బంగారు బాదానికి శుభాకాంక్షలు!

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఎవరబ్బా? అనుకుంటున్నారా? మీరు డ్రైఫ్రూట్స్‌ తినే ఉంటారుగా... అదిగో అందులో నా పండ్లూ ఉంటాయ్‌ మరి... తెలియట్లేదా? అయితే నేనే చెప్పేస్తున్నా... ఆప్రికాట్‌ చెట్టును... నా విషయాలు చెప్పాలని ఇలా వచ్చా... ఈరోజే రావడానికి ఓ ప్రత్యేకమైన కారణమూ ఉందండోయ్‌... అదేంటంటే... ఈరోజు ఆప్రికాట్‌ డే... నా పండు గొప్పతనం తెలుపుతూ ఈరోజును కేటాయించారన్నమాట...

Published : 09 Jan 2020 01:28 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఎవరబ్బా? అనుకుంటున్నారా? మీరు డ్రైఫ్రూట్స్‌ తినే ఉంటారుగా... అదిగో అందులో నా పండ్లూ ఉంటాయ్‌ మరి... తెలియట్లేదా? అయితే నేనే చెప్పేస్తున్నా... ఆప్రికాట్‌ చెట్టును... నా విషయాలు చెప్పాలని ఇలా వచ్చా... ఈరోజే రావడానికి ఓ ప్రత్యేకమైన కారణమూ ఉందండోయ్‌... అదేంటంటే... ఈరోజు ఆప్రికాట్‌ డే... నా పండు గొప్పతనం తెలుపుతూ ఈరోజును కేటాయించారన్నమాట... మరి చెప్పేయనా? నా ముచ్చట్లన్నీ!

ఇదే నా కుటుంబం!
మీకు నా పండు రుచి తెలుసు గానీ నన్ను చూసి ఉండరు. మాది రోసేసి కుటుంబం. మీరంతా ఆప్రికాట్‌ అనేస్తారు కానీ మీ దగ్గర కొన్ని ప్రాంతాల్లో సీమ బాదం అనీ అంటుంటారు. శాస్త్రీయ నామం ప్రునస్‌ ఆర్మేనియాకా. బాదం, పీచ్‌, చెర్రీ చెట్లు మాకు చుట్టాలు. ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగేస్తా.

మరి నా చిరునామా!
ఇప్పుడంటే అంటార్కిటికాలో తప్ప ప్రపంచమంతా పాకిపోయాను. కానీ నన్ను మొదటిసారిగా ఎక్కడ పండించారనే విషయంపై భిన్న వాదనలే ఉన్నాయి. కొందరు ఆర్మేనియాలో మొదటిసారిగా పండించారని చెబితే మరికొందరు భారత్‌లో పండించారని, ఇంకా చైనాలో పండించారని చెప్పుకొంటుంటారు.  చైనాలో నా పండ్లను ‘మూన్స్‌ ఆఫ్‌ ద ఫెయిత్‌ఫుల్‌’ అని పిలుస్తారు.
* ప్రస్తుతం నన్ను ఎక్కువగా అమెరికాలో పండిస్తారు. తర్వాతి స్థానాల్లో టర్కీ, ఇరాన్‌, ఇటలీ, అల్గేరియా దేశాలున్నాయి.
* నా పండుకు ఎంత విశిష్టత ఉందంటే అమెరికాలో ఏటా జనవరి 9ని నాకోసం కేటాయించి ఆప్రికాట్‌ డే జరుపుతారు తెలుసా? నా పండ్లను తింటూ సంబరాలు చేసుకుంటారు.
* లాటిన్‌లో నాపేరుకు అర్థం విలువైనది అని!

నా ఒడ్డూపొడుగూ!
నేను చిన్న పొదలా ఉండే చెట్టును. కొంచెం రేగు చెట్టులా ఉంటా. 26 నుంచి 39 అడుగుల ఎత్తు వరకు పెరుగుతా. ఇక నా కాండమేమో 16 అంగుళాల మందం ఉంటుందంతే. నా ఆకులేమో ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అంచుల్లో కాస్త వంకర తిరిగి కనిపిస్తాయి. పవ్వులు తెల్లగా గుత్తులుగా పూస్తాయి. ఇక నా పండ్ల విషయానికి వస్తే... పసుపు, ఆరెంజ్‌ రంగుల్లో ఉండే ఇవి చెర్రీ, ఆలీవ్‌ పండ్లలా మధ్యలో గట్టి విత్తనంతో ఉంటాయి.
* నా తాజా పండ్లను నేరుగా లేదంటే పదార్థాలుగా చేసుకునీ, ఎండబెట్టుకునీ తింటారు.
* మా జీవిత కాలం దాదాపు 20 నుంచి 25 ఏళ్లు.

నాతో మీకు లాభాలు!
* నా పండ్లలో ఎక్కువగా విటమిన్‌ ఏ ఉంటుంది. ఇంకా పీచు, విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, పొటాషియం, ఐరన్‌ వంటివీ సమృద్ధిగానే ఉంటాయి.  
* ఎక్కువగా నా పండ్లను జామ్‌ల తయారీలో వాడుతుంటారు.
* నా నుంచి తీసిన నూనెను చికిత్సలకు వాడుతుంటారు. 300 ఏళ్ల క్రితం నా నూనెను కణుతులు, అల్సర్లు, వాపులు తగ్గించేందుకు వాడేవారు. క్యాన్సర్‌ నుంచి ఉపశమనం కలిగించే గుణాలు నాలో ఉన్నాయని ఆధునిక పరిశోధనలు తేల్చాయి.

మీ దేశంలో హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ల్లో నన్ను ఎక్కువగా పండిస్తుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు