కోతి గొలుసు కష్టాలు!

ఆహారం కోసం తిరుగుతూ ఓ కోతి ఒకరి ఇంటికి చేరింది. అది ఓ ధనవంతుడి ఇల్లు. కిటికీలోంచి లోపలికి దూరి ఇల్లంతా వెతికింది. దానికి ఓ చోట అందమైన బంగారు గొలుసు కనిపించింది. దానికి బాదం కాయంత ఎర్రటి కెంపు ఉంది. దాని ఆనందానికి అంతేలేదు.

Published : 21 Feb 2021 00:26 IST

ఆహారం కోసం తిరుగుతూ ఓ కోతి ఒకరి ఇంటికి చేరింది. అది ఓ ధనవంతుడి ఇల్లు. కిటికీలోంచి లోపలికి దూరి ఇల్లంతా వెతికింది. దానికి ఓ చోట అందమైన బంగారు గొలుసు కనిపించింది. దానికి బాదం కాయంత ఎర్రటి కెంపు ఉంది. దాని ఆనందానికి అంతేలేదు. దాన్ని మెడలో వేసుకుని దర్జాగా ఊళ్లోకి బయలుదేరింది. దానికి అర్థం కానిది ఏమిటంటే.. జనం దానిపై రాళ్లు రప్పలు విసురుతూ వెంటబడడం! తనేం తప్పు చేసింది. ఎవరింట్లోనే ఏదో తెచ్చుకుంటే వీళ్లందరికీ ఎందుకంట అంత కోపం. అనుకుంది.
అక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదమని జనానికి దొరక్కుండా అడవి వైపు పరుగెత్తింది. ఎలాగైతేనేం.. ఓ చెరువు దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకుంది. ఆ నీళ్లలో తను వేసుకున్న గొలుసు చాలా అందంగా కనిపించింది. ముఖ్యంగా ఆ కెంపు మెరుపులు దానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి.
అది అలా తన్మయత్వంలో ఉండగా రివ్వున ఒక బాణం దాన్ని రాసుకుంటూ వెళ్లి ఇసుకలో పడింది. ‘అయ్యబాబోయ్‌.. ఇంకొంచెం ఉంటే చచ్చేదాన్ని’ అని అరిచి వేగంగా పక్కనే ఉన్న చెట్టెక్కి, కొమ్మల్లో దాక్కుంది. ‘ఎవరా బాణం వేసింది?’ అని చూస్తే నలుగురు వేటగాళ్లు! చేతిలో విల్లంబులతో దానికోసం వెతుకుతూ కనబడ్డారు. ‘వీళ్లకు నేనేం అపకారం చేశాను? ఎక్కడో ఊళ్లో నుంచి తెచ్చుకున్న గొలుసు మీద వీళ్ల కన్ను పడిందా.. ఏంటి?’ అనుకుంది.
అది ఊహించినట్లే వేటగాళ్లు.. ‘ఆ కోతి మెడలో గొలుసు చాలా ఖరీదైందిరా.. అదిగానీ చిక్కిందా.. మన దరిద్రం పోయినట్లే’ అనుకుంటూ కోతి కోసం చెట్లు, పుట్టలు గాలించడం మొదలెట్టారు. ఇక అక్కడ ఉండడం క్షేమం కాదు అనుకుని వాళ్ల కళ్లు గప్పి అడవి లోపలకు చేరుకుంది కోతి. ఇప్పుడిక దానికి నిశ్చింత!
‘ఇక్కడ మనుషులు ఉండరు. అడవిలోని ప్రాణులకు ఈ గొలుసు విలువ తెలియదు. హాయిగా కాలం గడపవచ్చు’ అనుకుంది. మర్నాడు అది ఒక మడుగు దగ్గర స్నానం చేస్తుంటే పక్కనే ఉన్న పొదలోంచి అమాంతం ఒక నక్క దాని మీదకు దూకి గొలుసు నోట కరుచుకోబోయింది.
కోతి ఎలాగో దాన్నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న చెట్టు ఎక్కింది. చెట్టుమీది పక్షులు కూడా దానిమీద దాడి చేయబోయాయి. ‘ఈ పక్షులు, జంతువులకు కూడా మనుషుల్లా బంగారం పిచ్చి పట్టిందా ఏంటి?’ అనుకుని పరుగు తీసింది కోతి. మళ్లీ దానికి అశాంతి మొదలైంది. ఈ జంతువులు, పక్షుల తీరు అర్థం కావడం లేదు. ఇది వరకు ఇవి తనతో చాలా స్నేహంగా ఉండేవి. ఇప్పుడేమైంది? అనుకుంది.
ఆ తర్వాత రోజు.. దాని ప్రశ్నకు జవాబు దొరికింది. అది ఒక చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటుంటే కింద రెండు నక్కలు మాట్లాడుకుంటున్నాయి. కోతి మెడలో గొలుసుకున్న కెంపును మాంసం అనుకున్న ఓ నక్క.. ‘గొలుసుకు మాంసం ముక్క చిక్కుకుని ఉంది చూశావా? దాన్ని తిందామంటే ఆ పిచ్చికోతి దొరకడం లేదు’ అని మరో నక్కతో అంది.  
అడవి జంతువులు, పక్షులు తనను ఎందుకు తరుముతున్నాయో కోతికి అర్థమైంది. ఆ గొలుసు తన మెడలో ఉన్నంతకాలం తన ప్రాణాలకు ముప్పే అని అర్థమైంది. అందుకే ఆ రోజు రాత్రే దాన్ని ఓ చెరువులో పారేసి ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుంది.

- చంద్రప్రతాప్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని