నాన్నా.. నన్ను క్షమించు!

అనగనగా ఓ నాన్న. ఆ నాన్నకు ఓ కొడుకు. రోజులు గడిచాయి. కొడుకు పెద్దవాడయ్యాడు. నాన్న ముసలివాడయ్యాడు. ఓ రోజు తండ్రి కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చినట్లుంది. తండ్రి కొడుకును అడిగాడు...‘ఎవరు బాబు వచ్చింది?’ కొడుకు వచ్చినతని పేరు, వివరాలు తన తండ్రికి చెప్పాడు.

Published : 16 Sep 2020 01:42 IST

నగనగా ఓ నాన్న. ఆ నాన్నకు ఓ కొడుకు. రోజులు గడిచాయి. కొడుకు పెద్దవాడయ్యాడు. నాన్న ముసలివాడయ్యాడు. ఓ రోజు తండ్రి కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చినట్లుంది. తండ్రి కొడుకును అడిగాడు...‘ఎవరు బాబు వచ్చింది?’ కొడుకు వచ్చినతని పేరు, వివరాలు తన తండ్రికి చెప్పాడు.

కాసేపటికి ఇంకొకరు వచ్చారు. ‘బాబు ఎవరు వచ్చారు?’ అని తండ్రి మళ్లీ అడిగాడు. ఈ సారి కొడుకు.. కాస్త విసుగ్గా బదులిచ్చాడు. ఇంకాసేపటికి మరొకరు వచ్చారు. ‘ఎవరు బాబు.. వచ్చింది’ అని తండ్రి మళ్లీ ఓసారి అడిగాడు. ఇక చిర్రెత్తుకొచ్చింది. ‘మీకు ఏ పనీపాట లేదా? ఎవరు వచ్చారు? ఎవరు పోయారు? అంటూ రోజంతా ఒకటే ఆరాలు తీస్తున్నారు?’ అని తండ్రిని కోపగించుకున్నాడు.

పాపం.. తండ్రి చిన్నబుచ్చుకున్నాడు. ఎంతో బాధతో మెల్లిగా తన కొడుకుతో ఇలా అన్నాడు.. ఓ ముప్పై ఏళ్లక్రితం నువ్వు చిన్న పిల్లాడివి. ఓ రోజు నిన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నాను. ఇంతలో ఎక్కడినుంచో ఓ పావురం వచ్చి ఎదురింటి పెంకులపై వాలింది. అప్పుడు చిన్నపిల్లాడివైన నువ్వు.. ‘నాన్నా అదేమిటి?’ అని అడిగావు. అప్పుడు నేను అది పావురం అని చెప్పాను. కాసేపటికి నువ్వు మళ్లీ ‘నాన్నా అదేమిటి?’అని అడిగావు. చిన్నా అది పావురం అని చెప్పాను.

ఇలా నువ్వు ఓ ఇరవై సార్లు అడిగి ఉంటావు. అలా నువ్వు అడిగిన ప్రతిసారీ అది పావురం అని చెబుతూనే ఉన్నా. ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఇలా నువ్వు ‘నాన్నా.. ఇదేమిటి? నాన్నా.. అదేమిటి?’ అని నిత్యం నన్ను వందలాదిసార్లు సతాయించేవాడివి. నువ్వు అంతచేసినా నిన్ను ఎప్పుడైనా కసురుకొన్నానా? నేను నీ ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పా కదా. మరి నువ్వేమో... ఇప్పుడు నన్ను విసుక్కుంటున్నావు అని తండ్రి ఆవేదనతో అన్నాడు.

కొడుకు తన తప్పేంటో తెలుసుకున్నాడు. తనను పెంచి పెద్ద చేయడానికి తన తండ్రి పడ్డకష్టం, ఆయన చేసిన త్యాగం తన కళ్లముందు కదలాడాయి. క్షణం ఆలస్యం చేయకుండా.. ఆయన కాళ్లమీద పడి ‘నాన్నా.. నన్ను క్షమించు’ అని వేడుకున్నాడు. వెంటనే తండ్రి ‘అయ్యో.. పిచ్చికన్నా.. ఏంట్రా ఇది’ అని గుండెలకు హత్తుకున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని