Updated : 20 Mar 2020 00:52 IST

బుజ్జి.. బుజ్జి.. మరుగుజ్జు పర్వతాలు

కనుచూపు మేరంతా ఎడారి.. మధ్యలో మేకుల్లా పొడుచుకొచ్చిన చిన్న చిన్న పర్వతాల వంటి ఆకారాలు.. అయినా.. ఎడారిలో పర్వతాలేంటి? విచిత్రం కాకపోతే! అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇంకెందుకాలస్యం చదివేయండి మరి!


ది పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతం. సర్‌వన్టెస్‌ నగరానికి దగ్గర్లోని నమ్‌బన్గ్‌ నేషనల్‌ పార్క్‌.  
* ఈ ప్రాంతమంతా నేల నుంచి వేలకొద్ది పొడుచుకొచ్చిన లైమ్‌స్టోన్‌ స్తూపాలు కనిపిస్తాయి.
* కొన్ని చిన్నగా ఉంటే.. మరి కొన్ని 3.5 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి.
* ఇవి మరీ ఎత్తుండక పోయినా.. వీటికున్న ఆకారాలను బట్టి వీటిని బుజ్జి పర్వతశిఖరాలు అని పిలుస్తుంటారు.


నిత్యం మారుతుంది

* ఇక్కడ ఎప్పటికప్పుడు పరిసరాలు మారిపోతుంటాయి.
* కారణం గాలివాలుకు ఇసుక కొట్టుకుపోవడమే.
* కొన్నిసార్లు ఎత్తుగా కనిపించిన ఈ బుల్లి శిఖరాలు.. మరో రోజు చూస్తే ఇసుకలో కూరుకుపోయి మరింత చిన్నగా కనిపిస్తాయి.
* అందుకే ఓ సారి చూసినప్పుడు ఉన్నట్లు మరోసారికి ఈ ప్రాంతం ఉండదు. నిత్యం మారుతుంటుంది.


వందల ఏళ్ల  ప్రక్రియ

* ఈ పర్వతాల వంటి నిర్మాణాలు కాల్షియం కార్బొనేట్‌, గ్రావెల్‌, ఇసుకతో ఏర్పడ్డాయి.
* ఇక్కడి ఇసుకలో కాల్షియం కార్బొనేట్‌ ఎక్కువగా ఉండటం వల్లే ఇవి తయారైనట్లు పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
* ఆల్చిప్పలు వంటి సముద్ర జీవుల అవశేషాల ద్వారా కాల్షియం కార్బొనేట్‌ కొన్ని వందల సంవత్సరాలుగా పేరుకుని ఈ లైమ్‌స్టోన్‌ స్తూపాలు ఏర్పడ్డాయని మరో వాదనా ఉంది.


వసంతంలో వారెవ్వా!

* ఎక్కువగా వసంత రుతువులో ఈ ప్రాంతాన్ని చూడటానికి సందర్శకులు వస్తుంటారు.
* చుట్టుపక్కల ప్రాంతంలో రంగురంగుల పువ్వులు ఈ కాలంలో పూయడమే కారణం.
* ఇవి ప్రకృతి ప్రేమికులకు చాలా కనువిందు చేస్తాయి.
* సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఈ ప్రాంతం మరింత అందంగా కనువిందు చేస్తుంది.
* ఈ వేళల్లో బుజ్జి పర్వతాల నీడలు చూడటానికి భలే ఉంటాయి.
* పెద్దపెద్ద బల్లులు, కొండచిలువలు ఇక్కడ ఎక్కువ సంచరిస్తుంటాయి. అప్పుడప్పుడు కంగారూలూ కనిపిస్తుంటాయి.
* ఇక్కడ ఉండటానికి వసతులు లేనప్పటికీ... ఈ ప్రకృతి వింతను చూడటానికే ఏటా లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు.


గతంలో ఎవరికీ తెలియదు

* వీటి గురించి 1967 ముందు వరకు ప్రపంచానికే కాదు.. చాలా మంది ఆస్ట్రేలియన్లకే తెలియదు.
* ఇవి రిజర్వ్‌ ప్రాంతంలో ఉండటమే దీనికి కారణం.
* తర్వాత ఈ ప్రదేశాన్ని నమ్‌బన్గ్‌ నేషనల్‌ పార్క్‌లో భాగం చేశారు.
* అప్పటి నుంచి పర్యాటకులకు ఇవి కనువిందు చేస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు