అరచేతిలో గుంటనక్క!

హాయ్‌.. నేను నక్కను.. మాములు నక్కను కాదు. గుంట నక్కను! ఆగండి..ఆగండి.. నన్ను ఎందుకలా ఊరికే జిత్తులమారి అని పిలుస్తారు. నేను అడవిలో చిరుజీవిని. నా పొట్టనింపుకోవాలన్నా.. ఇతర జీవుల నుంచి నన్ను నేను రక్షించుకోవాలన్నా.. ఆ మాత్రం తెలివితేటలు వాడాలిగా మరి! నేను ఏం చేసినా పొట్టతిప్పలు తప్పించుకోవడం కోసమే కదా!! ....

Updated : 26 Aug 2020 00:35 IST

చూడండి.. చెయ్యండి!

హాయ్‌.. నేను నక్కను.. మాములు నక్కను కాదు. గుంట నక్కను! ఆగండి..ఆగండి.. నన్ను ఎందుకలా ఊరికే జిత్తులమారి అని పిలుస్తారు. నేను అడవిలో చిరుజీవిని. నా పొట్టనింపుకోవాలన్నా.. ఇతర జీవుల నుంచి నన్ను నేను రక్షించుకోవాలన్నా.. ఆ మాత్రం తెలివితేటలు వాడాలిగా మరి! నేను ఏం చేసినా పొట్టతిప్పలు తప్పించుకోవడం కోసమే కదా!!

ఇంతకీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే.. మీకు ఓ క్రాఫ్ట్‌ నేర్పిద్దామని! ఇంతకీ ఏం నేర్పించాలబ్బా! వేరే ఇంకేదో ఎందుకు? నా బొమ్మ చేయడం ఎలాగో చెబుతా.. ఓకేనా..!

* ఏమేం కావాలి..

* చార్టు * జిగురు * స్కెచ్‌లు * రంగులు

ఎలా చేయాలంటే..

అమ్మో.. మాకు బొమ్మలు గీయడం సరిగా రాదు. అలాంటిది నక్క బొమ్మ ఎలా అని.. అధైర్యపడకండి. నక్కనైన నా బొమ్మను మీరు తేలిగ్గా ఎలా చేసుకోవాలో ఓ చిట్కా చెబుతా. ష్‌.. కానీ ఇది రహస్యం.. మన మధ్యే ఉండాలి. ఎవరికీ చెప్పకండేం.. సరేనా! ఏం లేదు.. మీ అరచేతితోనే నా శరీరం చేసుకుంటే సరి. ఎలా అంటే ముందుగా చార్టు తీసుకోండి. దానిపై ఓ అరచేతిని పెట్టండి. మరో చేతిలోకి పెన్సిల్‌ తీసుకుని.. అరచేతి వేళ్ల చుట్టూ గీసుకుంటూ వెళ్లండి. ఇప్పుడు చార్టుపై అరచేతి ముద్ర వస్తుంది.

కత్తిరిస్తే సరి

అమ్మానాన్న సహకారం తీసుకుని చార్టుపై ఉన్న అరచేతిముద్రను జాగ్రత్తగా కత్తిరించండి. తర్వాత తల ఆకారాన్ని ముందుగా చార్టుపై గీసుకుని దాన్నీ నెమ్మదిగా కత్తిరించండి. ఇప్పుడు చార్టుపై ఉన్న బొటనవేలి చివరన తెల్ల రంగు వేసుకోండి. ఇది నా తోక అన్నమాట. తర్వాత తలకు కళ్లు గీయండి. లేకపోతే ముందే గీసి కత్తిరించిన కళ్లనైనా అతికించుకోవచ్ఛు మీకు ఎలా తేలికగా అనిపిస్తే అలా చేయొచ్చు ఫర్లేదు. ఇలాగే ముక్కు కూడా సిద్ధం చేసుకోండి.

జిగురుతో అతికించాలి

తర్వాత తెల్ల రంగును జాగ్రత్తగా ముక్కుకు అటూ ఇటూ వేయండి. ఇదే చాలా ప్రధానం. చార్టు రంగులోనే ఉండే స్కెచ్‌ను తీసుకుని చివర్లో చెవుల దగ్గర త్రిభుజాకారంలో వేయండి. ఇవి నా చెవులన్నమాట. ఇక ఇప్పుడు జిగురుతో నా బొమ్మ తలను.. మీ అరచేతి అచ్చుతో తయారు చేసిన శరీరానికి అతికించండి. కాసేపు ఆరనివ్వండి. ఇంకేం నా బొమ్మ సిద్ధం.

అరరే.. అప్పుడే మా అమ్మానాన్న పిలుస్తున్నారు నన్ను.. సరే ఇక ఉంటా మరి!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని