ఖాళీ కాగితమే కరెన్సీ నోటు!

ఎవరైనా ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తే వాళ్ల ఇంట్లో వాళ్లు.. ‘డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా ఏంటి? అలా దుబారా చేస్తున్నావ్‌.. కాస్త చూసుకో’ అంటుంటారు. కానీ ఈ మ్యాజిక్‌ మాత్రం ‘డబ్బులు కాగితాలకు కాస్తాయా?’ అని ఓ క్షణంపాటు మనం విస్మయానికి గురయ్యేలా చేస్తుంది. మరి అంతగా ఆశ్చర్యపరిచే మ్యాజిక్‌ ఎలా చేయడమో మనమూ నేర్చుకుందామా!....

Published : 27 Dec 2020 01:37 IST

ఎవరైనా ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తే వాళ్ల ఇంట్లో వాళ్లు.. ‘డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా ఏంటి? అలా దుబారా చేస్తున్నావ్‌.. కాస్త చూసుకో’ అంటుంటారు. కానీ ఈ మ్యాజిక్‌ మాత్రం ‘డబ్బులు కాగితాలకు కాస్తాయా?’ అని ఓ క్షణంపాటు మనం విస్మయానికి గురయ్యేలా చేస్తుంది. మరి అంతగా ఆశ్చర్యపరిచే మ్యాజిక్‌ ఎలా చేయడమో మనమూ నేర్చుకుందామా!

మొదటగా మీరు ఓ ఖాళీ కాగితాన్ని ప్రేక్షకులకు చూపిస్తారు. తర్వాత ‘అబ్రకదబ్ర హాంఫట్‌’ అంటూ ఎడమచేతిని కుడి చేతి దగ్గరకు తీసుకువెళ్లి నెమ్మదిగా మళ్లీ ఎడమవైపునకే తీసుకువస్తుంటారు. విచిత్రంగా తెల్లకాగితం కరెన్సీ నోటుగా మారుతుంది. ఇప్పుడు ఆ నోటును రెండు వైపులా వీక్షకులకు చూపిస్తారు. అంతే మ్యాజిక్‌ అయిపోయింది! మీ అనుమానం మాత్రం అలాగే మిగిలిపోయింది కదూ! చిన్న ట్రిక్‌ నేర్చుకుంటే చాలు ఈ మ్యాజిక్‌ మీరూ ఇట్టే చేసేయొచ్చు.

కిటుకు ఏంటంటే.. : ముందు సమాన విలువున్న, చూడడానికి ఒకేలా ఉన్న రెండు కరెన్సీ నోట్లను తీసుకొని మధ్యలో ఒకదానికొకటి అతికించుకోవాలి. ఇప్పుడు సరిగ్గా కరెన్సీ నోటు కొలతలతో కత్తిరించిపెట్టుకున్న తెల్లకాగితాన్ని రెండో కరెన్సీ నోటు మధ్యలో పుస్తకంలోని పేజీల్లా అతికించాలి. అంటే ఒకటి, రెండు, మూడు, నాలుగు, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు పేజీలు కరెన్సీ నోట్లుంటే.. అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది పేజీలుగా తెల్లకాగితం ఉండాలన్నమాట. ప్రేక్షకులకు చూపించేటప్పుడు ఆరు, ఏడు పేజీలు అంటే తెల్లకాగితం చూపిస్తాం. ఎడమచేతిని కుడిచేతి దగ్గరకు తెచ్చి మెల్లిగా మూడో పేజీని అంటే కరెన్సీ నోటును మూస్తే తెల్లకాగితం లోపలకు వెళ్లి కరెన్సీ నోటు పైకి వస్తుంది. ఇది చూసేవారికి తెల్లకాగితం కరెన్సీ నోటుగా మారినట్లుగా కనిపిస్తుంది.
జాగ్రత్తలు : కరెన్సీ నోట్లు, తెల్లకాగితం అతికించుకోవడంలోనే ఈ మ్యాజిక్‌ అంతా ఆధారపడి ఉంటుంది. కరెన్సీ నోట్లు రెండు వాడుతున్నట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వీక్షకులకు అనుమానం రాకుండా చూసుకోవాలి. ముందు వైపు, వెనకవైపు కరెన్సీ నోటు వేరు వేరుగా కనిపించేలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రేక్షకులు మనకు కాస్త దూరంలో, దిగువన ఉండేలా చూసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని