నిజమైన స్నేహం

ఒక చిట్టడవిలో కాకి, చిలుక ఎంతో స్నేహంగా ఉండేవి. అది చూసి నక్క అసూయతో రగిలిపోయేది. ఎలాగైనా ఆ రెండింటి మధ్య గొడవలు పెట్టి.. వాటిని విడదీయాలని అనుకుంది. ఒకరోజు కాకి లేని సమయంలో చిలుక దగ్గరకు వెళ్లింది నక్క. ‘అందంగా ఉండే నీకు.. ఆ నల్ల కాకితో స్నేహం అవసరమా?

Published : 26 Feb 2021 01:42 IST

క చిట్టడవిలో కాకి, చిలుక ఎంతో స్నేహంగా ఉండేవి. అది చూసి నక్క అసూయతో రగిలిపోయేది. ఎలాగైనా ఆ రెండింటి మధ్య గొడవలు పెట్టి.. వాటిని విడదీయాలని అనుకుంది. ఒకరోజు కాకి లేని సమయంలో చిలుక దగ్గరకు వెళ్లింది నక్క. ‘అందంగా ఉండే నీకు.. ఆ నల్ల కాకితో స్నేహం అవసరమా? అది నువ్వు అనుకున్నంత మంచిదేమీ కాదు. నీ గురించి చాలా చెడుగా చెప్పింది నాకు’ అని నూరిపోసింది. ‘అవునా?’ అని చిలుక అడగ్గా.. ‘అవును. నీకు ఈ విషయం చెప్పొద్దనే అనుకున్నా కానీ నేనేదీ లోపల దాచుకోలేను కదా’ అంటూ వెళ్లిపోయింది. దాంతో ఇకనుంచి కాకితో స్నేహం చేయకూడదు, మాట్లాడొద్దని నిర్ణయించుకుంది చిలుక.

ఇంతలో రివ్వున ఎగురుకుంటూ చిలుక దగ్గరికి వచ్చింది కాకి. కానీ, అది మాత్రం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు కూడా చిలుక అలాగే చేసింది. కారణమేంటో తెలుసుకుందామన్నా.. చిలుక దగ్గరికి రానీయకపోవడంతో కాకి బాధపడింది.

తర్వాతి రోజు నక్కకు బాగా ఆకలి వేసింది. వేటకు ఏ జంతువూ దొరకలేదు. ఇంతలో చెట్టు మీద జామ పండు తింటున్న చిలుక కనిపించింది. ఎలాగైనా దాన్ని గుటుక్కుమనిపించాలని అనుకుంది. పొదల్లో నక్కి మెల్లిగా దాని దగ్గరకు అడుగులు వేయసాగింది. అంతలో అక్కడే వేపచెట్టు మీద ఉన్న కాకి గమనించింది. ప్రమాదం నుంచి తన మిత్రుడు చిలుకను కాపాడాలని అనుకొంది. మెరుపు వేగంతో నక్క మీదకు దూకి గోళ్లు, ముక్కుతో రక్కింది. ‘మిత్రమా! పారిపో.. పారిపో..’ అని చిలుకను అప్రమత్తం చేయడంతో.. ప్రాణభయంతో అది గాల్లోకి ఎగిరింది.

తన నోటి దగ్గరి ఆహారాన్ని దూరం చేసినందుకు కాకి వైపు గుర్రుగా చూస్తూ వెళ్లిపోయింది నక్క. చిలుక జరిగినదంతా తలచుకుంటూ.. ‘నేను నిన్ను దూరం పెట్టినా, నువ్వు మాత్రం నన్ను కాపాడావు’ అంటూ పశ్చాత్తాపంతో కాకి దగ్గరకు వచ్చింది. ‘నక్క చెప్పిన మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్నా. నన్ను క్షమించు’ అని కోరింది. 

‘అదా సంగతి.. ఒకరోజు నువ్వు లేని సమయంలో నాకు కూడా నీమీద చాడీలు చెప్పింది నక్క. నువ్వు మంచిదానికి కాదంది.. నేను నల్లగా ఉన్నానని, అందంగా ఉండనని ఇతర పక్షులకు చెబుతున్నావని కూడా చెప్పింది’ అంది కాకి. ‘అవును మిత్రమా..   ఆ జిత్తులమారి మాటలు విని నేను నిన్ను అవమానించా’ అని దిగులు పడింది చిలుక. కానీ, ‘నేను నక్క మాటలు పట్టించుకోలేదు. నా మిత్రుడు నా గురించి అలా ఎప్పటికీ చెప్పడు. మా స్నేహం చూసి నీకు నిద్రపట్టడం లేదని తెలుసు. ఇంకెప్పుడూ మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేయకు’ అని గట్టిగా చెప్పడంతో నీ దగ్గరకు వచ్చినట్లు ఉందంది కాకి.

చిలుక బాధ పడుతూ నీలాంటి మంచి మిత్రుడు దొరకడం నా అదృష్టం. చెప్పుడు మాటలు వినడం, నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని చెవికెక్కించుకోవడం ఎంత అనర్థానికి దారి తీస్తుందో ప్రత్యక్షంగా తెలిసివచ్చింది. ఇకనుంచి ఎవరు ఎన్ని చెప్పినా చివరి వరకూ మన స్నేహాన్ని విడదీయలేరు’ అని కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన కాకి.. చిలుక దగ్గరకు వచ్చి పక్కన కూర్చొని సంతోషంతో రెక్కలు రెపరెపలాడించింది.

- గెడ్డం సుశీలరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని