అందమంటే నాదే!

చూస్తే అచ్చం ఓ బుల్లి నెమలిలా కనిపిస్తా.. మరో కోణంలో చూస్తే పావురంలా అనిపిస్తా నా శరీరమంతా మెరుపుల వర్ణం కాళ్లేమో కోడిలా.. తోకేమో పెద్ద చిలుకలా చూడటానికి భలేగా ఉన్న నా పేరు హిమాలయన్‌ మోనల్‌..

Updated : 23 Mar 2020 00:43 IST

చూస్తే అచ్చం ఓ బుల్లి నెమలిలా కనిపిస్తా.. మరో కోణంలో చూస్తే పావురంలా అనిపిస్తా నా శరీరమంతా మెరుపుల వర్ణం కాళ్లేమో కోడిలా.. తోకేమో పెద్ద చిలుకలా చూడటానికి భలేగా ఉన్న నా పేరు హిమాలయన్‌ మోనల్‌..

ఇంపేయన్‌ మోనల్‌, ఇంపేయన్‌ పీశాంట్‌ ఇవీ నా పేర్లే.

* నేను హిమాలయ అటవీప్రాంతాల్లో కనిపిస్తుంటా.

* అఫ్గానిస్తాన్‌, పాకిస్తాన్‌, భారత్‌లోని హిమాలయాల ప్రాంతం, నేపాల్‌, దక్షిణ టిబెట్‌, భూటాన్‌లో మాత్రమే కనిపిస్తుంటా.

* నేను నేపాల్‌ జాతీయ పక్షిని.

* ప్రాచీన నేపాలీ పాటల్లోనూ నా ప్రస్తావన ఉంది.

* మరో విషయం ఏంటంటే.. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర పక్షినీ నేనే.

* నేను ఓ రకంగా కాస్త పెద్దగానే ఉంటా. దాదాపు 70 సెంటీమీటర్ల పొడవుంటా.


వేర్లు.. పురుగుల్ని తింటాం

* మేం మంచులో తవ్వుకుని చిన్న చిన్న మొక్కల వేర్లు, కీటకాలు, పురుగుల్ని ఆహారంగా తీసుకుంటాం.

* ఓక్‌ చెట్టు పండ్లు, బెర్రీలనూ తింటాం.

* ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్యలో మాలో ఆడ పక్షులు గుడ్లు పెట్టి పొదుగుతాయి.

* ఒక్కో ఆడపక్షి నాలుగు నుంచి అయిదు గుడ్లు పెడుతుంది.


ఆడ, మగ రూపు వేరు

* మాలో ఆడ, మగవి రూపంలో పూర్తిగా వేరుగా ఉంటాయి.

* మగవి నెమలిలా ఆకర్షణీయ రంగులో ఉంటే.. ఆడవి మాత్రం నలుపు బూడిద చారలతో కనిపిస్తాయి.

* మేం నెమళ్ల కన్నా.. చక్కగా గాల్లో ఎగరగలం.

* ఆడవైనా.. మగవైనా.. కళ్లచుట్టూ నీలి రంగు వలయాలు మాత్రం ఉంటాయి.


చెట్ల కొమ్మల మీద కాదు..

* మేం మా గూళ్లను మిగతా పక్షుల్లా చెట్ల కొమ్మల మీద కాకుండా రాళ్ల సందుల్లో, నేల బొరియల్లో, చెట్ల తొర్రల్లో తయారు చేసుకుంటాం.

* చలి నుంచి మా గుడ్లకు రక్షణ కోసమే ఇలా చేస్తాం.

* మేం పెట్టే గుడ్లు తెలుపు రంగులో ఉంటాయి. వాటిపై బూడిద రంగులో మచ్చలు కనిపిస్తాయి.

* గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చాక మగవి సైతం ఆడవాటి రంగులోనే ఉంటాయి.

* కొన్ని నెలల తర్వాత రంగులమయంగా మారతాయి. ●

* మాలో మగవి సుమారు 2,300 గ్రాములు, ఆడవి 2,150 గ్రాముల బరువుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని