అసలు దొంగెవరో తెలిసిందోచ్‌!

ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాన్ని నివాసంగా చేసుకుని కాకి, కోకిల, పిచ్చుక, చిలుక, వడ్రంగి పిట్ట, గోరువంక మొదలైన పక్షులు ఎంతో స్నేహంగా జీవనం సాగించేవి. పక్షి రాజైన గరుడ పక్షి వాటిని పాలించేది.దాదాపు అన్ని జీవుల్లాగే.....

Published : 15 Mar 2021 01:01 IST

క అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాన్ని నివాసంగా చేసుకుని కాకి, కోకిల, పిచ్చుక, చిలుక, వడ్రంగి పిట్ట, గోరువంక మొదలైన పక్షులు ఎంతో స్నేహంగా జీవనం సాగించేవి. పక్షి రాజైన గరుడ పక్షి వాటిని పాలించేది.
దాదాపు అన్ని జీవుల్లాగే పక్షులకు కూడా రాత్రివేళల్లో కళ్లు సరిగా కనబడవు. దాన్ని అలుసుగా చేసుకుని ఏదో ఆగంతక జీవి రాత్రుల్లో పక్షుల గూళ్లకు వెళ్లి అవి పెట్టిన గుడ్లను పగలగొట్టి తినేసేది. పగిలిపోయి ఉన్న గుడ్లను తెల్లవారాక చూసి పక్షులు లబోదిబోమని ఏడ్చేవి.
ఒక రోజు కాకి, మరో రోజు పిచ్చుక, ఇంకో రోజు రామచిలుక.. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక పక్షి పొద్దుణ్నే నిద్రలేచి, పగిలిపోయిన తన గుడ్లను చూసి బాధపడేది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పక్షి రాజైన గరుడపక్షి చెవినబడింది. అది తన మంత్రి గోరువంక, సేనాధిపతి వడ్రంగి పిట్టను వెంటనే సమావేశపరిచింది. రాత్రుల్లో పక్షుల గుడ్లు మాయమవుతున్న విషయాన్ని గోరువంకతో చర్చించింది. గోరువంక చాలా తెలివైంది. తన శక్తియుక్తులతో ఎన్నో కఠినమైన సమస్యలకు కూడా పరిష్కారాలను చూపేది. బాగా ఆలోచించిన తర్వాత అది గరుడ పక్షితో ఇలా అంది.
‘మహారాజా! పక్షుల గుడ్లు రాత్రుల్లోనే మాయమవుతున్నాయి. అన్ని జీవరాశుల్లానే పక్షులైన మనకు కూడా రాత్రి వేళల్లో కళ్లు కనిపించవు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని ఎవరో మన గూళ్లలోకి ప్రవేశించి గుడ్లను తినేస్తున్నారు. నాకు తెలిసినంత వరకూ కేవలం గుడ్లగూబకు మాత్రమే రాత్రుల్లో కళ్లు కనబడతాయి. మన చెట్టు తొర్రలో కొంతకాలంగా ఒక గుడ్లగూబ నివాసం ఉంటోంది. నాకు ఎందుకో దాని మీదే అనుమానంగా ఉంది’ అంటూ.. తన అభిప్రాయాన్ని గరుడపక్షికి చెప్పింది గోరువంక.
‘నువ్వు చెప్పింది నిజమే. చీకట్లో మనకు కళ్లు సరిగా కనిపించవు. వెలుగులో గుడ్లగూబకు కనబడవు. రేపే పౌర్ణమి. నిండు చంద్రుడి దయవల్ల మనకు రాత్రిపూట కూడా పరిసరాలు కొంతమేర కనబడతాయి.
కానీ, గుడ్లగూబకు కళ్లు మసకగా మాత్రమే కనిపిస్తాయి. అలసత్వం వహించకుండా రాత్రంతా మేల్కొనే ఉండి.. సేనాధిపతి వండ్రంగి పిట్టతో కలిసి ఆ గుడ్లగూబను జాగ్రత్తగా గమనించండి. మన అనుమానం నిజమై, మన పక్షుల గుడ్లను తింటున్నది ఆ గుడ్లగూబే అని రుజువైతే దాన్ని వెంటనే బంధించి నా దగ్గరకు తీసుకొని రండి’ అంటూ గోరువంకను ఆజ్ఞాపించింది గరుడపక్షి.
ఎప్పటిలానే పౌర్ణమి రాత్రి కూడా చెట్టుతొర్రలో నుంచి బయటకు వచ్చింది గుడ్లగూబ. అలవాటు ప్రకారం కాకి గూడుకు వెళ్లి దాని గుడ్లను తినడానికి ప్రయత్నించింది. ఇదంతా నిశితంగా పరిశీలిస్తున్న వడ్రంగి పిట్ట, గోరువంక సలహాతో గుడ్లగూబపై దాడి చేసింది. గాయపడ్డ దాన్ని గరుడపక్షి ముందు నిలబెట్టాయి గోరువంక, వడ్రంగిపిట్ట. గుడ్లగూబ తన తప్పును ఒప్పుకొంది. పక్షి రాజు   గుడ్లగూబను మర్రిచెట్టు నుంచి వెలివేస్తున్నట్లు తీర్పు ప్రకటించాడు. విషయం తెలుసుకొన్న పక్షులన్నీ ఎంతో సంతోషపడ్డాయి. తమ రాజైన గరుడపక్షికి కృతజ్ఞతలు చెప్పాయి.
కొంతకాలం గడిచింది. పక్షులన్నీ గుడ్లుపెట్టి పిల్లల్ని చేశాయి. అన్ని రకాల పక్షి పిల్లల అరుపులు, ఆటలకు మర్రిచెట్టు వేదికైంది. ఆడుకుంటున్న తమ పిల్లల్ని చూసి పక్షులన్నీ ఎంతగానో సంతోషపడ్డాయి.

- పేట యుగంధర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని