నక్క తెచ్చిన ముప్పు!

అడవిలో ఒకసారి సింహం అధ్యక్షతన జంతువుల సమావేశం జరిగింది. మృగరాజు మాట్లాడుతూ అడవిలో ఉన్న జంతువులు శుభ్రత పాటించాలని, పర్యావరణాన్ని కాపాడాలని అంది. అప్పుడు జంతువులన్నీ

Published : 18 Mar 2021 00:20 IST

అడవిలో ఒకసారి సింహం అధ్యక్షతన జంతువుల సమావేశం జరిగింది. మృగరాజు మాట్లాడుతూ అడవిలో ఉన్న జంతువులు శుభ్రత పాటించాలని, పర్యావరణాన్ని కాపాడాలని అంది. అప్పుడు జంతువులన్నీ సింహం మాటలకు తలూపాయి. అక్కడే ఉన్న కోతి నక్కను చూపిస్తూ.. ‘దీనికి మాత్రం శుభ్రత గురించి ప్రత్యేకంగా చెప్పండి మహారాజా! ఇది శుభ్రంగా ఉండదు. తన ఇంట్లో స్వచ్ఛత పాటించదు. అసలే ఇది అంటువ్యాధుల కాలం. ఏదైనా జరిగితే అందరికీ ఇబ్బందే’ అని అంది. ఆ మాటలు విన్న నక్క కోతివైపు గుర్రుగా చూసింది.
కొన్ని రోజుల తర్వాత నక్క తన ఇంట్లో విందు ఏర్పాటు చేసింది. దానికి అన్ని జంతువులను ఆహ్వానించింది. కానీ ఒక్క కోతిని మాత్రం పిలవలేదు. ఆనాడు తనను అన్ని జంతువుల ముందు శుభ్రత లేదని కోతి అవమానించినందుకు ప్రతీకారంగా నక్క దాన్ని రమ్మనలేదు. ఎలుగుబంటిని కూడా పిలిచింది కానీ అది తనకు వేరే పని ఉందని రాలేదు.
జంతువులన్నీ నక్క విందును తనివితీరా ఆస్వాదించాయి. కానీ కొద్దిసేపటికే అవన్నీ అస్వస్థతకు గురయ్యాయి. సింహంతోపాటు అన్ని జంతువులూ కంగారు పడ్డాయి. ‘ఈ విందుకు ఎందుకు వచ్చామా?’ అని మనసులోనే అనుకున్నాయి. కానీ పైకి మాత్రం ఏమీ అనలేకపోయాయి. వైద్యం కోసం ఎలుగుబంటి వద్దకు అవి అన్నీ పరుగెత్తుకుంటూ వెళ్లాయి. ఎలుగుబంటి వాటిని ధైర్యంగా ఉండమని కొద్దిసేపు కూర్చోబెట్టింది. ఆ తర్వాత వాటన్నింటికీ చికిత్స చేసింది. అవి అన్నీ త్వరగా కోలుకున్నాయి. జంతువులు అక్కడే ఉన్న కోతి, ఎలుగుబంటిని ఆ విందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించాయి.
అప్పుడు ఎలుగుబంటి తాను ముందే నక్కకు రానని చెప్పానంది.  కుందేలు, లేడి ‘నువ్వెందుకు విందుకు రాలేదు?’ అని కోతిని ప్రశ్నించాయి. కోతి నవ్వి.. నాకు ఇంట్లో కాస్త పని ఉండడం వల్ల రాలేకపోయాను అని చెప్పింది. అప్పుడు ఎలుగుబంటి ‘అదేం లేదు. ఈ కోతిని అసలు నక్క పిలవనే లేదు. నాకు ఇప్పుడే ఒక ఒంటె ఈ సంగతి చెప్పింది. నిజానికి కోతి విందుకు రాకపోవడమే మంచిదైంది. ఎందుకంటే మీకు ఇంకా ప్రమాదం జరిగి ఉండేది. మీలో కొందరి ప్రాణాలూ పోయి ఉండేవేమో’ అని అంది ఎలుగుబంటి.
అప్పుడు లేడి ‘ఏమో! కోతి వస్తే మాకు తృప్తిగా ఉండేది. నక్క శుభ్రత మనకు ఎందుకు? అయినా కోతి రాకపోవడం మా అందరికీ ఎలా లాభం అయింది. కోతి రాకపోవడానికి దీనికి సంబంధం ఏమిటి?’ అని ప్రశ్నించింది. అప్పుడు ఎలుగుబంటి ‘సమయాన్ని బట్టి ఆ సంగతి చెబుతాను’ అంది.
ఓ రెండు రోజుల తర్వాత సింహం ఒక సమావేశం ఏర్పాటు చేసింది. తమను కాపాడినందుకు ఎలుగుబంటిని సన్మానిద్దామని అన్ని జంతువులనూ రమ్మంది. జంతువులన్నీ వచ్చాయి. సింహం ఎలుగుబంటితో ‘నువ్వు లేకుంటే మా అందరి ప్రాణాలు పోయేవి. నువ్వు మా ప్రాణాలు రక్షించావు. నిన్ను సన్మానించడం మా విధి’ అని అంది.
అప్పుడు ఎలుగుబంటి ‘మహారాజా.. ఈ సన్మానం నాకు కాకుండా మీరు కోతికి చేయండి’ అంది. ‘అదేంటి? కష్టపడింది నువ్వు. కోతికి సన్మానం ఏంటి?’ అని అంది నక్క. ‘అవును నక్కమామా! నువ్వు శుభ్రత లేని ఆహారం వీరికి పెట్టి, అందరినీ అస్వస్థతకు గురి చేశావు. ఈ కోతి మాత్రం నువ్వు పిలవలేదని ఎవరికీ చెప్పకుండా, నీ మీద కోపం ప్రదర్శించకుండా నా సూచనతో పసరు ఆకులు తెచ్చి మీ అందర్నీ కాపాడింది. అదే అడవి లోపలికి వెళ్లి ఈ మందులు తేకుంటే మీలో చాలా మంది బతికేవారు కాదు. అందుకే మీరు కోతికి సన్మానం చేయాలి’ అని అంది.
అది విన్న సింహం సంతోషించింది. అన్ని జంతువులూ ‘కోతికి జై.. కోతికి జై..’ అని అరిచాయి. సింహం అప్పుడు ఎలుగుబంటితోపాటు కోతికి కూడా సన్మానం చేసింది. నక్క కోతికి క్షమాపణలు చెప్పింది. ఇకపై పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటిస్తానని చెప్పింది.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని