Updated : 14 Feb 2020 00:22 IST

అయ్.. బాబోయ్ ఎంత పొడవో!

ఏంటి అలా చూస్తున్నారు? చూసి చూసి మీ మెడలు నొప్పి పుట్టాల్సిందే! ఎందుకంటే నేను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టును! నా గురించి మరిన్ని వివరాలు కావాలా?! ఇంకెందుకాలస్యం.. చదివేయండి మరి!
* నా పేరు హైపెరియన్‌.
* నేను కోస్ట్‌ రెడ్‌వుడ్‌ జాతికి చెందిన చెట్టును.
* మామూలుగానే రెడ్‌వుడ్‌ చెట్లన్నీ చాలా ఎత్తు పెరుగుతాయి. సగటున సుమారు 300 అడుగుల వరకు చేరుకుంటాయి.
* వీటిలో మిగతా వాటికంటే నేను మరింత ఎత్తుంటానన్నమాట.
* ప్రస్తుతం నా ఎత్తు 380.1 అడుగులు
* స్టాట్చ్యూ ఆఫ్‌ లిబర్టీ కన్నా నేనే ఎత్తుంటా. దాని పొడవు కేవలం 305 అడుగులు మాత్రమే.
* ఇటలీలోని పీసా టవర్‌(183అడుగులు), ఇంగ్లాండ్‌లోని బిగ్‌బెన్‌ క్లాక్‌ టవర్‌ కన్నా నేనే ఎత్తుంటా.


ఈ ఇద్దరికీ రుణపడి ఉంటా..  

* క్రిష్‌ అట్‌కిన్స్‌, మైకేల్‌ టైలర్‌.. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో నేనే అత్యంత ఎత్తైన చెట్టును అని తేల్చింది వీరే మరి.
* నన్ను మొట్టమొదట 2006 ఆగస్టు 25న వీరు గుర్తించారు.
* అప్పట్లో నా ఎత్తు 379.1 అడుగులు.
* అంటే అప్పటికీ.. ఇప్పటికీ ఓ అడుగు ఎత్తు పెరిగానన్నమాట.
*అయ్యో!.. ఇంతకీ నా చిరునామా ఏంటో మీతో చెప్పనేలేదు కదూ!
* నేను కాలిఫోర్నియాలో ఓ మారుమూల ప్రాంతంలో ఉంటాను.
* నేను ఉండే ప్రాంతాన్ని రెడ్‌వుడ్‌ నేషనల్‌ అండ్‌ స్టేట్‌ పార్క్స్‌ వారు 1978లో కొనుగోలు చేశారంట!


వయసు చూడతరమా!

* మీలా నాకు బర్త్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులు లేవు. కానీ.. నా వయసు సుమారు 600 సంవత్సరాలుంటుందని
మీ శాస్త్రవేత్తలు తేల్చారు.

* ఇంకొందరు సైంటిస్టులు మాత్రం 700 నుంచి 800 సంవత్సరాలూ ఉండొచ్చు అని అభిప్రాయ పడుతున్నారు.
* ఏమో మరి.. నేను మీలా పుట్టినరోజు వేడుకలు జరుపుకోను కాబట్టి.. కచ్చితంగా నా వయసెంతో నాకూ తెలియదు!


ష్‌.. రహస్యం..

* నేను ఉండే చోటు కచ్చితంగా ఇదీ అని స్పష్టంగా ఇతరులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
* నా రక్షణ కోసమే ఈ ఏర్పాటు అన్నమాట.
* అందుకే నాకు సంబంధించి ఎక్కువ ఫొటోలు, వీడియోలు మీకు దొరకవు.
* వడ్రంగి పిట్టల వల్లా నాకు ముప్పు ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
* ఈ పక్షులు నా పై భాగంలో తొర్రలు చేస్తే నాలో ఇంకా పెరిగే శక్తి తగ్గిపోతుందని భావిస్తున్నారు.
* నా గురించి మొట్టమొదటిసారిగా 2012లో బీబీసీ రేడియోలో ప్రసారమైంది.
* టస్మేనియా అర్వ్‌వ్యాలీలోని సెంచూరియన్‌ చెట్టు(327.5 అడుగులు), అమెరికాలోని కూస్‌ కౌంటీలో డోయిర్‌నర్‌ చెట్టు (327 అడుగులు), కాలిఫోర్నియాలోని రావెన్స్‌ టవర్‌ (317 అడుగులు) నా తర్వాత పొడవైన చెట్లుగా రికార్డులకు ఎక్కాయి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు