు కోట చూడు!

హాయ్‌ నేనే మీ చిన్నూను. కొండవీడు కోట పేరు మీరెప్పుడైనా విన్నారా! ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ కోటల్లో ఇది ఒకటి. ఒకప్పటి ఈ అద్భుత నిర్మాణం నేడు చాలా శిథిలావస్థకు చేరింది. అయినా ఆనాటి కట్టడాలు, ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆ కోట కబుర్లు మీ కోసం..

Updated : 02 Jan 2020 03:41 IST

కోట కథలు-కొండవీడు 

హాయ్‌ నేనే మీ చిన్నూను. కొండవీడు కోట పేరు మీరెప్పుడైనా విన్నారా! ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ కోటల్లో ఇది ఒకటి. ఒకప్పటి ఈ అద్భుత నిర్మాణం నేడు చాలా శిథిలావస్థకు చేరింది. అయినా ఆనాటి కట్టడాలు, ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆ కోట కబుర్లు మీ కోసం..

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో సముద్రమట్టానికి 1,700 అడుగుల ఎత్తులో కొండవీటి కొండలపై ఉంటుందీ కోట. గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉంది. ఈ దుర్గంలో 21 నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇప్పుడు శిథిలమయ్యాయి.
* 44 కోట బురుజులు, ప్రాకారాలు, ధాన్యాగారాలు, దేవాలయాలు, గుర్రపుశాలలు, ఆయుధశాల, మసీదు, ఖజానా వంటి నిర్మాణాలు నాటి చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్నాయి.

* తారా బురుజు, జెట్టి బురుజు, నెమళ్ల బురుజు, రమణాల్‌ బురుజు ముఖ్యమైనవి. వీటి కేంద్రంగానే సైనికులు కాపలా కాసేవారు.
* రెడ్డి రాజుల్లో మొదటివాడైన ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకొని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన తరువాత అతని కుమారుడు అనపోతారెడ్డి రాజయ్యాడు. ఆయన సమయంలో అద్దంకి నుంచి రాజధానిని కొండవీడుకు మార్చారు. శత్రుమూకల దండయాత్రల నుంచి రాజ్యాన్ని కాపాడటానికి ఈ కోటను నిర్మించారు. కవిసార్వభౌముడు శ్రీనాథుడు కొండవీడు సామ్రాజ్యంలో పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశారు.

* రెడ్డి రాజుల పతనం తరువాత కోట విజయనగర ప్రభువులు, గోల్కొండ సుల్తానుల హస్తగతమైంది.  
* కోట పరిసరాల్లో పురావస్తుశాఖ వారు తవ్వకాలు జరపగా రెండు వేల ఏళ్ల నాటి బౌద్ధ స్థూపం, మట్టిపాత్రలు, చైనాకు చెందిన పింగాణీ పాత్రల ముక్కలు బయటపడ్డాయి. కొండ మీదికి వెళ్లే కాలిబాట పక్కన, ఏటవాలు ప్రాంతాల్లో స్థూప అవశేషాలను చూడొచ్చు. దీని నిర్మాణానికి లేత ఆకుపచ్చ, నలుపు, నాపరాళ్లు వాడారు. ఈ స్థూపంపైనే శివాలయాన్ని నిర్మించారు.

* నీటి అవసరాల కోసం కొండ మీద ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ల అనే మూడు గొలుసుకట్టు చెరువులు తవ్వారు. నీరు వృథా కాకుండా ఒక చెరువు నిండగానే ఇంకో చెరువులోకి వెళ్లే ఏర్పాటు చేశారు.  
* కొండ కింద కత్తుల బావి ఉంది. దీన్నే చీకటి కోనేరు అనీ అంటారు. శత్రువులను చంపడానికి దీన్ని నిర్మించారట.
* ఈ కోటలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇక్కడి వేణునాథస్వామి దేవాలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు.

* కొండ దిగువన చుట్టూ 37 ఎకరాల విస్తీర్ణంలో కందకం ఉండేది. కొండ మీద పడ్డ వాననీరంతా ఇందులోకి చేరేది. కోటలోకి ఎవరూ ప్రవేశించకుండా కందకంలో మొసళ్లు పెంచేవారట.
* కోటకు వెళ్లే మార్గం చాలా అందంగా ఉంటుంది. పాములా వంకర్లు తిరిగిన ఘాట్‌ రోడ్డుపై ప్రయాణం భలేగా అనిపిస్తుంది.
* కోటను ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించేందుకు యునెస్కో ప్రాథమికంగా అంగీకరించింది. అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది.
- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌, ఈజేఎస్‌

 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని