Published : 28 Feb 2020 01:01 IST

సైన్స్‌.. తుఝే సలాం..

ఈ రోజు జాతీయ సైన్స్‌ దినోత్సవం

సైన్సు మన జీవితంలో ఓ ముఖ్య భాగం. మనం వాడుకునే చిన్న యంత్రాల నుంచి విద్యుత్తు బల్బు, అంతరిక్ష పరిశోధనల వరకు సైన్సు, సాంకేతిక శాస్త్రం మనకు అందించిన బహుమతులే. మన దేశ శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుత పరిశోధనలు చేసి చరిత్రలో గొప్ప ముద్రలు వేసుకున్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా ఆ సంగతులేంటో తెలుసుకుందామా?!


భారతరత్న సర్‌ సి.వి.రామన్‌


తాను కనుగొన్న రామన్‌ ఎఫెక్ట్‌ను ఫిబ్రవరి 28వ తేదీన ప్రకటించారు.

ఈ రోజును పురస్కరించుకుని 1987 నుంచి ఏటా ఈ తేదీన జాతీయ సైన్సు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఫిజిక్స్‌లో రామన్‌ చేసిన పరిశోధనకు 1930లో ఆయనకు నోబెల్‌ బహుమతి లభించింది. 1954లో ఆయనకు భారత ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రదానం చేసి గౌరవించింది.


అంతరిక్ష విజ్ఞానంలో దిట్ట!


భూమి గుండ్రంగా ఉంటుంది. దాని అక్షం వెంబడి తన చుట్టూ తాను తిరుగుతోంది. ఫలితంగానే మనకు పగలు రాత్రి ఏర్పడుతున్నాయి ఈ విషయాన్ని ప్రపంచానికి తొలిసారిగా చెప్పింది ఆర్యభట్ట. ఆయన మీద ఉన్న గౌరవంతో మన దేశం ప్రయోగించిన తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే పేరు పెట్టారు.


వరాహమిహిరుడు ఇచ్చిన వరం!


భూమికి ఆకర్షణ శక్తి ఉందని మొట్టమొదట ప్రకటించింది వరాహమిహిరుడు. దీని వల్లే వస్తువులు, మనుషులు, జంతువులు ఇలా అన్నీ భూమిని అంటుకుని ఉండగలుగుతున్నాయని వివరించారు ఈ విజ్ఞాని. దీన్నే ప్రస్తుతం మనం గురుత్వాకర్షణ శక్తిగా పిలుస్తున్నాం.


ఆపరేషన్లకు ఆద్యుడు!


క్రీ.పూ.6వ శతాబ్దానికి చెందిన సుశ్రుతుడు అప్పట్లోనే శస్త్రచికిత్స పద్ధతులను కనుగొన్నాడు. సిజేరియన్‌పై పరిశోధనలు చేశారు. ఎముకలు విరిగిన చోటును గుర్తించడం, చికిత్స చేయడం, మూత్రనాళంలోని రాళ్లు తొలగించడం, కంటి శుక్లాలకు శస్త్రచికిత్స చేయడంలో సుశ్రుతుడు మంచి నిపుణుడు.


సున్నా కనిపెట్టాడు!


బ్రహ్మగుప్తుడు గొప్ప గణిత మేధావి(క్రీ.శ.598-668). గణితశాస్త్రంలో సున్నా గురించి, దాన్ని ఉపయోగించే పద్ధతి గురించి చెప్పిన తొలి వ్యక్తి. సున్నాతో భాగించడం, గుణించడం వంటి అంశాలకు సంబంధించిన నియమాలూ మొదటి సారిగా ఈయనే ప్రతిపాదించాడు.


పక్షి గుట్టువిప్పిన జహాపన..

ఒక వేటగాటు చకోర పక్షిని పట్టుకున్నాడు. మగ చకోర పక్షికి కాళ్లకు బొట్టెలు ఉంటాయి. ఆడ పక్షికి ఉండవు. విచిత్రంగా.. వేటగాడి చేతిలో ఉన్న పక్షి ఓ కాలికి మాత్రమే బొట్టె ఉంది. అది ఆడనా, మగనా అనే విషయం తెలియలేదు వేటగాడికి. జహంగీర్‌ అనే చక్రవర్తి (క్రీ.శ.1569-1627) సమక్షానికి తీసుకువచ్చాడు. చక్రవర్తి ఆ పక్షిని పరీక్షగా చూసి అది ఆడది అని చెప్పారు. వేటగాడు పక్షిని కోసి చూడగా దాని కడుపులో గుడ్లు ఉన్నాయి. ‘దాని ముక్కు చివరి భాగం చాలా చిన్నదిగా ఉంది. అందుకే అది ఆడపక్షి అని చెప్పారు జహంగీర్‌. పక్షులను పరిశీలించడంలో ఈయన ఒక గొప్ప ఆర్నిథాలజిస్టుగా(పక్షుల పరిశీలకులు) చరిత్రలో నిలిచారు.


పేటెంట్‌ తీసుకోలేదు!


‘వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌’ను ఎవరు కనుగొన్నారు? అంటే మార్కోని అని జవాబు చెబుతారు. నిజానికి దీన్ని కనిపెట్టింది మన భారతీయుడు జగదీశ్‌ చంద్రబోస్‌ (1858-1937). దీనికి బోస్‌ పేటెంట్‌ తీసుకోకపోవడం వల్ల ఆ కీర్తి మార్కోనికి దక్కింది. బోస్‌ మైక్రో తరంగాలను ఉత్పత్తి చేసి శాస్త్రవిజ్ఞాన దిశను కంప్యూటర్‌ సైన్సు సాంకేతిక శాస్త్రం వైపు మార్చారు.


రసాయన పితామహుడు!


భారతీయ రసాయన కర్మాగార పితామహుడు ప్రఫుల్ల చంద్రరే (1861-1944). కాలిన ఎముకల బూడిదకు సల్ఫ్యూరికామ్లం కలిపారు. లైమ్‌ సూపర్‌పాస్ఫేట్‌ ఏర్పడింది. దీన్ని మరిగించారు. సోడాపాస్ఫేట్‌ స్ఫటికాలు ఏర్పడ్డాయి. అలా జంతువుల ఎముకల నుంచి బలమైన ఔషధం తయారు చేయగలిగారు. ఫలితంగా బెంగాల్‌ కెమికల్‌ అండ్‌ ఫార్మాసూటికల్‌ ఔషధ పరిశ్రమ మొదలైంది. ఇప్పుడు ఈ పరిశ్రమ ఇంజక్షన్‌ చేసే మందులు, సబ్బులు, పెర్‌ఫ్యూమ్‌లు, ఆల్కలాయిడ్స్‌ వంటి వాటిని భారీగా ఉత్పత్తి చేస్తోంది.


అబ్దుల్‌ కలాం..ఓ అబ్బురం!


భారతదేశపు 11వ రాష్ట్రపతిగా మనందరికీ సుపరిచితులైన ఏపీజే అబ్దుల్‌ కలాం(1931-2015) ‘మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా ఖ్యాతి గడించారు. ఈయన 1998లో జరిపిన ఫోక్రాన్‌-2 అణు పరీక్షలో ముఖ్య భూమిక పోషించారు. అంతరిక్ష పరిశోధనల్లోనూ ఈయన చూపిన దారిలోనే మన భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలతో పోటీపడుతూ అద్భుతాలు సాధిస్తున్నారు.  


ఎల్లాప్రగడ ప్రతిభ!

తెలుగువాడిగా పుట్టి, తెలుగుజాతి గర్వించేలా కృషి చేసిన గొప్ప శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు (1895-1948). యాంటీ బయోటిక్స్‌లో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఈయన పర్యవేక్షణలోనే 1945లో బెంజ్‌మన్‌ డగ్లర్‌ ప్రపంచంలోనే మొదటి
యాంటీ బయోటిక్స్‌ టెట్రాసైక్లిన్‌, అరియోమైసిన్‌ను కనుగొన్నారు.


- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ,  
ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం

 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని