అనుకుంటే అందరూ మనవారే!

రామాపురంలో రత్నగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన దుకాణంలో ఎక్కువ ధరలకు సరకులు అమ్ముతూ.. ప్రజల దగ్గర మాత్రం నిజాయతీపరుడిగా నటించేవాడు. తెలిసిన వారు వస్తే ధర ముందే ఎక్కువ చెప్ఫి. అందులో కొంత రాయితీ ఇచ్ఛి. మీరు కాబట్టి తగ్గించాను అని మోసం చేసేవాడు. వ్యాపారి దగ్గర ఒక నమ్మకమైన పనివాడు ఉండేవాడు.

Published : 31 Aug 2020 00:20 IST
కథ

రామాపురంలో రత్నగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన దుకాణంలో ఎక్కువ ధరలకు సరకులు అమ్ముతూ.. ప్రజల దగ్గర మాత్రం నిజాయతీపరుడిగా నటించేవాడు. తెలిసిన వారు వస్తే ధర ముందే ఎక్కువ చెప్ఫి. అందులో కొంత రాయితీ ఇచ్ఛి. మీరు కాబట్టి తగ్గించాను అని మోసం చేసేవాడు. వ్యాపారి దగ్గర ఒక నమ్మకమైన పనివాడు ఉండేవాడు.

పని మీద రత్నగుప్తుడు ఒకసారి పొరుగూరికి వెళ్లాల్సి వచ్చింది. దుకాణం బాధ్యతను పని చేసే వ్యక్తికి అప్పగించాడు. యజమాని పని పూర్తి చేసుకొని వచ్చేసరికి మూడు రోజులైంది. మరుసటి రోజు వెంకయ్య అనే పెద్దమనిషి దుకాణానికి వచ్చి ‘ఏం రత్నయ్య! భలేవాడిని పనిలో పెట్టుకున్నావు. మొన్న నేను సరకులకు వస్తే ఏమాత్రం తగ్గించకుండా ఎక్కువ ధర వేశాడు. అదే నువ్వు ఉంటే తగ్గించేవాడివి’ అని అన్నాడు. ఆ మాటలు విని రత్నగుప్తుడు పనివాడి వైపు తిరిగి ‘ఏరా.. వెంకయ్యా ఎవరనుకున్నావు? మన పక్కింటి వ్యక్తి కదా! కొంచెమైనా చూసి ఇవ్వాల్సింది’ అని సూచించాడు.

తర్వాతి రోజు సరకుల కోసం వచ్చిన ఓ వ్యక్తికి పనివాడు తగ్గింపు ధరలు వేశాడు. యజమాని గమనించి ‘ఏమిట్రా.. అతడికి ధరలు తగ్గించి వేశావు?’ అని ప్రశ్నించగా.. అయ్యా! అతను మన వీధి వ్యక్తి కదా అని సమాధానం చెప్పాడు. ఆ సమయంలో రత్నయ్య సరే అనుకొని ఏమీ అనకుండా మౌనంగా ఉన్నాడు. ఇంకో రోజు ఒక మహిళ సామగ్రి కోసం రాగా.. కాస్త ధర తగ్గించాడు పనివాడు. అది గమనించి యజమాని అడిగాడు. అయ్యా! మన ఊరి ఆమె కాబట్టి ధర తగ్గించా అని చెప్పాడు. ఇలా చాలాసార్లు పనివాడు పట్టికలో ధర తగ్గించడం.. వ్యాపారి ప్రశ్నించి ఊరుకోవడం జరిగింది.

ఇక లాభం లేదనుకొని ఒకరోజు దుకాణదారు పనివాడిని నిలదీశాడు. అందుకు అతను ‘మీరేకదా! ధరలు వేసేటప్పుడు మన, పర చూడమన్నారు. ఆలోచిస్తే అందరూ మనవారే కదయ్యా! అందరికీ ఒకేలా సరసమైన ధరలకు సరకులు ఇవ్వడమే న్యాయం అని అనిపించి అలా చేశా. తప్పయితే మన్నించండి’ అని సమాధానం ఇచ్చాడు. పనివాడి మాటల్లో నిజం ఉందని యజమానికి అనిపించింది. అనుకుంటే అంతా మనవారే.. న్యాయంగా అందరికీ సరకులు అందించడమే నిజాయతీ గల వ్యాపారం అని మనసులో నిశ్చయించుకున్నాడు. అప్పటి నుంచి అధిక ధరలకు ఆశపడకుండా.. ప్రజలను మోసం చేయకుండా.. బుద్ధిగా వ్యాపారం చేసుకుంటూ మంచి పేరు సంపాదించాడు.

- డా.గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు