ముల్లును ముల్లుతోనే తీయాలి!

సింహానికి ఓ రోజు కొలనులో చేప కనిపిస్తే తినేసింది. దాని ముల్లు గొంతులో ఇరుక్కుపోయింది. విషయాన్ని నక్కకు కబురు పెట్టింది. అది కొంగను వెంటబెట్టుకొచ్చింది.కండపట్టిన ఆ కొంగను చూడగానే దాన్ని తినేయాలని సింహం అనుకుంది. ‘మిత్రులారా! నేను ఈ అడవికి రాజును. నాకు వైద్యం చేసే సమయంలో మీరెవరూ ఉండకూడదు. కొంగ ఈ రోజు ఇక్కడే నాతోపాటు గుహలో ఉండి ఏదో ఒక సమయంలో ముల్లు తీసి రేపు ఉదయాన్నే వెళ్తుంది’ అని చెప్పింది.

Updated : 13 Oct 2020 00:38 IST

సింహానికి ఓ రోజు కొలనులో చేప కనిపిస్తే తినేసింది. దాని ముల్లు గొంతులో ఇరుక్కుపోయింది. విషయాన్ని నక్కకు కబురు పెట్టింది. అది కొంగను వెంటబెట్టుకొచ్చింది.
కండపట్టిన ఆ కొంగను చూడగానే దాన్ని తినేయాలని సింహం అనుకుంది. ‘మిత్రులారా! నేను ఈ అడవికి రాజును. నాకు వైద్యం చేసే సమయంలో మీరెవరూ ఉండకూడదు. కొంగ ఈ రోజు ఇక్కడే నాతోపాటు గుహలో ఉండి ఏదో ఒక సమయంలో ముల్లు తీసి రేపు ఉదయాన్నే వెళ్తుంది’ అని చెప్పింది.
మృగరాజు మాటల్లో ఏదో దుర్బుద్ధి ఉందని నక్క గ్రహించింది. ఒక పెద్ద ఈత ముల్లు తీసుకొచ్చి కొంగకు ఇచ్చింది. ‘జాగ్రత్త మిత్రమా! మృగరాజు గొంతులోని చేప ముల్లు తీసేందుకు ఈ ఈతముల్లే కీలకం’ అని నక్క వివరించి వెళ్లిపోయింది.  
సాయంత్రం సింహం గుహద్వారాన్ని మూసివేసింది. కొంగకు మొదట భయం వేసింది. తర్వాత కచ్చితంగా ఆపద ఉందని గ్రహించింది. తనకు నక్క ఈతముల్లు ఎందుకిచ్చిందో అప్పుడు కొంగకు అర్థమైంది.
సింహానికి అనుమానం రాకుండా ‘మృగరాజా! ముల్లును ముల్లుతోనే తీయాలి అని పెద్దలు అన్నారు. మీ గొంతులోని చేప ముల్లును ఈ ఈత ముల్లుతో తీస్తాను’ అంది. సింహం సరేనని గొంతు తెరిచింది. కొంగ వెంటనే చేప ముల్లు తీసి చూపించి.. ‘చేప ముల్లు తీశాను. కానీ, పొరపాటుగా ఈత ముల్లు మీ గొంతులోనే ఉండిపోయింది. దాన్ని తీయాలంటే తుమ్మ ముల్లు కావాలి. అందుకు మీరు గుహ ద్వారం తెరవాలి’ అని భయంభయంగా చెప్పింది.
చేప ముల్లు కంటే ఈతది మృగరాజుని మరింత బాధించసాగింది. దాంతో ‘సరే, త్వరగా వెళ్లి తుమ్మముల్లు తీసుకురా పో..’ అని అరిచింది. కొంగ తుర్రుమంటూ పారిపోయింది. ఆ ఈత ముల్లు నొప్పిని భరించలేక, కొంగ ఎందుకు జారుకుందో ఎవరికీ చెప్పలేక సింహం తనలోతానే కుమిలిపోయింది.

- మీగడ వీరభద్రస్వామి, చోడవరం, విశాఖపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని