నిజాయతీకి బహుమతి

అమరావతి రాజ్యంలో అజయ్‌ వర్మ అనే జమిందారు ఉండేవాడు. ఒకరోజు ఆయన వద్దకు రామయ్య, భీమయ్య అనే ఇద్దరు పనివాళ్లు వచ్చారు. ‘అయ్యా! మేము మీ దగ్గర చాలాకాలం నుంచి పనిచేస్తున్నాం. పిల్లలు పెరుగుతుండటంతో ఆదాయం సరిపోవడం లేదు. కొంత భూమి కౌలుకు ఇప్పిస్తే వ్యవసాయం చేసుకుంటాం. ఏటా కౌలుతో పాటు శిస్తు కూడా చెల్లిస్తాం’ అని వేడుకున్నారు.

Published : 06 Feb 2021 01:12 IST

అమరావతి రాజ్యంలో అజయ్‌ వర్మ అనే జమిందారు ఉండేవాడు. ఒకరోజు ఆయన వద్దకు రామయ్య, భీమయ్య అనే ఇద్దరు పనివాళ్లు వచ్చారు. ‘అయ్యా! మేము మీ దగ్గర చాలాకాలం నుంచి పనిచేస్తున్నాం. పిల్లలు పెరుగుతుండటంతో ఆదాయం సరిపోవడం లేదు. కొంత భూమి కౌలుకు ఇప్పిస్తే వ్యవసాయం చేసుకుంటాం. ఏటా కౌలుతో పాటు శిస్తు కూడా చెల్లిస్తాం’ అని వేడుకున్నారు.
కుటుంబం పట్ల బాధ్యత, కష్టపడి పనిచేయాలనే వారి తపన చూసి జమిందారు సంబరపడ్డాడు. ‘మీ కాళ్ల మీద మీరు నిలబడాలనే ఆలోచన బాగుంది. రాజ్యానికి ఉత్తర దిశలో ఉన్న బీడు భూమిని మీకు అప్పగిస్తున్నా. ఓపిక ఉన్నంత తీసుకొని సాగు చేసుకోండి. అందులోని చెట్లు, రాళ్లు శుభ్రం చేయాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి అయిదేళ్ల వరకు ఎలాంటి శిస్తు చెల్లించనవసరం లేదు’ అని అన్నాడు.  
ఊరికి దూరంగా ఉన్న ఆ బీడు భూమిలో రామయ్య, భీమయ్య పక్కపక్కనే చెరో రెండెకరాలు తీసుకున్నారు. అందులోని ముళ్లకంపలు, పిచ్చి మొక్కలు తొలగించడం ప్రారంభించారు. రాళ్లు, రప్పలు ఏరిపారేశారు. అరకలు కట్టి సేద్యం మొదలుపెట్టారు.
ఒకరోజు రామయ్య పొలం దున్నుతుండగా ఓ పురాతన పెట్టె ఖంగుమంటూ నాగలికి తగిలింది. దాన్ని బయటకు తీసి చూడగా.. అందులో ఓ వజ్రాల హారం కనిపించింది. పక్క పొలంలో పని చేసుకుంటున్న భీమయ్యను పిలిచి విషయం చెప్పాడు.
‘రామయ్యా! ఇన్నాళ్లూ మనం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. దీన్ని ఇద్దరం పంచుకొని సుఖంగా జీవిద్దాం’ అన్నాడు భీమయ్య. రామయ్య అందుకు ఒప్పుకోలేదు. ‘భీమయ్యా! ఈ భూమి జమిందారుకు చెందినది. ఇక్కడ దొరికే ఏ వస్తువైనా ఆయనకే సొంతం. తీసుకెళ్లి ఇచ్చేద్దాం’ అని అన్నాడు. ‘పిచ్చివాడిలా ఉన్నావే! హారం విషయం మనిద్దరికి తప్ప ఎవరికీ తెలియదు కాబట్టి మనమే తీసుకుందాం’ చెప్పాడు భీమయ్య. ‘సరే.. ఈ రాత్రికి ఆలోచించి చెబుతాను’ అని ఆ పెట్టెను ఇంటికి తీసుకెళ్లాడు రామయ్య.
రాత్రంతా బాగా ఆలోచించి, ఉదయాన్నే జమిందారు దగ్గరకు వెళ్లి ఆ పురాతన పెట్టెను అప్పగించి.. పొలం బాటపట్టాడు రామయ్య. తన పొలంలో కూడా అలాంటి పెట్టె ఏమైనా దొరుకుతుందేమోనని అంగుళం అంగుళం గమనిస్తూ.. జాగ్రత్తగా దున్నసాగాడు భీమయ్య. అనుకున్నట్టే అలాంటి పెట్టె ఒకటి ఖంగున తగిలింది. ఇక భీమయ్య ఆనందానికి అవధులు లేవు. పక్కపొలంలో ఉన్న రామయ్యకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. పెట్టెను ఇంటికి తీసుకెళ్లి దాచిపెట్టాడు.
కొన్నాళ్లు గడిచాయి. భీమయ్యకు నిద్రపట్టడం లేదు. ‘ఆ హారం నా వద్ద ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే.. కాబట్టి సొమ్ము చేసుకుంటే మంచిది’ అని అనుకున్నాడు. పక్క రాజ్యంలోని ఓ పెద్ద వ్యాపారికి హారం చూపించాడు. ఆయన బాగా పరిశీలించి.. అది వజ్రాలు పొదిగిన బంగారు హారం కాదని తేల్చాడు. అవన్నీ రంగురాళ్లే అన్నాడు. చేసేది లేక ఉసూరుమంటూ ఇంటికి వచ్చాడు భీమయ్య.
మరుసటి రోజు ఎప్పటిలాగే పొలానికి వెళ్లాడు భీమయ్య. అప్పటికే జమిందారు తన పరివారంతో పొలంలో ఉన్నాడు. రామయ్య, భీమయ్యను పిలిచాడు. ‘నేను పెట్టిన పరీక్షలో రామయ్యే నెగ్గాడు. నన్ను మోసం చేయాలని చూసిన భీమయ్య రెండెకరాలు కూడా అతడికే ఇస్తున్నా. ఇకనుంచి ఆ నాలుగు ఎకరాలు నిజాయతీగా ఉన్న రామయ్యకే సొంతం’ అని పట్టా చేతికి ఇచ్చి వెళ్లిపోయాడు జమిందారు. ‘పరుల సొమ్ముకు ఆశపడకుండా నిజాయతీగా ఉన్నందుకు రామయ్యకు పొలం దక్కింది. జమిందారును మోసం చేయాలనుకున్న నాకు తగిన శాస్తి జరిగింది’ అనుకొని బాధపడ్డాడు భీమయ్య.

- దార్ల బుజ్జిబాబు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని