ఎవరు గొప్ప?

జల్లెడలో జల్లించిన బియ్యాన్ని చేటలో పోసి చెరుగుతోంది నాన్నమ్మ. బోర్లా పడుకుని గడ్డం కింద చేతులుంచి జల్లెడ వంకా, చేట వంకా, నాన్నమ్మ వంకా చూస్తోంది చిన్నారి. అంతలో ఎవరో వచ్చారని, పని ఆపి వెళ్లింది నాన్నమ్మ. గుసగుసగా మాటలు వినిపించాయి చిన్నారికి. ఎవరా అని చూస్తే.. చేటా, జల్లెడా మాట్లాడుకుంటున్నాయి!...

Published : 12 Aug 2020 01:04 IST

జల్లెడలో జల్లించిన బియ్యాన్ని చేటలో పోసి చెరుగుతోంది నాన్నమ్మ. బోర్లా పడుకుని గడ్డం కింద చేతులుంచి జల్లెడ వంకా, చేట వంకా, నాన్నమ్మ వంకా చూస్తోంది చిన్నారి.

అంతలో ఎవరో వచ్చారని, పని ఆపి వెళ్లింది నాన్నమ్మ. గుసగుసగా మాటలు వినిపించాయి చిన్నారికి.

ఎవరా అని చూస్తే.. చేటా, జల్లెడా మాట్లాడుకుంటున్నాయి!

జల్లెడ చేటతో ‘నువ్వెంత గొప్పదానివి! పదార్థంలోని మంచినంతా ఉంచుకుని, చెడును బయటికి పంపిస్తున్నావు’ అంది.

‘లేదు లేదు. నువ్వే నాకంటే గొప్పదానివి. మంచిని ఇతరులకు పంచిపెట్టి, చెడుని శివుడు హాలాహలాన్ని గొంతులో దాచినట్టు నీలోనే దాచుకుంటున్నావు’ అంది చేట.

అప్పుడు జల్లెడ ‘అసలు నీకు నీ గొప్పదనం తెలుసా? దేవతలు, రాక్షసులకి విశేషంగా నీ పేరు తగిలిస్తారు. ఆ సంగతి చెప్పనా?’ అంది.

‘అవునా! చెప్పు చెప్పు’ ఆసక్తిగా అడిగింది చేట.

‘శూర్పకర్ణుడు అంటే వినాయకుడు. చేటల్లాంటి చెవులు కలవాడు. శూర్పణఖ అంటే చేటల్లాంటి గోళ్లు కలది అని అర్థం! అందుకే నువ్వే గొప్ప’ అంది జల్లెడ.

‘అమ్మో! అంత పెద్ద గోళ్లే’ ఆశ్చర్యపోయింది పాప.

చిన్నారీ. లేమ్మా! సాయంత్రం అయింది. మొహం కడుక్కుని ఆడుకుందువుగాని’ అని చిన్నారిని తట్టి లేపింది అమ్మ.

‘మీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. అంటే మీరిద్దరూ గొప్పవారే’ అంటూ జల్లెడకు, చేటకి తీర్పు చెప్పి బయటికి తుర్రుమంది చిన్నారి.

- సి.హెచ్‌.అపురూప శ్రీకాకుళం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని