గోపాలుడి గొప్పతనం!

గోపాలుడికి తల్లిదండ్రులు లేకపోవడంతో రామయ్య అనే ఓ తాత చేరదీశాడు. ఆయన కొడుకు నగరంలో ఉండేవాడు. తాత పాల వ్యాపారం చేసేవాడు. గోపాలుడు ఇంటింటికీ వెళ్లి పాలు పోసి, వారిచ్చిన సొమ్ము తెచ్చి తాతకు ఇచ్చేవాడు.

Updated : 12 Mar 2021 00:46 IST

 

గోపాలుడికి తల్లిదండ్రులు లేకపోవడంతో రామయ్య అనే ఓ తాత చేరదీశాడు. ఆయన కొడుకు నగరంలో ఉండేవాడు. తాత పాల వ్యాపారం చేసేవాడు. గోపాలుడు ఇంటింటికీ వెళ్లి పాలు పోసి, వారిచ్చిన సొమ్ము తెచ్చి తాతకు ఇచ్చేవాడు.
కష్టపడి సంపాదించిన డబ్బుతోనే బతకాలని, ఉచితంగా వచ్చిన ధనాన్ని తీసుకోకూడదని గోపాలుడికి తాత ఎప్పుడూ చెబుతుండేవాడు.
ఒకసారి రామయ్యకు బాగా జబ్బు చేయడంతో ప్రాణాలు వదిలాడు. గోపాలుడు కన్నీరుమున్నీరయ్యాడు. తాత కొడుకు గ్రామంలోని ఇల్లు, గేదెలను అమ్మేశాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి నగరం వెళ్లిపోయాడు. చేసేదిలేక గోపాలుడు పనికోసం కాలినడకన నగరానికి బయలుదేరాడు. దారిలో ఓ ఇంటి ముందు జనం పోగై ‘పాము.. పాము’ అని కేకలు పెట్టసాగారు. అందరి చేతుల్లో కర్రలు ఉన్నాయి. గోపాలుడు వారిని తోసుకుంటూ వెళ్లి ‘పామును చంపకండి. దాన్ని నేను పట్టుకుంటాను’ అన్నాడు.
గోపాలుడు ఇంట్లోకి వెళ్లి రెండు చేతులూ జోడించి దండం పెట్టి ‘బయట ఉన్న వాళ్ల నుంచి కాపాడడానికి వచ్చాను. నేను నిన్ను ఏమీ చేయను’ అన్నాడు. ‘నిన్ను నమ్ముతున్నా’ అని పాము చెప్పడంతో దాన్ని పట్టుకుని ఓ సంచిలో వేసి బయటకు తీసుకొచ్చాడు. ‘నిజానికి పాము ఏమీ చేయదు. మనం దానికి ఏమైనా హాని చేస్తామేమోనని బుస కొడుతుంది’ అని వారికి వివరించాడు. అక్కడి నుంచి అడవి మార్గం మీదుగా వెళ్తుండగా, తనను ఎక్కడ వదిలి పెట్టాలో పాము చెప్పింది. ఒక చిన్న గుడి పక్కనున్న పొదల్లో పామును వదిలాడు. పాము కృతజ్ఞతలు చెప్పి.. అక్కడి పుట్టలోంచి తెచ్చి ఒక మణిని గోపాలుడికి ఇచ్చింది.
‘ఇది నేనేం చేసుకోను. మా తాత కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే పొట్ట నింపుకోవాలి’ అని చెప్పాడు. ‘నువ్వు నిజాయతీపరుడివి కాబట్టే ఈ మణిని నీకు ఇచ్చాను. ఈ అడవి దాటగానే సింహళ దేశం వస్తుంది. దానికి ప్రసేనుడు రాజు. అతని కూతురు అతిలోకసుందరి. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న తన నుదుటి మీద ఈ మణిని తాకిస్తే పూర్తిగా నయమవుతుంది’ అంది పాము.
గోపాలుడు ఆ మణిని తీసుకొని, పాముకు కృతజ్ఞతలు చెప్పి ముందుకు కదిలాడు. రాజును కలిసి యువరాణి మూర్ఛవ్యాధిని నయం చేస్తానని చెప్పాడు. ఆయన సరేనని యువరాణిని పిలిపించాడు. వెంటనే గోపాలుడు తనవద్ద ఉన్న మణిని ఆమె నుదిటికి తాకించగానే ఒక వెలుగు వచ్చింది. తర్వాత ఆ మణిని రాజుకే ఇచ్చేశాడు.
యువరాణి వ్యాధి పూర్తిగా నయమైందని రాజవైద్యులు నిర్ధారించారు. దాంతో సంతోషించిన రాజు ‘నా కుమార్తెను నీకిచ్చి వివాహం జరిపిస్తా. అర్ధరాజ్యాన్ని కూడా కానుకగా ఇస్తా’నని గోపాలుడితో అన్నాడు. ‘రాజా! నేను అనాథను. చదువు రాదు. ఇందులో నా ఘనత ఏమీ లేదు. గొప్పతనమంతా మణి, దాన్ని ఇచ్చిన పాముదే’ అన్నాడు.
ఇంతలో మంత్రి కల్పించుకొని ‘మహారాజు ఏదైనా ఆలోచించే చేస్తారు. నువ్వు యువరాణిని వివాహం చేసుకోవాల్సిందే. అర్ధరాజ్యం తీసుకోవాల్సిందే. నువ్వు చదువుతో పాటు ఇతర విద్యల్లో ప్రావీణ్యం సంపాదించేలా మేము సహాయం చేస్తాం.  రేపే గురుకులంలో చేర్పిస్తాం’ అన్నాడు. అందుకు గోపాలుడు సరేనని గురుకులంలో చేరాడు. ఏడాదిలోనే అన్ని విద్యల్లో ప్రతిభ చూపాడు. తర్వాత యువరాణిని వివాహం చేసుకున్నాడు. తనకిచ్చిన రాజ్యానికి పట్టాభిషిక్తుడై ప్రజలకు ఏ లోటూ రాకుండా చూసుకున్నాడు.

- యు.విజయశేఖరరెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని