Published : 06 Dec 2020 01:31 IST

రోబో సాయం..ఇంట్లోనే వ్యవసాయం!

మనం తినే ఆహారాన్ని సొంతంగా పండించుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ, స్థలం కొరత, అవగాహన లేకపోవడం తదితర కారణాలతో కూరగాయలు, బియ్యం అన్నీ బయటి నుంచే కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ సమస్యకు ఓ కుర్రాడు పరిష్కారం ఆలోచించాడు. అదే ‘ఆటో ఫార్మ్‌’. ఆ విశేషాలు తెలుసుకుందామా..!!
హైదరాబాద్‌కు చెందిన ఆశ్రిత్‌ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతడు అమెరికాలోని జార్జియాలో జన్మించాడు. రోబో సహాయంతో పంటలు పండించే నమూనా ‘ఆటో ఫార్మ్‌’ను ఈ బాలుడు రూపొందించాడు. దానికి ‘ఇంటర్నేషనల్‌ యూత్‌ రోబో కాంపిటీషన్‌’లో సీనియర్‌ విభాగంలో ప్రథమ స్థానం దక్కింది.
 అన్ని పనులు..  
ఆశ్రిత్‌ తయారు చేసిన నమూనాలో ఉండే రోబో దానంతట అదే పొలాన్ని దున్నుతుంది.. విత్తనాలు చల్లుతుంది.. అవసరమైనప్పుడు మొక్కలకు నీళ్లు కూడా పోస్తుంది. పరికరంలో ఉండే సెన్సార్లు మట్టిలోని తేమ శాతాన్ని గమనిస్తూ ఉంటాయి. తక్కువ ఖర్చుతో మానవ ప్రమేయం అవసరం లేకుండా రూపొందించిన నమూనా ఇది.
 రోబోటిక్స్‌ నేర్చుకొని..
రోబో తయారు చేసేందుకు కొన్ని పరికరాలు(హార్డ్‌వేర్‌), అది పని చేయాలంటే సాఫ్ట్‌వేర్‌ అవసరం. ఉపాధ్యాయుడి సహాయంతో ఆశ్రిత్‌ రోబోటిక్స్‌తో పాటు ఇతర సాంకేతిక అంశాలపై పట్టు సాధించాడు. రోబో తయారు చేసేందుకు కావాల్సిన మదర్‌ బోర్డు, సెన్సార్లు, పైపులు, మోటార్లు తదితర పరికరాల కోసం అతడు ఎంతో కష్టపడ్డాడంట. మూడు, నాలుగు రోజులు వెతికి వెతికి వాటిని సేకరించాడు. తర్వాత వారం రోజుల్లో ఆటో ఫార్మ్‌ను పూర్తి చేశాడు. సెప్టెంబరులో ఆన్‌లైన్‌లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాడు.

 


భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు

తన ఆలోచనకు మొదటి స్థానం దక్కడంతో ఆశ్రిత్‌ ఎంతో సంబరపడుతున్నాడు. గతేడాది దక్షిణ కొరియాలో జరిగిన పోటీల్లో ఆశ్రిత్‌ బృందం ప్రయోగానికి ద్వితీయ స్థానం దక్కింది. ‘ఇది తొలి అడుగు మాత్రమే. సామాన్యుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తా. ‘ఆటో ఫార్మ్‌’తో పెట్టుబడి తగ్గుతుంది.. కూలీల అవసరం ఉండదు.. ఉత్పత్తి పెరుగుతుంది’ అని పద్నాలుగేళ్ల ఆశ్రిత్‌ చెబుతున్నాడు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు