పావురం మాట.. చిలుక, కోకిలకు ఊరట!

సతతారణ్యంలో చిలుక, కోకిల చాలా స్నేహంగా ఉండేవి. ఎక్కడికైనా రెండూ కలిసే వెళ్లేవి. దొరికిన కాయలు, పండ్లు పంచుకొని తినేవి. అడవిలోని ఇతర పక్షులను, జంతువులను చిలుక తియ్యగా పలకరించేది. కోకిల కూడా తన గాత్రంతో అలరించేది.

Updated : 20 Feb 2021 00:22 IST

సతతారణ్యంలో చిలుక, కోకిల చాలా స్నేహంగా ఉండేవి. ఎక్కడికైనా రెండూ కలిసే వెళ్లేవి. దొరికిన కాయలు, పండ్లు పంచుకొని తినేవి. అడవిలోని ఇతర పక్షులను, జంతువులను చిలుక తియ్యగా పలకరించేది. కోకిల కూడా తన గాత్రంతో అలరించేది.
ఒకరోజు చిలుక, కోకిల గాలికి ఊగుతున్న మామిడి చెట్టు కొమ్మ మీద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాయి.
‘మనిద్దరి గొంతులు చక్కగా ఉంటాయి. నువ్వు బాగా మాట్లాడగలవు. నేను పాడగలనే తప్ప నీలా మాట్లాడలేను’ అని కోకిల బాధపడింది.
‘నిజమే. నేను మాట్లాడగలను కానీ నీలాగా మధురంగా పాడలేను’ అని దిగులు పడింది చిలుక.
‘రేపటి నుంచి మనం ఒక పని చేద్దాం. తెల్లవారకముందే కనిపిస్తున్న ఆ ఎత్తైన కొండ మీదకు వెళ్దాం. నువ్వు పాడటం, నేను మాట్లాడటం అభ్యాసం చేద్దాం’ అంది కోకిల.
‘ఓ.. అలాగే’ ఉత్సాహంగా సమాధానమిచ్చింది చిలుక.
మరుసటి రోజు సూర్యోదయానికంటే ముందే ఆ రెండూ ఎగురుకుంటూ వెళ్లి కొండ శిఖరం మీద వాలి సాధన ప్రారంభించాయి. అలా ఓ రెండు రోజులు గడిచాయి. ఎంత కఠిన సాధన చేసినా చిలుక పాడలేకపోయింది.. కోకిల మాట్లాడలేకపోయింది. దాంతో ఆ రెండూ దిగులుగా అక్కడే ఉండిపోయాయి. నెల రోజులు గడిచిపోయాయి. తమను రోజూ మాటలతో, పాటలతో పలకరించే చిలుక, కోకిల కనిపించకపోయే సరికి ఇతర పక్షులు, జంతువులు కలవరపడసాగాయి.
‘మనతో పాటు ఉండే పక్షులు కనిపించకపోతే ఎలా ఉండగలం. నేను వెళ్లి వెతికి తీసుకు వస్తాను’ అని రివ్వున ఎగిరింది పావురం.
అడవంతా వెతుకుతూ వెతుకుతూ పావురం కొండ వైపు వచ్చింది. అక్కడ శిఖరం మీద దిగాలుగా కూర్చున్న చిలుక, కోకిల కనిపించగా.. విషయం అడిగింది. ఆ రెండూ జరిగింది చెప్పాయి.
‘ఓ.. ఇంతేనా.. దేవుడు మనకు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి. లేనిదాని కోసం బాధపడొద్దు. ఆ విషయానికి వస్తే నేను ఎంత ప్రయత్నించినా మీలాగా తియ్యగా మాట్లాడలేను.. మధురంగా పాడలేను. అందుకు బాధపడుతున్నానా? లేదు. మనుషులు నన్ను శాంతికి చిహ్నాన్ని చేశారు. నాకు ఆ సంతృప్తి చాలు. ఇక పదండి మనవాళ్లంతా మీకోసం ఎదురుచూస్తున్నారు’ అంది పావురం.
ఆ మాటలతో చిలుక, పావురం ఆలోచనలో పడ్డాయి.
‘అవును మిత్రమా! నువ్వు చెప్పింది నిజం. అందరికీ అన్నీ వస్తే లోకం మనుగుడ ఎలా సాగుతుంది. లేనివాటి గురించి బాధపడకుండా, మనకు దేవుడిచ్చిన వాటితో సంతృప్తి చెందాలని నీ మాటలతో మాకు కనువిప్పు కలిగింది’ అన్నాయి. వెంటనే హుషారుగా తమ నేస్తాల వైపు సాగిపోయాయి చిలుక, కోకిల. వాటితో పాటు ఎగురుతూ రెక్కలు కలిపింది పావురం.

- పి.వి.సుబ్బారాయుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని