జారే... మజారే!

ఆ వీధుల్లో నడవడమంటేనే పెద్ద సాహసం... అడుగులు పడినకొద్దీ తెగ ఆయాసపడిపోతాం... ఆ దారుల్లో వాహనాల్ని మరింత జాగ్రత్తగా నడపాలి... ఒక్కమాటలో చెప్పాలంటే ఓరకమైన వింతరైడ్‌ చేసినట్టే... ఎందుకో? ఇంతకీ ఎక్కడున్నాయి? ఏంటా విశేషాలు?

Published : 13 Feb 2020 00:21 IST

ఆ వీధుల్లో నడవడమంటేనే పెద్ద సాహసం... అడుగులు పడినకొద్దీ తెగ ఆయాసపడిపోతాం... ఆ దారుల్లో వాహనాల్ని మరింత జాగ్రత్తగా నడపాలి... ఒక్కమాటలో చెప్పాలంటే ఓరకమైన వింతరైడ్‌ చేసినట్టే... ఎందుకో? ఇంతకీ ఎక్కడున్నాయి? ఏంటా విశేషాలు?


లాంబర్డ్‌ వీధి

పచ్చని చెట్ల మధ్య పాములా మలుపులు తిరిగిన ఈ వీధిని చూస్తే భలే ముచ్చటేస్తుంది కదూ. కొండ పై నుంచి కింది వరకు ఆ మెలికల దారిలో నడుస్తుంటే గమ్మత్తుగా ఉంటుంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉందిది. ‘క్రుకెడ్‌ స్ట్రీట్‌’గా దీనికి పేరు. ఎత్తయిన కొండ మీద నుంచి కింది వరకు మొత్తం ఎనిమిది వంకలతో ఉండే ఈ వీధి 600 అడుగుల పొడవుంటుంది. ఈ మలుపుల మధ్య దారికి రెండు వైపులా రంగురంగుల పూదోటలు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి మధ్య సాగే దారిని వన్‌వేగా ఉపయోగిస్తుంటారు. బాబోయ్‌ అసలే వంపులు... పైగా కొండ నుంచికి కిందకు ప్రయాణం మరి అదుపు తప్పితే? అందుకే ఇక్కడ వాహనాలు గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలి. మన నడక కన్నా కాస్త వేగం అంతే. వింతగా ఉండటంతో ఇదో మంచి పర్యటక ప్రాంతంగా మారిపోయింది.


బాల్డ్విన్‌ వీధి

మొన్నమొన్నటి వరకు ప్రపంచంలోని ఏటవాలు వీధిగా దీనికే పేరుండేది. ఇది న్యూజిలాండ్‌లోని డునెడిన్‌లో ఉంది. ఇది ఫోర్డ్‌ పెన్‌ లెక్‌ కన్నా కాస్త తక్కువ ఏటవాలుతో ఉండటంతో ఆ రికార్డు దానికెళ్లిపోయిందట. దీనిపై నడవాలన్నా పాదచారులు ఆపసోపాలు పడాల్సిందే. సాహసికులు దీనిపై సైక్లింగ్‌ చేస్తూ సరదా తీర్చుకుంటారు. ఓవైపు కిందికి కూరుకుపోయినట్టు... మరోవైపు ఎత్తులో ఉన్న ఇళ్లని చూస్తూ వాటి ముందు సందర్శకులు ఫొటోలూ దిగుతుంటారు.


ఫోర్డ్‌ పెన్‌ లెక్‌

దీని పేరుకు అర్థమేంటో తెలుసా? వే టు ద టాప్‌ ఆఫ్‌ ద రాక్‌. ఇది వేల్స్‌లోని హార్లెక్‌ అనే పట్టణంలో ఉంది. బాబోయ్‌ దీనిపై నడక మామూలు విషయం కాదు. కాలు జారిందో ఎముకలు విరగాల్సిందే. మరి కార్లు, బైకులెలా వెళ్తాయబ్బా అంటారేమో వాటి సంగతీ అంతే. అతి కష్టం మీద మరెంతో నెమ్మదిగా వెళ్లాలి. హ్యాండ్‌ బ్రేక్‌ వేసినా కిందకి జారిపోతాయి. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఏటవాలు వీధి. ఈమధ్యే దీనికీ రికార్డొచ్చింది. దాదాపు 400 మీటర్ల పొడవుండే ఈ దారి సముద్రతీరానికి 37.45 డిగ్రీల కోణంలో వంపుగా ఉంటుంది. కాస్త ఎత్తులో ఉన్న దారిలో నడవటానికే అమ్మోఅయ్యో! అంటాం. మరి ఇంత ఎత్తులో ఉంటే? కష్టమే కదూ. జర్రున జారే ఈ వీధిలో ప్రత్యేక వేడుకలూ, పోటీలు జరుపుతుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని