సత్యమయ్య చెప్పిన సత్యం!

కోటిపల్లి జమీందారు నీలకంఠేశ్వర ప్రసాదుకు ఒకేసారి రాజారవి వర్మ అంతటి చిత్రకారుణ్ని కావాలని కోరిక కలిగింది. ‘నేను మరణించినా.. నా బొమ్మలు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతాయి. అందుకే చిత్ర కళ అభ్యాసం చేస్తున్నా’ అని భార్య రాజేశ్వరితో చెప్పాడు.

Published : 19 Mar 2021 01:11 IST

కోటిపల్లి జమీందారు నీలకంఠేశ్వర ప్రసాదుకు ఒకేసారి రాజారవి వర్మ అంతటి చిత్రకారుణ్ని కావాలని కోరిక కలిగింది. ‘నేను మరణించినా.. నా బొమ్మలు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతాయి. అందుకే చిత్ర కళ అభ్యాసం చేస్తున్నా’ అని భార్య రాజేశ్వరితో చెప్పాడు. ‘మంచిదే కదా.. మీకు పేరొస్తే నాకూ వచ్చినట్లే. కానీ మీరు ఏ గురువు వద్ద నేర్చుకోవాలనుకుంటున్నారు?’ అని అడిగింది. ‘గురువెందుకు? నేను స్వయంగా నేర్చుకోగలను. అలా నేర్చుకున్నవాడే గొప్పవాడు కూడా. ఏకలవ్యుడు గురువు లేకుండానే విలువిద్య నేర్చుకోలేదా?’ అని ప్రశ్నించాడు.
‘అతనికి అవకాశం లేక అలా నేర్చుకున్నాడు. మీరు కోరితే.. చిత్రకారులు వరుసలో నిలబడతారు. మనకు డబ్బుకు కొదువ లేదు కదా. ముందుగా ఎవరో ఒక గురువు వద్ద నేర్చుకుంటే.. ఆ తర్వాత మీరు స్వంతంగా అభ్యాసం చేయొచ్చు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మరోసారి ఆలోచించండి’ అంది భర్తతో సౌమ్యంగా. ‘ఒకడు చెబితే నేర్చుకోవాల్సిన అగత్యం నాకు పట్టలేదు. నేను సొంతంగా నేర్చుకుని చూపిస్తా చూడు’ అన్నాడు అహంభావంతో. ‘సరే మీ ఇష్టం’ అని ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. జమీందారు ఆలస్యం చేయకుండా పనివాళ్లతో మూడో అంతస్తు పైన ప్రత్యేకంగా ఒక విశాలమైన గది కట్టించుకున్నాడు. తూర్పు వైపు కృష్ణానది, వెనకవైపు నదిలో కలిసే వాగు, ఉత్తరం వైపు గ్రామం. దక్షిణం వైపు దూరంగా అనంతగిరి పట్టణం. నాలుగు దిక్కులా దృశ్యాలు చక్కగా ఉన్నాయనుకున్నాడు. తాను ఆకాశంలోకి చూస్తూ కూడా బొమ్మలు వేసుకునేందుకు అనుగుణంగా ఉందని సంబరపడ్డాడు.
ఓ రోజు కారులో పట్టణానికి వెళ్లి చిత్రకళకు అవసరమైన రంగులు, కుంచెలు, ఇతర సరంజామా కొని తెచ్చుకున్నాడు. ఒక శుభ ముహూర్తాన కొబ్బరికాయ కొట్టి కుంచె పట్టుకున్నాడు. నెలరోజులు కష్టపడి మూడు బొమ్మలు వేశాడు. తాను సరిగా వేశానో లేదో పరీక్షించుకుందామనుకున్నాడు. ఎవరిని పిలిచి అభిప్రాయం అడిగినా, మొహమాటానికి అబద్ధం చెబుతారని ఆలోచించాడు. అమాయకులు నిజాలే చెబుతారని పశువులు కాసే సత్యమయ్యను భవనం పైకి పిలిచాడు. పక్కన భార్య నిలబడి చూడసాగింది.
మొదటి బొమ్మను చూపిస్తూ. ‘ఇదేం బొమ్మ?’ అని అడిగాడు. ‘నక్క’ అన్నాడు సత్యమయ్య. రెండో బొమ్మను చూపిస్తూ.. ‘ఇదేమిటి?’ అని అడిగాడు. ‘ముంగిస’ అన్నాడు. దీర్ఘంగా నిట్టూర్చి.. ‘ఈ మూడో బొమ్మ ఏంటి?’ అని అడిగాడు జమీందారు. ‘కోడి’ అని సత్యమయ్య సమాధానం ఇచ్చాడు. ‘ఛీ.. ఒక్కటన్నా సరిగా చెప్పలేదు కదరా. పరువు తీశావు. కుక్క అని వేసినదాన్ని నక్క అన్నావు. ఉడతను వేస్తే ముంగిస అన్నావు. నెమలిని గీస్తే కోడి అన్నావు...’ అని జమీందారు తల పట్టుకున్నాడు. ‘సత్యమయ్య సరిగానే చెప్పాడండి. కుక్కతోక అలా కిందకు వాలి ఉండదు. కళ్లలో బెదురుండదు. నక్క మాత్రమే అలా ఉంటుంది. ఇక ఉడత అంటారా.. దాని మూతి అలా ఉండదు. నెమలి బొమ్మలో అసలు నెమలికుండాల్సిన లక్షణాలే లేవు’ అని వివరించింది. తాను వేసిన బొమ్మల్లోని లోపం తెలుసుకున్నాడు జమీందారు. సత్యమయ్యను కిందకు వెళ్లిపొమ్మన్నాడు. ‘తనకు గురువు కావాల్సిందే’ అనే నిర్ణయానికి వచ్చాడు. మరుసటి రోజే ‘జమీందారుకు చిత్రకళ నేర్పేందుకు మంచి గురువు కావలెను’ అని పత్రికలో ఓ ప్రకటన వేయించుకున్నాడు.

- పుప్పాల కృష్ణమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని