కిట్టు కిరాణా దుకాణం

రామాపురంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ధర్మయ్య ఎంతో మంచివాడు. అతడు నాణ్యమైన సరకులనే అమ్ముతాడు. తూకంలో మోసం చేసే గుణం రవ్వంత కూడా లేదు. అందుకే అతడి దుకాణం ఎప్పుడూ కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అదే ఊర్లోని మరో కిరాణా దుకాణం యజమాని సోమయ్య ఎంతో దురాశపరుడు. లాభాపేక్షతో తూకంలో మోసం చేస్తాడు. కల్తీ సరుకులూ అమ్ముతాడు...

Published : 16 Mar 2021 00:38 IST

రామాపురంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ధర్మయ్య ఎంతో మంచివాడు. అతడు నాణ్యమైన సరకులనే అమ్ముతాడు. తూకంలో మోసం చేసే గుణం రవ్వంత కూడా లేదు. అందుకే అతడి దుకాణం ఎప్పుడూ కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ ఉంటుంది.
అదే ఊర్లోని మరో కిరాణా దుకాణం యజమాని సోమయ్య ఎంతో దురాశపరుడు. లాభాపేక్షతో తూకంలో మోసం చేస్తాడు. కల్తీ సరుకులూ అమ్ముతాడు. అందుకే అతడి దుకాణం జనాలు లేక వెలవెలబోతూ ఉంటుంది.
ధర్మయ్య వ్యాపారాన్ని ఎలాగైనా దెబ్బకొట్టాలనుకున్నాడు సోమయ్య. ఊర్లో తనకు బాగా పరిచయమున్నవారిని కలిసి ఏదో రహస్యంగా చెప్పాడు. వాళ్లు ఒక్కొక్కరుగా ధర్మయ్య దుకాణానికి వెళ్లారు. అతడి మంచితనాన్ని అతిగా పొగిడి.. తమకు కావాల్సిన సరకులను అరువుపై తీసుకెళ్లారు. ధర్మయ్య అరువుపై సరకులు ఇస్తున్నాడన్న విషయం తెలిసి, అతడికి తెలిసిన వాళ్లు తాము కూడా అరువుపై సరకులు తీసుకోసాగారు. అలా అరువు బేరాలు చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోసాగింది.
ధర్మయ్య అతి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని, అరువు ఖాతాలు పెట్టినవాళ్లు బాకీ చెల్లించకుండా తప్పించుకోసాగారు. కొంతకాలానికి ధర్మయ్య వ్యాపారం దెబ్బతింది. పట్నంలో చదువు పూర్తి చేసుకున్న ధర్మయ్య కుమారుడు కిట్టు, ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన విషయాలు తెలుసుకుని ‘నాన్నగారూ.. బాధ పడకండి. వ్యాపారం నేను చూసుకుంటా. నా మీద నమ్మకం ఉంచి మీరు విశ్రాంతి తీసుకోండి’ అని చెప్పాడు కిట్టు.
ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే అతడికి ఓ ఉపాయం తట్టింది. ఆ మర్నాడు ఊర్లో తిరుగుతూ బంధుమిత్రులను ఆప్యాయంగా పలకరించాడు. ఇలా కొన్ని రోజులు ఇదే పనిలో ఉన్నాడు.
తర్వాత మంచి రోజు చూసుకుని తమ దుకాణానికి ‘కిట్టు కిరాణా దుకాణం’ అని పేరు మార్చి.. కొత్తగా వ్యాపారం ప్రారంభించాడు. కొనుగోలు దారులు ఆ దుకాణానికి రాసాగారు. అంతలో కిట్టుకు పరిచయమున్న కోనప్ప అనే వ్యక్తి వచ్చాడు. అతడు గతంలో ధర్మయ్య దగ్గర అరువుకు చాలా సరకులు తీసుకుని..
ఆపై ముఖం చూపించనేలేదు. మళ్లీ ఇప్పుడే రావడం.
అతడు చిరునవ్వుతో.. ‘బాబూ.. కిట్టూ! నాకు రెండు కేజీల చొప్పున బాదంపప్పు, జీడిపప్పు, కందిపప్పు కావాలి. పైకం రేపు ఇస్తాలే’ అన్నాడు. ‘మీరెవరండి.. ఇంతకీ..! తెలియని వాళ్లకు అరువు ఎలా ఇవ్వాలి!’ ఆశ్చర్యంగా అడిగాడు కిట్టు. ‘అరె కిట్టూ.. నన్నే మరిచిపోయావా? నిన్ననే కదా.. మా ఇంటి వైపు నుంచి వెళుతూ.. బాబాయ్‌ బాగున్నావా.. అని ప్రేమగా పలకరించావు’ అన్నాడు.
‘ఏమోనండి. నాకు గుర్తురావడం లేదు’ చెప్పాడు కిట్టు. కోనప్ప చిరాగ్గా.. ‘ఇంతకీ నాకు సరకులు ఇస్తావా? లేదా?’ అన్నాడు. అక్కడున్న వాళ్లు ఇద్దరి వంకా విస్మయంగా చూడసాగారు. కిట్టు లేచి నిలబడి ‘అందరికీ నమస్కారం. దుకాణంలో ఉన్నప్పుడు ఎందుకో మరి నేను ఎవ్వరినీ గుర్తు పట్టలేను.
నాకందరూ అపరిచితుల్లానే కనిపిస్తారు. అందుకే ఎవరికీ అరువు ఇవ్వలేను. ఇక.. నా దుకాణం గురించి రెండు విషయాలు. ఇక్కడ తూకంలో మోసం ఉండదు. నాణ్యతలో లోపం ఉండదు. సరకులు కావాల్సిన వాళ్లు దయచేసి సొమ్ము చెల్లించి తీసుకువెళ్లండి’ అని వినయంగా చెప్పాడు.
అంతే.. అక్కడున్న వాళ్లు అరువు మాట ఎత్తక, తమకు కావాల్సినవి కొనుక్కొని వెళ్లిపోయారు. ఆ రోజు నుంచీ కిట్టు దుకాణం కొనుగోలుదారులతో కళకళలాడసాగింది. గతంలో సోమయ్య మాటలు విని బాకీలు ఎగ్గొట్టినవారిలోనూ మార్పు వచ్చింది. వాళ్లు సోమయ్యను తిట్టుకుని.. కిట్టూకు తమ బాకీ చెల్లించేశారు.
కొంతకాలానికి కిట్టూకు వ్యాపారంలో లాభాలతోపాటు ఊర్లో గొప్పపేరూ వచ్చింది. తన పుత్రరత్నం విజయానికి పొంగిపోయిన ధర్మయ్య.. ‘నీ విజయ రహస్యం ఏమిట్రా?’ అని అడిగాడు. ‘ఏం లేదు నాన్నగారూ! అందరితో అన్నదమ్ముల్లా కలిసుంటూ.. వ్యాపారంలో మాత్రం అపరిచితుల్లా వ్యవహరించాలి.. అనే సూక్తిని పాటించా’ అంటూ నవ్వేశాడు కిట్టు.

- పుట్టగుంట సురేష్‌ కుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని