మృగరాజు ముందే చెప్పింది!

వంశధార నది ఒడ్డున ఒక పెద్ద అడవి ఉండేది. దానికి హిరణ్యకేసరి అనే సింహం రాజు. అది అడవిలోని జంతువులను ధర్మబద్ధంగా పాలించేది. మాంసాహార జంతువులు విచ్చలవిడిగా సాధుజీవులను చంపకుండా కట్టడి చేసింది.

Updated : 05 Mar 2021 00:48 IST

వంశధార నది ఒడ్డున ఒక పెద్ద అడవి ఉండేది. దానికి హిరణ్యకేసరి అనే సింహం రాజు. అది అడవిలోని జంతువులను ధర్మబద్ధంగా పాలించేది. మాంసాహార జంతువులు విచ్చలవిడిగా సాధుజీవులను చంపకుండా కట్టడి చేసింది. అందుకు తాను కూడా మినహాయింపు కాదని ప్రకటించింది. ఆకలి తీరడానికి మాత్రమే ఆహారం తినాలి కానీ.. అజీర్తి చేసే వరకు తినకూడదని శాసనం చేసింది. శాకాహార జంతువులు కూడా ఇష్టారాజ్యంగా మొక్కల్ని తినడానికి వీలు లేదంది. చిన్న చిన్న మొలకలకు అస్సలు నష్టం కలిగించకూడదని ఆజ్ఞాపించింది. అరణ్యానికి సరిపోయే జంతువులు, చెట్లు ఉన్నప్పుడే అందరికీ రక్షణ ఉంటుందని హిరణ్యకేసరి చెప్పింది. ఈ భావాలతో ఏకీభవించని చాలా జంతువులు పక్క అడవిబాట పట్టాయి. అక్కడ పులులు, సింహాల వంటివి కనిపించవని, ఇక్కడున్నటువంటి కఠిన ఆంక్షలూ లేవని.. అందుకే అక్కడకు పోతున్నామని చెప్పి మరీ వెళ్లాయి.
ఈ విషయాన్ని మంత్రి అయిన విశాలకర్ణి అనే ఏనుగు హిరణ్యకేసరితో చెప్పింది. అది మంత్రి మాటలు విని ఊరుకుంది. ఇప్పుడు వెళ్తున్న జంతువులు కొన్ని రోజుల్లోనే తిరిగి వస్తాయని జోస్యం చెప్పింది. ఏనుగు.. మృగరాజు మాటలకు విస్తుపోయింది. అడవిలో ఆంక్షలు ఎత్తివేయకపోతే చివరకు మన ఇద్దరమే మిగులుతామేమో అని సింహం దగ్గర వాపోయింది. మృగరాజు మాత్రం తన మాట నిజమై తీరుతుందని చెప్పింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి.
ఒక రోజు పక్క అడవికి వెళ్లిన జంతువులు కట్టకట్టుకుని తిరిగి రావడం ఏనుగు చూసింది. ఇక్కడ నచ్చక పక్క అడవికి వెళ్లిన మీరు తిరిగి ఎందుకొచ్చారని వాటిని అడిగింది. అప్పుడు ఆ జంతువులు.. ‘తెలివి తక్కువై వెళ్లాం. ఇప్పుడు బుద్ధొచ్చి తిరిగి వస్తున్నాం’ అని సమాధానమిచ్చాయి. ‘ఏం జరిగిందక్కడ?’ అని ఏనుగు ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది. ‘అక్కడ అడవి ఏమంత క్షేమంగా లేదు. పేరుకే అడవి. చెట్లు ఎక్కువగా లేవు. మనుషులు చొరబడి వాటిని నరుకుతున్నారు. జంతువులనూ వేటాడుతున్నారు. అక్కడ రక్షణ లేదు. కాబట్టే ఇక్కడకు వచ్చేశాం’ అని జంతువులు సమాధానమిచ్చాయి. ఏనుగు నవ్వుతూ.. మీరు తిరిగి వస్తారని అంతా అక్కడకు వెళ్లిన రోజే మన మృగరాజు చెప్పారంది.
అంతటితో ఆగక ‘ఇక్కడ అలా జరగలేదు! కారణం ఏమై ఉంటుంది?’ అమాయకత్వం నటిస్తూ అడిగింది ఏనుగు. అప్పుడు ఆ జంతువులు.. ‘అక్కడ క్రూర జంతువులు లేవు. అందుకే ఆ అడవి అనాథైంది. మనుషులు భయపడకుండా అడవిలోకి వచ్చి ఇష్టానుసారంగా జంతువులను వేటాడడానికి, చెట్లను నరకడానికి కారణమదే! క్రూరమృగాలుంటేనే అడవికి రక్షణ అని తెలుసుకున్నాం. మృగరాజును కలిసి మేం క్షమాపణ చెప్పుకోవాలి’ అని అన్నాయి.
ఆ జంతువుల మాటలు అడవి సంచారానికి బయలు దేరిన సింహం విననే వింది. ‘నియమ నిబంధనలు మీ మేలు కోరే ఏర్పాటు చేశాను. మనమంతా కలసి అడవిని కాపాడుకున్నప్పుడే అది మనకు నీడను ఇవ్వగలదు. అడవి నాశనమైతే మనం అల్లరిపాలు కాక తప్పదు.. స్వార్థపరులుగా ఉన్న నరుల దృష్టిలో మనం తేలికవుతాం. చివరకు బలి అవుతాం’ అంది. ఆ తరువాత మరెప్పుడూ జంతువులు వలసబాట పట్టే ఆలోచన చేయలేదు.

- బెలగాం భీమేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని