తప్పిపోయిన బుజ్జికోతి

అడవికి దగ్గర్లో ఉన్న గ్రామంలో ఒక కోతి ఉండేది. దానికి ఒక అందమైన బుజ్జికోతి పుట్టింది. రోజూ అమ్మ వెంట ఆహారం కోసం వెళ్లేది. ఒక రోజు బుజ్జి కోతి దారి తప్పి అడవిలోకి వెళ్లిపోయింది. కోతి తన పిల్లకోతిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లింది. అది గ్రామానికి పక్కనే ఉన్నా గతంలో ఎప్పుడూ వెళ్లలేదు.

Updated : 03 Mar 2021 01:39 IST

డవికి దగ్గర్లో ఉన్న గ్రామంలో ఒక కోతి ఉండేది. దానికి ఒక అందమైన బుజ్జికోతి పుట్టింది. రోజూ అమ్మ వెంట ఆహారం కోసం వెళ్లేది. ఒక రోజు బుజ్జి కోతి దారి తప్పి అడవిలోకి వెళ్లిపోయింది. కోతి తన పిల్లకోతిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లింది. అది గ్రామానికి పక్కనే ఉన్నా గతంలో ఎప్పుడూ వెళ్లలేదు. అక్కడ ఓ పులి ఎప్పుడూ ఆకలితో ఉండేది. అది చిన్న చిన్న జీవులను కూడా విడవకుండా వేటాడి చంపుతుందని విన్నది. అందుకే ఇన్నాళ్లు అటువైపు వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడిక తప్పలేదు.

దారిలో దానికి ఎలుగుబంటి కనిపించింది. ‘మిత్రమా! నేను పక్కగ్రామంలో ఉంటాను. నా బిడ్డ దారి తప్పి అడవిలోకి వచ్చింది. నువ్వుగానీ చూశావా’ అంది. ‘ఇంకెక్కడి నీ బిడ్డ. పులిరాజు తన వెంట తీసుకెళ్లాడు. ఎప్పుడో గుటుక్కుమనేసి ఉంటాడు’ అంది ఎలుగుబంటి. కోతి కంగారు పడింది. పరుగు పరుగున పులి ఉండే గుహవైపు వెళ్లింది. దారిలో దానికి నక్క కనిపించింది. ‘మిత్రమా! నా బిడ్డను చూశావా?’ అని అడిగింది. ‘ఇంకెక్కడి నీ బిడ్డ. పులిరాజు ఎప్పుడో చప్పరించి ఉంటాడు’ అంది నక్క. కోతి మరింతగా భయపడింది. దారిలో దానికి తోడేలు ఎదురైంది. ‘మిత్రమా! నా బుజ్జిది కనిపించిందా?’ అని అడిగింది. ‘ఇంకెక్కడి నీ బుజ్జిది! పులిరాజు ఎప్పుడో తినేసి ఉంటాడు. నువ్వూ అటు వెళ్లకు నిన్నూ తింటుంది. మా ఇంటికి రా.. చక్కటి ఆతిథ్యం ఇస్తాను. రేపు వెళ్లిపోదువు’ అంది తోడేలు.

కోతికి ఒంటి నిండా చెమటలు పట్టాయి. కాళ్లు, చేతులు వణకసాగాయి. ఎలాగైనా పులిని కలవాలనే అనుకుంది. ఎలాగో దాని గుహను సమీపించింది. బయట నిలబడి పిలవబోయింది. మూతికి అంటిన రక్తాన్ని నాకుతూ అప్పుడే బయటకు వస్తున్న పులిని చూసి కోతి నోరు తెరిచి అలాగే ఉండిపోయింది. ‘వచ్చావా! నీ కోసమే చూస్తున్నా’ అంది పులి. కోతి కన్నీరు కార్చసాగింది. ఏడ్వకు.. ఏడ్వకు.. ఇప్పుడేమైందని.. అంటూ కోతిని గుహలోకి తీసుకెళ్లింది. అరటిపండ్లు తింటూ పులికూనతో ఆడుకుంటున్న బుజ్జికోతి తలతిప్పి చూసింది. పరుగున వెళ్లి అమ్మను హత్తుకుంది. కోతికి నోటమాట రాలేదు. ఆనంద భాష్పాలు రాల్చింది. రెండు చేతులా పులిరాజు, రాణికి నమస్కరించింది.

‘దారి తప్పిన నీ బుజ్జి కోతి నా కంటబడటం మంచిదైంది. లేకుంటే ఈ అడవిలో నమ్మించి మోసగిస్తున్న ఎలుగుబంటికో, నక్కకో, తోడేలుకో ఆహారం అయ్యేది’ అంది. కోతికి, బుజ్జి కోతికి తన ఇంట మంచి ఆతిథ్యం ఇచ్చి ఉదయాన్నే దగ్గరుండి గ్రామానికి దగ్గర్లో వదిలి వెనుదిరిగింది పులి. కంటితో చూడందే ఏదీ నమ్మకూడదనుకుని తెలుసుకున్న కోతి పులికి నమస్కరించింది. బుజ్జి కోతితో గ్రామంలోకి పరుగు తీసింది.

- పైడిమర్రి రామకృష్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని