ఈ చిన్నారి.. మరో ‘మయూరి’!

ప్రమాదంలో కాలు కోల్పోతే నడవడమే కష్టం. అలాంటిది ఓ చిన్నారి కృత్రిమ కాలు సాయంతో ఏకంగా నాట్యమే చేస్తోంది. ‘మయూరి’ సినిమాలో నటించిన సుధాచంద్రన్‌ పేరు మీరు వినే ఉంటారు కదా! ఆమె రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. పట్టుదలతో కృత్రిమ కాలుతో నృత్యప్రదర్శనలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.

Updated : 24 Jan 2021 06:27 IST

ప్రమాదంలో కాలు కోల్పోతే నడవడమే కష్టం. అలాంటిది ఓ చిన్నారి కృత్రిమ కాలు సాయంతో ఏకంగా నాట్యమే చేస్తోంది. ‘మయూరి’ సినిమాలో నటించిన సుధాచంద్రన్‌ పేరు మీరు వినే ఉంటారు కదా! ఆమె రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. పట్టుదలతో కృత్రిమ కాలుతో నృత్యప్రదర్శనలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. రాజమహేంద్రవరానికి చెందిన యామిని కూడా రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. తర్వాత తపనతో నాట్యం నేర్చుకుని ప్రదర్శనలిస్తూ.. అందరితో ప్రశంసలు అందుకుంటోంది.

ఊహ తెలియకముందే.
యామిని వాళ్ల సొంతూరు విశాఖపట్నం. అక్కడ అమ్మతో కలిసి ఊరు వెళ్లినపుడు రెండేళ్ల వయసులో ప్రమాదం జరిగింది. ఎక్కేలోపే బస్సు కదలడంతో ముందు చక్రం కిందపడి ఆమె కాలు నుజ్జునుజ్జైంది. చెంగుచెంగున ఎగరాల్సిన వయసులో మంచానికే పరిమితమైంది. ఆర్థికంగా వెనకబడిన కుటుంబం కావడంతో చిన్నారిని ఆపద్బాంధవిలా ఓ స్వచ్ఛంద సంస్థ ఆదుకుంది. వారి సాయంతో పాపకు ఆరేళ్ల వయసులో కృత్రిమ కాలు అమరింది. అప్పటి నుంచి ఏటా ఆమె పెరుగుదలకు అనుగుణంగా కృత్రిమ కాలు ఉచితంగా మారుస్తున్నారు. ప్రస్తుతం యామినికి 14 సంవత్సరాలు.. ఏడో తరగతి చదువుతోంది. 

డ్యాన్స్‌ అంటే ఇష్టంతో..
చిన్నప్పటి నుంచి యామినికి నృత్యం అంటే చాలా ఇష్టం. కృత్రిమ కాలుతో ఇంట్లోనే సాధన చేసేది. వాళ్ల నాన్న ప్రసాదరావు ఓ షూ కంపెనీలో పనిచేసేవారు. 2017లో బదిలీ కావడంతో రాజమహేంద్రవరం వచ్చారు. వీళ్ల ఇంటికి సమీపంలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌కు చాలామంది వచ్చి డ్యాన్స్‌ నేర్చుకునేవారు. ఓరోజు చిన్నారి అక్కడకు వెళ్లి తనకూ డ్యాన్స్‌ నేర్పమని మాస్టర్‌ మధుని అడిగింది. చూడడానికి అందరిలానే కనిపించడంతో ఆయన వెంటనే ఒప్పుకొన్నారు. రెండురోజుల సాధన తర్వాత ఆయనకు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. కృత్రిమ కాలుతో సులభంగా డ్యాన్స్‌ చేస్తున్న యామినికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.

పలు చోట్ల ప్రదర్శనలు
డ్యాన్స్‌ మాస్టర్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రంలో పలుచోట్ల యామిని ప్రదర్శనలు ఇచ్చింది. గతంలో రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం ‘ఆనంద ఆదివారం’ కార్యక్రమం జరిగేది. అందులో చాలా వరకు ప్రదర్శనలు ఇచ్చింది. 2018లో విశాఖపట్నం, 2019లో విజయవాడ, కాకినాడలో జరిగిన డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొంది. సినీ కొరియోగ్రాఫర్లు శేఖర్‌ మాస్టర్‌, అమిత్‌, సాయితేజ, రాజు వంటివారి ప్రశంసలు అందుకుంది. భవిష్యత్తులో బాగా చదువుకొని మంచి వైద్యురాలిగా స్థిరపడటమే తన లక్ష్యం అని చెబుతోంది చిన్నారి యామిని. మరి మనమూ ఆమెకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!

- వై.సూర్యకుమారి, న్యూస్‌టుడే,
రాజమహేంద్రవరం సాంస్కృతికం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని