Updated : 01 Feb 2021 04:58 IST

పంది సాయం.. నక్కకు గాయం!

డవిలో పందులు వాటి ఆహారం కోసం వాడి మూతులతో నేలను గుంతలు గుంతలుగా చేసి రుచికరమైన దుంపలను తనివితీరా తింటుండేవి. ఓసారి నక్క తన జిత్తులతో కుందేలును వేటాడే వేళ అదుపు తప్పి ఓ గుంతలో పడిపోయింది. కుందేలు తప్పించుకుపోయింది. నక్క గాయాలపాలైంది. దానికి తెగ కోపం వచ్చింది. అప్పటి నుంచి ఈ గుంతలకు కారణం ఎవరా? అని ఆరా తీయడం మొదలు పెట్టింది.
ఓసారి పందుల గుంపు ఆహారాన్వేషణలో భాగంగా మూతులతో నేలకు గుంతలు చేయడం నక్క కంటపడింది. అది కోపంతో ఊగిపోయింది. ‘మీకు పనీపాటా లేదా?’ అంటూ పందులపై చిందులేసింది.
‘మా కడుపు నింపుకోవడానికి ఇలా చేయక తప్పదు. ఇలా చేయడంలో జంతుగణానికి పరోక్షంగా సాయం అందిస్తున్నాం’ అని గుంపులో ఉన్న ముసలి పంది వివరణ ఇచ్చింది. దీంతో నక్కకు ఒళ్లు మండింది. ‘జంతుగణానికి జరుగుతున్న అసౌకర్యాన్ని గుర్తించక, పరోక్ష సాయం అంటూ అబద్ధం చెబుతున్నావా? మీ సంగతి మృగరాజు దగ్గరే తేల్చుకుంటాను’ అంటూ అక్కడ నుంచి పరుగు పెట్టింది.
కాసేపు గడిచాక సింహాన్ని తీసుకుని నక్క అక్కడకు వచ్చింది. అడవిలో గుంతలు పడున్న నేలను చూపించింది. ‘పందుల నిర్వాకం చూశారా.. రాజా!’ అంటూ నక్క సింహానికి ఫిర్యాదు చేసింది. ‘అందమైన అడవిని పాడు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు. పైగా ఇదేదో మాకు సాయపడే ఘనకార్యమని అబద్ధాలు ఆడుతున్నారని నక్క చెప్పింది. ఈ అడవిలో మీరు ఉండాలంటే ఈ పని మానేయాలి’ అని గర్జించింది సింహం.
‘ప్రభూ! ఈ పని విడిచిపెట్టాలంటే మా కడుపు మాడ్చుకోవాలి. తిండిలేని చోట మేము బతకలేము. మీ మాటను జవదాటి కూడా ఇక్కడ ప్రాణాలతో ఉండలేము. అందుకే ఈ అడవిని విడిచి మరో అడవికి పోతాము’ అని వినయంగా సమాధానమిచ్చింది ముసలి పంది. అనంతరం పందుల గుంపు అక్కడి నుంచి మరో అడవికి ప్రయాణమైంది.
తన మాట చెల్లుబాటు అయినందుకు నక్క తెగ సంతోషించింది. సింహాన్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసింది. ఏనుగుల ద్వారా గుంతలను కప్పించే ఏర్పాట్లు చేయమని సింహానికి సలహా కూడా ఇచ్చింది. ఇప్పుడు గజరాజులు గుంతలు పూడ్చే పనిలో పడ్డాయి. రోజులు గడుస్తున్నాయి. వర్షాకాలం, చలికాలం పూర్తై వేసవికాలం వచ్చింది. ఇంతకుముందు ఏ సంవత్సరమూ లేని నీటి కొరత ఆ యేడు కనిపించింది. అడవిలో ఉన్న ఒకే ఒక్క చెరువు కూడా ఎండిపోయింది.
జంతువులు దప్పిక తీర్చుకోవడానికి దూరప్రాంతాలకు పోవాల్సి వచ్చేది. మనుషుల కంటపడిన కొన్ని జంతువులు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం సింహాన్ని ఎంతో బాధించింది. వెంటనే జంతువులన్నింటినీ సమావేశపరిచింది. ఈ విపత్తుకు కారణం ఏంటని ఆరా తీసింది.
పర్యావరణం మీద అవగాహన ఉన్న కోతి బాగా ఆలోచించాక మన అడవిలో పందుల గుంపు లేకపోవడమే ఈ అనర్థానికి కారణమని చెప్పింది. కోతి మాటలు నక్కకు రుచించలేదు. ‘పందుల తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నావు. చాటుమాటుగా దుంపలు కానీ లంచంగా అందాయా.. ఏంటి?’ అంటూ ఎద్దేవా చేసింది.
‘యదార్థవాది లోక విరోధి అనేది నిజమే అనిపిస్తోంది’ అని నక్కకు ధీటుగా సమాధానమిచ్చింది కోతి. ‘ఏమిటా యదార్థం?’ ఈ సారి సింహం కలుగజేసుకుని అడిగింది. ‘ప్రభూ! నన్ను నిందించినా నిజమే చెబుతాను. అడవి బాగుంటేనే అందరం బాగుంటాము. పందులు ఆహారాన్వేషణలో దుంపల కోసం గుంతలు చేస్తాయి. అది వాటి నైజం. దాని వల్ల మనకు మేలే జరుగుతుంది. వర్షాకాలంలో పడిన వాననీరు అడవి దాటిపోకుండా పడిన చోటే గుంతల్లో చేరి నెమ్మదిగా నేలలో ఇంకి భూగర్భజలాల పెరుగుదలకు దోహదపడుతుంది. ఆ నిల్వలు నిండుగా ఉంటేనే చెరువు ఎండిపోకుండా ఉంటుంది. పందులు చేసే గుంతలు ఇంకుడుగుంతల్లా పనిచేస్తాయి. వేసవిలో నీటి కొరత లేకుండా గతంలో ఇవే మనకు ఉపయోగపడ్డాయి. వాటిని పూడ్చాకే మనకు ఈ అనర్థం ముంచుకొచ్చింది’ అని వివరించింది కోతి.
బాగా ఆలోచించిన తర్వాత సింహానికి కోతి చెప్పేది అక్షర సత్యం అని అర్థమైంది. నక్క ఉచిత సలహా ప్రభావం కొంపముంచిందని తెలుసుకుంది. తప్పు సరిదిద్దే ప్రయత్నంగా పందుల గుంపు స్వాగతానికి ఏర్పాట్లు చేయమని నక్కనే పురమాయించింది. నక్కకు తల తీసినంత పనైంది. తప్పనిసరి పరిస్థితుల్లో పందుల గుంపు కోసం ఎర్రటిఎండలో వెతుకులాట ప్రారంభించింది.

- బి.వి.పట్నాయక్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts