పేక ముక్కతో ఫటాఫట్‌!

హాయ్‌.. ఈ రోజు మీకు చాలా తేలికైన మ్యాజిక్‌ ఒకటి నేర్పిస్తా.. ఇది తెలుసుకోవడం చాలా సులభం. కానీ అవతలవాళ్లు మాత్రం అవాక్కై.. అమాంతం నోరెళ్లబెట్టేస్తారు. అదేంటబ్భా.! దాని సంగతేంటో చూసేయాలని తెగ ఉత్సాహంగా ఉన్నారు కదూ... ఇంకెందుకాలస్యం.. ఉల్లాసంగా ఇది చదివేయండి మరి!

Updated : 04 Sep 2020 00:38 IST

హాయ్‌.. ఈ రోజు మీకు చాలా తేలికైన మ్యాజిక్‌ ఒకటి నేర్పిస్తా.. ఇది తెలుసుకోవడం చాలా సులభం. కానీ అవతలవాళ్లు మాత్రం అవాక్కై.. అమాంతం నోరెళ్లబెట్టేస్తారు. అదేంటబ్భా.! దాని సంగతేంటో చూసేయాలని తెగ ఉత్సాహంగా ఉన్నారు కదూ... ఇంకెందుకాలస్యం.. ఉల్లాసంగా ఇది చదివేయండి మరి!

మీరు ఒక పేకముక్క(ప్లేయింగ్‌ కార్డు) తీసుకుంటారు. దాన్ని బల్ల మీద నిలువుగా నిల్చోబెడతారు. దాన్ని అలా నిలబెట్టడమే వింతైతే దాని మీద ఏకంగా కూల్‌డ్రింక్‌తో ఉన్న గ్లాసును పడిపోకుండా పెడతారు. అంతే మ్యాజిక్‌ అయిపోయింది! ఏంటి..? ఎన్ని సార్లు ప్రయత్నించినా రావడం లేదా? కూల్‌డ్రింక్‌ అంతా కింద ఒలికిపోతోందా? పోదా మరి..! కిటుకు తెలుసుకోకుండా తొందరపడితే ఎలా..?

కిటుకు ఏంటంటే..

రహస్యమంతా పేకముక్కలోనే ఉంది. ప్లేయింగ్‌ కార్డుకు మరో పేకముక్కను అతికించాలి. కానీ ఇక్కడే అసలు కథ అంతా ఉంది. ఏంటంటే.. మొత్తం అతికించకూడదు. సగం మాత్రమే అతికించాలి... మిగిలిన సగం అలానే వదిలేయాలి. జిగురు ఆరిన తర్వాత వెనకవైపున్న ప్లేయింగ్‌ కార్డును నెమ్మదిగా సగానికి మడవాలి. ఇలా రెండు మూడు సార్లు మడిస్తే కార్డు మ్యాజిక్‌ చేసుకోవడానికి సిద్ధం అయిపోతుంది. ఇదంతా మనం చాలా గప్‌చుప్‌గా మ్యాజిక్‌ చేయడానికి ముందే తయారు చేసి పెట్టుకోవాలి.

ఎలా చేయాలంటే..

మ్యాజిక్‌ ప్రారంభం కాగానే.. ముందు కార్డును రెండువైపులా అందరికీ చూపించాలి. కార్డు వెనక మరోదాన్ని అతికించినట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకుండా జాగ్రత్తపడాలి. తర్వాత కార్డును టేబుల్‌పై పెట్టి.. వెనకున్న కార్డును జాగ్రత్తగా మడవాలి. ఇప్పుడు కార్డు నిలుచుంటుంది. ఇక నెమ్మదిగా కూల్‌డ్రింక్‌తో ఉన్న గ్లాసును కార్డుపై నిలబెట్టడమే. ‘T’ ఆకారంలో ఉన్న కార్డు గ్లాసును పడిపోకుండా బ్యాలెన్స్‌ చేస్తుంది. ఇవేమీ ముందున్న వారికి కనిపించవు. దీంతో చూసే వారు విస్మయానికి గురవుతారు. ఇప్పుడు మళ్లీ గ్లాసును తీసివేసి.. కార్డును యథావిధిగా చేసి.. మొదట్లోలాగా మరోసారి అందరికీ కార్డును రెండువైపులా చూపించి మ్యాజిక్‌ ముగించడమే..! ఇక చూడండి చప్పట్లే.. చప్పట్లు!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎట్టిపరిస్థితుల్లోనూ కార్డు వెనక మరోటి అతికించినట్లు ముందున్న వాళ్లకు తెలియకూడదు. ఈ కార్డును పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వొద్ధు మ్యాజిక్‌ చేసేటప్పుడు చూసేవాళ్లు మనకు కాస్త దూరంలో మన కంటే కాస్త దిగువన ఉండేలా చూసుకోవడం మాత్రం మరిచిపోవద్ధు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని