కోతిపిల్ల.. సబ్బుబిళ్ల!

ఉయ్యాలతోటలో ఉండే మర్కటరాణి అనే కోతిపిల్ల చాలా తెలివైంది. చలాకీగానూ ఉంటుంది. ఒకసారి అది ఆడుకుంటూ ఆడుకుంటూ.. గోదావరి నది తీరాన, స్నానాల రేవు దగ్గరున్న పెద్ద మర్రిచెట్టు కొమ్మ మీదకు చేరింది. అటూఇటూ చూస్తున్న దానికి శివయ్య కనిపించాడు.

Updated : 11 Feb 2021 01:54 IST

య్యాలతోటలో ఉండే మర్కటరాణి అనే కోతిపిల్ల చాలా తెలివైంది. చలాకీగానూ ఉంటుంది. ఒకసారి అది ఆడుకుంటూ ఆడుకుంటూ.. గోదావరి నది తీరాన, స్నానాల రేవు దగ్గరున్న పెద్ద మర్రిచెట్టు కొమ్మ మీదకు చేరింది. అటూఇటూ చూస్తున్న దానికి శివయ్య కనిపించాడు. రేవు మెట్ల మీద కూర్చుని సబ్బు తీసుకుని ఒంటికి రాసుకుంటే నురగ రావడం, ఆ తర్వాత మళ్లీ నదిలోకి దిగి ఆ నురగను వదుల్చుకోవడం గమనించింది. ఇదంతా కోతిపిల్లకు వింతలా అనిపించింది. అదేంటో తెలుసుకోవాలనుకుంది. వెంటనే శివయ్య చూడకుండా గట్టు మీదకు వెళ్లి సబ్బు అందుకుని, గబగబా చెట్టెక్కి గుబురు కొమ్మల్లో దాక్కుంది.

కొంతసేపటికి శివయ్య గట్టు మీదకొచ్చి సబ్బు కనబడక కాసేపు చుట్టూ వెతికాడు. ఎంతకీ దొరక్కపోవడంతో ఇంటిదారి పట్టాడు. కొంతసేపటి తర్వాత స్నానాల గట్టు మీద ఎవరూ లేకపోవడం, అటువైపుగా ఎవరూ రాకపోవడం గమనించింది కోతిపిల్ల. నెమ్మదిగా చెట్టుదిగి అచ్చం శివయ్యలానే సబ్బును గట్టుమీద పెట్టి, నీళ్లలో రెండు మూడు మునకలేసి గట్టు మీదకు వచ్చి సబ్బు రాసుకుంది. అలాచేస్తే నురగ రావడంతో పాటు ఒళ్లంతా సువాసనగా అనిపించింది.

మళ్లీ నదిలోకి దూకి ఈతకొట్టి, నదిలోంచి బయటకొచ్చింది. సబ్బును చెట్టు తొర్రలో దాచి దూరంగా ఉన్న ఉయ్యాలతోటలోని ఇతర కోతుల వద్దకు వెళ్లింది. ‘ఇదిగో నా శరీరం వాసన చూడండి’ అంది. మిగతా వానరాలన్నీ దాని శరీరం వాసన చూసి ‘అబ్బో గొప్ప సువాసనగా ఉంది. ఎలా వచ్చింది?’ అని ఆశ్చర్యపోతూ అడిగాయి.

‘నేను మన ఉయ్యాలతోట వైపు వస్తుంటే దేవుడు ప్రత్యక్షమై మీ జాతిలో నువ్వు ప్రత్యేకమైన దానివి. అందుకే నీ శరీరానికి సువాసన ఇస్తున్నాను. నీకు సేవలు చేసే వానరాలను చనిపోయాక స్వర్గానికి పంపిస్తాను. లేదంటే వాటికి నరకమే అని అన్నాడు. అందువల్ల నాకు సేవ చేసుకునే అవకాశం మీకు ఇస్తున్నాను. ఇక మీ ఇష్టం’ అంది.

అది విని కోతులు పోటీపడి మరీ దానికి కూర్చున్న చోటుకే పండ్లు పట్టుకొచ్చి ఇస్తున్నాయి. అంతటితో ఆగకుండా కాళ్లు, చేతులు నొక్కి సేవ చేస్తున్నాయి.

ఇలా ఓ మూడు రోజులు గడిచాక రాజవానరానికి అనుమానం వచ్చింది. పిల్లకోతి రోజూ తెల్లవారకుండానే ఏటిగట్టు వైపు వెళ్లడం గమనించి, ఒకనాడు దాన్ని అనుసరించి వెళ్లింది. పిల్లకోతి చెట్టు తొర్రలో దాచిన సబ్బుతో స్నానం చేయడం వల్ల దాని శరీరానికి సువాసన వస్తోందని గ్రహించింది. పిల్లకోతి తొర్రలో అలా సబ్బు పెట్టి వెళ్లగానే.. ఇలా దాన్ని తీసేసింది రాజవానరం.

మరుసటి రోజు సూర్యోదయానికి ముందే చెట్టు వద్దకు వచ్చిన మర్కటరాణికి చెట్టుతొర్రలో సబ్బు కనిపించకపోయేసరికి, ఆందోళనతో చుట్టూ వెతికింది. అదే సమయంలో ‘దేవుడు నీ శరీరానికి ఇచ్చిన సువాసన ఇదేనా. దీన్నేనా నువ్వు వెతుకున్నావు’ అంది రాజవానరం. తన రహస్యం తెలిసిపోయినందుకు పిల్లకోతి ఆందోళన చెందింది. ఆ వెంటనే తేరుకుని ‘దయచేసి నీకు తెలిసిన ఈ రహస్యం మన వాళ్లకు చెప్పకు. అవి నన్ను చంపేస్తాయి’ అని ప్రాధేయపడింది.

‘నువ్వూ మన జాతి దానివే అయినా, మన వాళ్లతో మూడురోజులు పనులు చేయించుకున్నావు. అది తప్పు. దీనికి ప్రాయశ్చిత్తంగా నువ్వు మనవాళ్లకు వారంపాటు ఆహారం తీసుకొచ్చి ఇవ్వాలి. ఇంకెప్పుడూ మన వాళ్లను మోసం చెయ్యకు’ అని దాన్ని పంపించి వేసింది. తర్వాత రాజవానరం ఆ సబ్బుతో స్నానం చేసి దాన్ని నదిలో దూరంగా విసిరేసింది.

కాసేపటికి మిగతా కోతుల దగ్గరకు వెళ్లి.. ‘ఇవాళ దేవుడు నాకూ ప్రత్యక్షమై నా శరీరానికి కూడా సువాసన ఇచ్చాడు. మీ కోతులు మంచివి. అబద్ధాలాడవు. అన్యాయం చేయవు. స్వార్థం అనేది ఉండదు. చనిపోయాక అన్నింటినీ స్వర్గానికి తీసుకెళతాను. ఒక వారం పాటు పిల్లకోతి మీ అందరికీ సేవ చేస్తుంది. అలా చేస్తేనే దానికి పుణ్యమని చెప్పాడు. అందువల్ల మీరందరూ మర్కటరాణికి పుణ్యం చేసుకునే అవకాశం ఇవ్వండి’ అంది. తాను చేసిన తప్పు తెలిసొచ్చి పశ్చాత్తాపంతో మిగతా కోతులకు మనస్ఫూర్తిగా సేవచేయడానికి సిద్ధపడింది పిల్లకోతి.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని