కిచకిచ.. మందుపాతరల్ని పట్టేస్తాయి

ఎలుకలు ఏం చేస్తాయ్‌? ఇంకేం చేస్తాయ్‌.. ఇళ్లలో చొరబడతాయి. బియ్యం.. పప్పులు.. తిండి పదార్థాలు పాడు చేస్తాయి. పొలాల్లో అయితే పంటలకూ నష్టం కలిగిస్తాయి. కానీ కొన్ని దేశాల్లో ఇవి బాంబ్‌స్క్వాడ్‌గా సేవలందిస్తున్నాయి. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందామా!

Updated : 27 Sep 2020 07:19 IST

ఎలుకలు ఏం చేస్తాయ్‌? ఇంకేం చేస్తాయ్‌.. ఇళ్లలో చొరబడతాయి. బియ్యం.. పప్పులు.. తిండి పదార్థాలు పాడు చేస్తాయి. పొలాల్లో అయితే పంటలకూ నష్టం కలిగిస్తాయి. కానీ కొన్ని దేశాల్లో ఇవి బాంబ్‌స్క్వాడ్‌గా సేవలందిస్తున్నాయి. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందామా!

తంలో కొన్ని ఆఫ్రికన్‌ దేశాల్లో వేల సంఖ్యలో మందుపాతరలు అమర్చారు. ఇప్పుడు అవి సామాన్య ప్రజానీకానికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. చాలా మంది వీటి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఆఫ్రికన్‌ జెయింట్‌ పౌచ్‌డ్‌ ఎలుకలు ఇక్కడి వారికి ఎంతో సేవ చేస్తున్నాయి. నిజానికి వీటి కంటిచూపు చాలా తక్కువ. కానీ వీటికి వాసన పసిగట్టే అమోఘమైన శక్తి ఉంది. దీంతో ఇవి కుక్కలు, మనుషుల కన్నా మెరుగ్గా.. లాండ్‌మైన్‌లను గుర్తించగలుగుతున్నాయి.

ఆహారాన్ని బహుమతిగా ఇచ్ఛి..

ఈఎలుకలు తేలికగా మన భాషను అర్థం చేసుకోలేవు. అందుకే ఆహారాన్ని బహుమతిగా ఇస్తూ.. వీటికి మందుపాతరలను గుర్తించడంలో శిక్షణ ఇస్తారు. మందుపాతరలున్నాయన్న అనుమానిత ప్రాంతాల్లో ఈ ఎలుకలను రంగంలోకి దింపుతారు. వీటికి పెద్ద తాడు కట్టి.. మనిషి దూరంగా ఉంటాడు. ఎలుకలు నేలపై వెళుతూ.. మందుపాతరల వాసన పసిగడుతుంటాయి. జాడ తెలియగానే నేలను తన కాళ్లతో కాస్త తోడుతుంది. అంటే అక్కడ మందుపాతర ఉందని అర్థం! అప్పుడు సిబ్బంది పేలుడుపదార్థాలను నిర్వీర్యం చేస్తారు. ఈ ఎలుకలు తక్కువ బరువు ఉండటం వల్ల.. పొరపాటున మందుపాతర మీద నుంచి వెళ్లినా.. ఏ ప్రమాదమూ జరగదు. వీటిలో అద్భుత ప్రతిభ కనబరిచిన వాటికి ప్రత్యేక బహుమతులూ ఉంటాయండోయ్‌! ఇటీవల కంబోడియాకు చెందిన మగవా అనే ఎలుక సేవలను గుర్తించి ‘పీపుల్స్‌ డిస్పెన్సరీ ఫర్‌ సిక్‌ యానిమల్స్‌’ అనే సంస్థ బంగారు పతకాన్నీ అందించింది.


అన్నీ ఈ పని చేయలేవు..

ఆఫ్రికన్‌ జెయింట్‌ పౌచ్‌డ్‌ ఎలుకలు మాత్రమే పనిచేయగలవు. ఇవి కిలో నుంచి కిలోన్నర వరకు బరువు ఉంటాయి. 25 సెంటీమీటర్ల నుంచి 45 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. ఇవి కేవలం మందుపాతరలనే కాదు.. మనుషుల కఫాన్ని వాసన చూసి టీబీ వ్యాధినీ శాస్త్రవేత్తల కన్నా వేగంగా.. నిర్ధారించగలవంట. ఇన్ని విధాలుగా ఇవి మనుషులకు సేవ చేస్తున్నాయి కాబట్టే వీటినే ‘హీరో ఎలుకలు’ అని పిలుస్తున్నారు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని