Updated : 03 Feb 2021 06:00 IST

మారిన కొడవలి!

నగనగా కృష్ణాపురం అనే గ్రామంలో గోపాలం అనే కంసాలి నివసిస్తుండేవాడు. చాలా నిజాయతీపరుడు. రైతులకు న్యాయమైన ధరలకే పనిముట్లు తయారు చేసి ఇచ్చేవాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అతనికి మంచి పేరు ఉంది. అక్కడి రైతులూ గోపాలం దగ్గరే పనిముట్లు తయారు చేయించుకునేవారు.

ఒకరోజు పక్క గ్రామంలోని ఒక పెద్దాయన, తన దగ్గర ఉన్న పాత ముడి ఇనుమును తీసుకుని కృష్ణాపురం బయలుదేరాడు. కొలిమిలో ఇనుప చువ్వలు సాగదీసే పనిలో నిమగ్నమై ఉన్నాడు గోపాలం. పెద్దాయన రానేవచ్చాడు. గోపాలాన్ని చూడగానే.. ‘గోపాలం అంటే నువ్వేనా..? పనిముట్లు చాలా బాగా చేస్తావని విన్నాను. నా దగ్గర కొంత ఇనుము ఉంటే తెచ్చాను. వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు చేసి పెట్టాలి’ అంటూ తను తెచ్చిన ఇనుము ఇచ్చాడు పెద్దాయన. ‘అలాగే పెద్దాయన, తప్పకుండా.. చేసి ఇవ్వడానికి కాస్త ఆలస్యం అవుతుంది. కాబట్టి మీరు కొన్ని రోజులు ఆగి రండి’ అన్నాడు గోపాలం. సరే అని వెళ్లిపోయి, కొన్ని రోజులకు వచ్చాడు పెద్దాయన.

‘కొడవలి, నాగలి, పలుగు, గడ్డపార, గొడ్డలి, గొర్రు ఇలా అన్నీ రెండేసి చేశాను. ఇవన్నీ చేయగా ఇదిగో ఇంకా కొంత ముడి ఇనుము మిగిలింది తీసుకోండి’ అంటూ పెద్దాయన ముందుంచాడు గోపాలం. ఒక్కో పనిముట్టు తీసుకుని జాగ్రత్తగా పరిశీలించి గోపాలం పనితనానికి అబ్బురపడ్డాడు పెద్దాయన. పైగా మిగిలిన ముడి ఇనుము కూడా ఎంతో నిజాయతీగా తిరిగి ఇస్తున్నందుకు చాలా సంతోషపడ్డాడు. ఇవ్వాల్సిన పైకం కంటే కాస్త ఎక్కువే ఇచ్చాడు పెద్దాయన. ‘ఇదిగో గోపాలం ఈ మిగిలిన ముడి ఇనుము కూడా నువ్వే తీసుకో. ఇది నీ నిజాయతీకి నేను ఇస్తున్న బహుమానం’ అంటూ వెళ్లిపోయాడు.

పెద్దాయన ఇచ్చిన ఇనుముతో ఏదైనా వస్తువు తయారు చేయమని సలహా ఇచ్చింది భార్య లక్ష్మి. దాంతో రెండు మంచి కొడవళ్లు తయారు చేశాడు గోపాలం. వీటిని ఎవరికైనా అమ్మి తన కొడుకు దినేష్‌కు పుస్తకాలు కొనాలనుకున్నాడు గోపాలం. ‘నేను కష్టపడి పనిచేస్తాను నన్ను మంచి రైతుకు అమ్ము’ అంది ఓ కొడవలి. ‘నేను నీ దగ్గరే ఉంటాను. నన్ను ఎవ్వరికీ అమ్మొద్దు. నాకు పనిచేయడం ఏ మాత్రం ఇష్టం లేదు’ అంది మరో కొడవలి. గోపాలం మొదటి కొడవలిని ఒక రైతుకు అమ్మి మరో కొడవలిని తన దగ్గరే ఉంచుకున్నాడు.
కొన్నాళ్ల తర్వాత.. ఆ రోజు కొడవలిని కొన్న రైతు గోపాలం దగ్గరకు వచ్చాడు. ‘గోపాలం ఈ కొడవలి ఏ సమయంలో ఇచ్చావో కానీ బాగా పనిచేసింది. ఇంకాస్త సానబడితే ఇంకా చురుగ్గా తయారవుతుంది’ అన్నాడు. సరే అని గోపాలం ఈ కొడవలిని దీంతోపాటే తయారుచేసిన కొడవలి దగ్గరే పెట్టాడు. ఏ పనీ చేయకుండా తుప్పు పట్టి ఉన్న ఆ కొడవలిని చూడగానే రైతుకు అమ్మిన కొడవలికి చాలా బాధ కలిగింది. ‘మిత్రమా.. ఏమిటి ఇలా అయిపోయావు. ఏ పనీ చేయకుండా సుఖంగా ఉంటావనుకున్నా. కానీ తుప్పు పట్టి పోయావు’ అని నిట్టూర్చింది.

‘అవును. నేను ఏ పనీ చేయకుండా సుఖంగా ఉండాలని కోరుకున్నాను. అందుకే నా శరీరం మొద్దుబారిపోయింది. నువ్వు చూడు ఎంత నిగనిగలాడుతున్నావో’అని అంది బాధగా.. కంసాలి దగ్గరే ఉండిపోయిన కొడవలి. ‘అవును మిత్రమా.. నేను రోజూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. అందుకే ఇలా ఉన్నాను. నువ్వు కష్టం చేయలేక, ఆ రోజు సుఖాన్ని కోరుకున్నావు కాబట్టే ఇప్పుడు ఇలా బాధపడుతున్నావు. కష్టపడకుండా ఒళ్లు బద్ధకంగా కూర్చుంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది’ అంది మొదటి కొడవలి. రెండో కొడవలికి తన తప్పు తెలిసొచ్చింది. సోమరితనంతో ఇన్ని రోజులు సమయాన్ని వృథా చేసినందుకు సిగ్గు పడింది. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని.. వెంటనే తనను కూడా ఎవరైనా మంచి రైతుకు అమ్మాల్సిందిగా గోపాలాన్ని కోరింది.

- ఆర్‌.కె.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts