మార్పు తెచ్చిన ముని దీవెన

మాళవ రాజ్య పాలకుడు మోహనుడు. పాలనను నిర్లక్ష్యం చేస్తూ ఎప్పుడూ వేటకు వెళుతూ కాలక్షేపం చేస్తుండేవాడు. ఓ సారి జింకను వేటాడుతూ చాలా దూరం వెళ్లాడు. గురిచూసి బాణం వదిలాడు. బాధగా అరుస్తూ పొదల పక్కన అది నేలకు ఒరిగింది. మోహనుడు అక్కడకు వెళ్లేసరికి ఓ వేటగాడు దానికి తగిలిన బాణాలు తీస్తూ కనిపించాడు.ఆ వేటగాడు మోహనుణ్ని చూసి.. ‘ఒకరు వేటాడిన జింక మీద బాణం వేయడానికి సిగ్గు లేదా?’ అన్నాడు. మోహనుడికి కోపం వచ్చింది.

Updated : 15 Sep 2020 00:58 IST

మాళవ రాజ్య పాలకుడు మోహనుడు. పాలనను నిర్లక్ష్యం చేస్తూ ఎప్పుడూ వేటకు వెళుతూ కాలక్షేపం చేస్తుండేవాడు. ఓ సారి జింకను వేటాడుతూ చాలా దూరం వెళ్లాడు. గురిచూసి బాణం వదిలాడు. బాధగా అరుస్తూ పొదల పక్కన అది నేలకు ఒరిగింది. మోహనుడు అక్కడకు వెళ్లేసరికి ఓ వేటగాడు దానికి తగిలిన బాణాలు తీస్తూ కనిపించాడు.
ఆ వేటగాడు మోహనుణ్ని చూసి.. ‘ఒకరు వేటాడిన జింక మీద బాణం వేయడానికి సిగ్గు లేదా?’ అన్నాడు. మోహనుడికి కోపం వచ్చింది. ‘మూర్ఖుడా నన్ను గుర్తుపట్టలేదా? మీ రాజును. దాన్ని నేనే వేటాడాను’ అన్నాడు బదులుగా.
‘నువ్వు.. మా రాజువా? మా రాజు పేరు కిశోరుడు. ఈ వేట నాది. మర్యాదగా వదిలేసి వెళ్లు’ అని వేటగాడు చిరాగ్గా అన్నాడు. జింకను వేటాడుతూ పరివారానికి దూరమై.. పొరుగు రాజ్యంలోకి వచ్చేసినట్లు అప్పటికి కానీ గ్రహించలేదు మోహనుడు. నెమ్మదిగా కోపం తగ్గించుకుని వేటగాణ్ని మాటల్లో పెట్టాడు. ఇంకేదైనా వస్తువు కానీ ధనము కానీ కోరుకుని జింకను తనకు విడిచిపెట్టమన్నాడు.
వేటగాడు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దగ్గర్లోని ముని బాలలు అది విని అక్కడికి వచ్చారు. తగవు ఆపమని చెప్పి తమతో తీసుకెళ్లారు.
  వారితో వెళ్లిన మోహనుడు, వేటగాడికి ముని దర్శనమిచ్చాడు. ఇద్దరూ ఆయనకు నమస్కరించారు. ‘ప్రజారంజకంగా పాలిస్తూ.. చిరకాలం భోగభాగ్యాలతో జీవించు’ అని రాజును దీవించాడు. వేటగాడిని మాత్రం ‘నువ్వు బతకనూ వద్దు.. చావనూ వద్దు’ అని అన్నాడు.
ఇద్దరినీ చెరొక విధంగా దీవించేసరికి మోహనుడికి ఆశ్చర్యం, వేటగాడికి కోపం కలిగాయి. ‘ఇలా దీవించారే స్వామీ. వేటగాడినని అలుసా? దేవుడికెలాగూ దయలేదు. మీకు కూడానా!’ అన్నాడు.
ముని నవ్వుతూ ‘నిత్యం దేవుణ్ని స్మరించే నాకు భేదభావాలు ఉండవు.. అంతరార్థం తెలియక కోపం తెచ్చుకుంటున్నావు. అంతే’ అన్నాడు. తన తొందరపాటుకు క్షమించమని, దీవెనలోని అంతరార్థం వివరించమని కోరాడు వేటగాడు.
‘రాజులు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటారు. యుద్ధంలో వీరమరణం పొందితే స్వర్గానికి.. లేదంటే నరకానికి వెళతారు వారు. రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు. అందుకే నరకానికి దూరంగా చిరకాలం సుఖంగా ఉండమని’ రాజును దీవించాను. ఇక నీ గురించి.. వేటగాళ్ల వృత్తి జీవహింసతో ముడిపడి ఉంటుంది. వారు జీవించి ఉంటే జంతువులను వధిస్తారు. మరణిస్తే పాప ఫలం అనుభవించడానికి నరకానికి వెళతారు. మీరు జీవించినంత కాలం జంతువులకు నష్టం. మరణిస్తే నరకానికి వెళతారు. కనుక నీకూ కష్టమే. అందుకే నిన్ను అలా దీవించాను’ అని ముని చెప్పగానే వేటగాడికి, రాజుకు జ్ఞానోదయం ఒకేసారి కలిగాయి.
జింక కోసం గొడవ పడిన సంగతి మరిచిపోయి మునికి కృతజ్ఞతలు చెప్పుకొని ఇద్దరూ బయటపడ్డారు. వేట కన్నా.. రాజ్యపాలనే ముఖ్యమని మోహనుడు గ్రహించి.. అప్పటి నుంచి ప్రజారంజకంగా పాలించాడు. వేట మానేసి వేటగాడు అడవిలో దుంపలు, దినుసులు, వంటచెరకు సేకరించి అమ్ముకుంటూ జీవనం సాగించాడు.

-నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని