పిల్లకాకి పేరాశ!

ఒక పల్లెలో చెట్లపైన గూళ్లు కట్టుకుని వందలాదిగా కాకులుండేవి. వాటిలో సుబ్బమ్మగారింటి పెరటిలోని వేపచెట్టుపై గూటిలో ఉండే పిల్లకాకికి సరదాలు ఎక్కువ. తిండి ధ్యాస తక్కువ. గోడపై వాలి ఆ కుటుంబసభ్యులు చెప్పుకొనే కబుర్లను ఎంతో కుతూహలంతో వింటూ ఆనందించేది. సుబ్బమ్మ గారు మనవరాలిని కూర్చోబెట్టుకుని చెప్పే కథల్లో తమ జాతికి చెందినవి రాగానే పొంగిపోయేది. కడవలో రాళ్లేసి నీళ్లుపైకి తెప్పించి తాగిన కాకి కథ విని తన ముత్తాతల యుక్తికి ముచ్చపడి గర్వించేది. ఎంగిలి చేత్తో కాకిని తోలడు లాంటి సామెతలతో పక్కింటాయణ్ని విసుక్కుంటే దానికి తమాషాగా ఉండేది. కాకిగోలలాంటి మాటలు వింటే మాత్రం చిన్నబుచ్చుకునేది....

Published : 13 May 2020 01:19 IST

ఒక పల్లెలో చెట్లపైన గూళ్లు కట్టుకుని వందలాదిగా కాకులుండేవి. వాటిలో సుబ్బమ్మగారింటి పెరటిలోని వేపచెట్టుపై గూటిలో ఉండే పిల్లకాకికి సరదాలు ఎక్కువ. తిండి ధ్యాస తక్కువ. గోడపై వాలి ఆ కుటుంబసభ్యులు చెప్పుకొనే కబుర్లను ఎంతో కుతూహలంతో వింటూ ఆనందించేది. సుబ్బమ్మ గారు మనవరాలిని కూర్చోబెట్టుకుని చెప్పే కథల్లో తమ జాతికి చెందినవి రాగానే పొంగిపోయేది.

కడవలో రాళ్లేసి నీళ్లుపైకి తెప్పించి తాగిన కాకి కథ విని తన ముత్తాతల యుక్తికి ముచ్చపడి గర్వించేది. ఎంగిలి చేత్తో కాకిని తోలడు లాంటి సామెతలతో పక్కింటాయణ్ని విసుక్కుంటే దానికి తమాషాగా ఉండేది. కాకిగోలలాంటి మాటలు వింటే మాత్రం చిన్నబుచ్చుకునేది.

ఇలా ఉండగా సుబ్బమ్మగారికి మనవడు పుట్టాడు. మనవడికి ఏం పేరు పెడదాం అంటూ ఇరవై రోజులపాటు సుబ్బమ్మగారిది ఒకటే హడావిడి! ఇరవయ్యొకటో రోజు తెల్లవారుతూనే ఆ ఇంట్లో సందడి మొదలైంది. ఇరుగుపొరుగూ, బంధువులూ వచ్చారు. బియ్యంలో బాబు పేరు సుభాష్‌ అని రాశాడు సుబ్బమ్మగారబ్బాయి. తన భర్త పేరు సుబ్బయ్య స్ఫురించేలా సుభాష్‌ అని పెట్టినందుకు సుబ్బమ్మ సంబరపడింది. అందరూ ‘సుభాష్‌’ అని పిలుస్తూ బాబుని ముద్దు చేయసాగారు.

ఈ సంబరమంతా చూసి కాకిపిల్ల తనుకూడా పేరు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. తన తాతలకు పేర్లు లేవు కనుక రోజూ మొదటి ముద్ద తనకు పెట్టే సుబ్బమ్మపై కృతజ్ఞతతో ఆ పేరే పెట్టుకోవాలని అనుకుంది.

వెంటనే ఉత్సాహంగా తోటి కాకుల్ని పిలిచి ఇకపై తనను సుబ్బమ్మ అని పిలవాలంటూ ప్రకటించింది. వెంటనే ఓ కాకి ‘సుబ్బమ్మ పాతపేరు కదా! శుభ అని పెట్టుకో అంది’. మరో కాకి శోభ ఇంకా బాగుంటుంది అని చెప్పింది. ఇంకోకాకి ‘ఇంటి పేరుండాలిగా.. వేప సుబ్బమ్మ అని పెట్టుకో. నువ్వు ఒకవేళ చింత చెట్టుకు మారితే చింత సుబ్బమ్మ అవుతుంది’ అంది.

‘ముసలామె పేరు ఎందుకు?’ పక్కింట్లో పాప పేరు మల్లిక. అది పెట్టుకో..’ అందో కాకి. ‘మల్లీ! అని పిలవొచ్చు’ అంది ఇంకో కాకి. ‘నల్లగా ఉన్న మనం మల్లి ఏంటి?’ విసుక్కుంది మరో కాకి.

ఇలా తలో మాటాచెబుతూ కాకులన్నీ గోలగోలగా అరవసాగాయి. ఇంతలో తిన్న విస్తళ్లన్నీ చెత్తకుండీలో పడేశారు. జరుగుతున్న సంభాషణను వదిలేసి కాకిపిల్లను రమ్మంటూ కాకులన్నీ ఎంగిలి మెతుకులు తినడంలో మునిగిపోయాయి.

కాకిపిల్ల చిన్నబోయింది. ఇంతలో ఓ ముసలి కాకి అనునయంగా ఇలా అంది. ‘అయినా మనకు పేరుతో పనేముంది. తిండి ఎక్కడ కనబడినా, ఏ కాకికి కష్టమొచ్చినా మనం మూకుమ్మడిగా అందరినీ అరిచి పిలుస్తాం.

మనుషులు..కొందరే నా వాళ్లనుకుంటారు. ‘తిండి, సంపాదన నాకు.. నా కుటుంబానికి’ అంటారు. అందుకే వాళ్లు తమ స్వార్థం, అవసరాల కోసం కొందరితో స్నేహం చేస్తారు. వారిని పేర్లతో పిలుచుకుంటారు. మనకెందుకు ఆ పేర్ల గోల? అదీగాక నీ విషయం నీకు ముఖ్యమే. ఇతరులకు అది అంతగా పట్టదు. అది తెలుసుకో’

ముసలికాకి మృదువైన మాటలు విని.. అదీ నిజమే అనుకుని ఊరుకుంది పిల్లకాకి.

-గుడిపూడి రాధికారాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని