లోకం చుట్టే జీవులోయ్‌!

ఖండాలు చుట్టొచ్చే పక్షులు... సముద్రాలు దాటే జీవులు... వేల కిలోమీటర్లు ఇట్టే ప్రయాణించే కీటకాలు... ఇలా ఎన్నో మన పేజీలోకి వచ్చేశాయి... ఆ వింత కబుర్లు చదివేయండి! తిమింగలం పేరు వినే ఉంటారుగా. వాటిల్లోనే ఇదో రకం. 40 నుంచి 50 అడుగుల పొడవుతో పే..ద్దగా ఉంటుంది దీని రూపం...

Updated : 11 Mar 2020 00:36 IST

ఖండాలు చుట్టొచ్చే పక్షులు... సముద్రాలు దాటే జీవులు... వేల కిలోమీటర్లు ఇట్టే ప్రయాణించే కీటకాలు... ఇలా ఎన్నో మన పేజీలోకి వచ్చేశాయి... ఆ వింత కబుర్లు చదివేయండి!

హంప్‌బ్యాక్‌ వేల్‌

తిమింగలం పేరు వినే ఉంటారుగా. వాటిల్లోనే ఇదో రకం. 40 నుంచి 50 అడుగుల పొడవుతో పే..ద్దగా ఉంటుంది దీని రూపం. ఇది భలేగా పాటలు పాడేస్తుంది. అంటే మనలా కాదు కానీ 5 నుంచి 35 నిమిషాలపాటు పాటల్లా గమ్మత్తయిన శబ్దాలు చేస్తుందన్నమాట. దీని ఇంకో గొప్ప విషయం ఎంటో తెలుసా? అత్యంత దూరం వలస వెళ్లే క్షీరదం ఇదే. ఏటా సముద్రంలో 22 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేస్తుంది.

 

తూనీగ

దీని గురించి తెలిస్తే ‘తూనీగా తూనీగా అంత దూరం పరుగెడతావా?’ అంటూ పాట పాడేస్తాం. దీన్ని ఆంగ్లంలో డ్రాగన్‌ ఫ్లై అంటుంటారు. కీటకాల్లో అత్యంత దూరం వలస వెళ్లేది ఇదే. ఆ ఘనత దీనికే చెందుతుంది మరి. వీటిల్లో ప్రపంచవ్యాప్తంగా 5200 జాతులుంటే 50 రకాల తూనీగలు వలస వెళ్తుంటాయి. వీటిలో ఫ్ల్లయింగ్‌ డ్రాగన్‌ఫ్లై 17 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది.

సూటీ షీర్‌ వాటర్‌

దో సముద్రపక్షి. ప్రపంచంలో అత్యంత దూరం ప్రయాణించే జీవుల్లో రెండోది. న్యూజిలాండ్‌, ఫాక్‌లాండ్‌ దీవుల్లో ఎక్కువగా ఉంటుంది. ఏటా 65 వేల కిలోమీటర్ల దూరం వలస వెళుతుంది. రోజూ ఇంచుమించు 1000 కిలోమీటర్ల దూరం ఎగురుతూ బోలెడన్ని దేశాలు చుట్టి వస్తుంది. సముద్రంలో ఉండే చిన్న చిన్న చేపలు, స్క్విడ్స్‌ తింటూ పొట్ట నింపుకొంటుంది. వీటి కోసం నీటి ఉపరితలంపై ఎగురుతూ వేట మొదలుపెడుతుంది. ఆహారం కోసం నీటిలో దాదాపు 70 మీటర్ల లోతుకూ వెళ్తుంది.

లెదర్‌బ్యాక్‌ సీ టర్టిల్‌

ముద్ర తాబేళ్లలో పెద్దది. నాలుగు నుంచి ఎనిమిది అడుగుల పొడవు 225 నుంచి 900 కిలోల బరువు ఉంటుందిది. వలస వెళ్లడంలో దీని స్థానం ముందే. వలస సమయంలో అట్లాంటిక్‌, పసిఫిక్‌ సముద్రాల్నీ దాటేస్తుంది. దాదాపు 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది.

ఆర్కిటిక్‌ టెర్న్‌

‘పిట్ట కొంచెం వేగం ఘనం’ అన్నమాట అచ్చంగా సరిపోతుంది ఈ పక్షి విషయంలో. ప్రపంచంలోనే అత్యంత దూరం వలస వెళ్లే జీవి ఇదే. ఏటా ఇది చేసే ప్రయాణం ఎంతో తెలిస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేస్తారు. వెయ్యి కాదు రెండు వేలు కాదు 71 వేల కిలోమీటర్ల దూరం తిరుగాడేస్తుంది. యూకేలోని ఫర్న్‌ దీవుల్లో ఉండే ఇది చలికాలంలో పొదగడానికి అంటార్కిటికా బయలుదేరి వెళ్లి తిరిగి వస్తుంది. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో రోజుకు 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేస్తుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు