చిలుక ఉపాయం.. ఉడత స్నేహం!

అదో అందమైన అడవి. అక్కడ జామ చెట్లు ఒకే చోట ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఒక చిలుక వచ్చి వాలింది. మంచి పండును చూసి కొరికింది. తియ్యగా భలే పసందుగా ఉంది. అంతలో ఒక ఉడత జామపండును నోటితో తెంపి

Updated : 20 Mar 2021 05:23 IST

దో అందమైన అడవి. అక్కడ జామ చెట్లు ఒకే చోట ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఒక చిలుక వచ్చి వాలింది. మంచి పండును చూసి కొరికింది. తియ్యగా భలే పసందుగా ఉంది. అంతలో ఒక ఉడత జామపండును నోటితో తెంపి గబగబా కిందకు తీసుకువెళ్లడం చిలుక కంట పడింది.
చిలుకమ్మ ఆ పండు తినేలోపు మళ్లీ ఉడత చెట్టు ఎక్కేసి మరో పండును తెంపి.. మళ్లీ కిందకు దిగిపోయింది. ఇలా మూడు నాలుగుసార్లు ఉడత అదే పనిచేయడంతో చిలుకమ్మకు ఆశ్చర్యంతోపాటు కోపం కూడా వచ్చింది. ‘ఉడతమ్మా! నువ్వు చేసే పని బాగోలేదు. చెట్టు మీద పండుంటే తినడానికి ఎవరికైనా ఉపయోగపడుతుంది’ అని గట్టిగా అంది. ‘నీలాంటి వాళ్లు ఎప్పటికీ చెట్లపై వాలి ఇలా తినేస్తుంటే మాకేం మిగులుతుంది. అందువల్లే కొన్నింటిని రేపటి కోసం దాచుకుంటున్నాను’ అని గడుసుగా సమాధానమిచ్చింది ఉడత. చిలుకమ్మ వెంటనే నవ్వింది. ‘నీ మతిమరుపు సంగతి నాకు తెలుసు. దాచినవి నేలపాలేకానీ నీ తిండికి పనికిరావుగా’ అని దానికి నిజం గుర్తు చేసింది.
ఉడతకు కోపం వచ్చింది. ‘నాకు ఆ విషయం తెలుసు.. దాచి ఉంచినవి గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.. ఇక నీ వెటకారపు మాటలు ఆపు’ అని చిర్రుబుర్రులాడింది. ‘ఒక మిత్రుణ్ని సంపాదించుకుంటే చాలు నీ మతిమరుపు హుష్‌ కాకి అయిపోతుంది’ అని ఉపాయం చెప్పి చిలుకమ్మ ఎగిరిపోయింది.
ఓ రెండు రోజుల తర్వాత చిలుకమ్మ అదే చెట్టుపై మళ్లీ వాలింది. హుషారుగా కలియ తిరుగుతున్న ఉడతమ్మను చూసి ఆశ్చర్యపోయింది. ‘నీ ఆనందం చూస్తుంటే మంచి స్నేహితుణ్ని సంపాదించినట్లున్నావు. ఎవరా మిత్రుడు?’ అని అడిగింది చిలుక. అది చెట్టుపై తచ్చాడుతున్న తొండను చూపించింది. ఈ సారి చిలుకమ్మ పగలబడి మరీ నవ్వింది. ‘నిజానికి, అబద్ధానికి రెండింటికీ సమానంగా తలూపడం తొండకు అలవాటు. అది నీకు సాయం చేస్తుందా..?’ అంటూ సాగదీసింది.
‘మొదట్నుంచి ఈ చెట్టుపై తిరుగుతున్న జీవులం మేము. నువ్వు నా స్నేహితుణ్ని కించపరచకు. నేను జామపండు దాచినప్పుడు చూడమని చెప్పాను. అందుకు తలను కిందకు, పైకి ఆడిస్తూ ఒప్పుకొంది. స్నేహితుని భరోసా నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. అదే నా హుషారుకు కారణం’ అని ఉడత సమాధానమిచ్చింది.
నీ ఎంపిక.. దొందూ దొందులానే ఉంది. తొండ అయితే ముచ్చట్లు వినడానికి మాత్రమే పనికి వస్తుంది. నీ మతిమరుపు పోగొట్టడానికి సాయం చేయలేదేమో అనిపిస్తోంది. కావాలంటే నువ్వు దాచినవి చూపించమని    ఓసారి తొండను అడిగి చూడమని సలహా ఇచ్చింది చిలుకమ్మ. ఉడతకు అవమానమనిపించింది. చిలుకమ్మ వంకర మాటలకు తిక్క కుదిరేలా రుజువు చూపించు అంది. అది ఎప్పటిలాగే తల కిందకు, పైకి ఆడించింది. ‘మాట తప్పలేదు చూశావా చిలుకమ్మా!’ అంటూ గర్వంగా చిలుక వైపు చూసింది ఉడత. ఆ తరువాత.. ‘కిందకు పోదాం పద’ అంటూ తొండ దగ్గరకు వెళ్లింది.
ఉడత ముందుకు రావడంతో తొండ భయంతో చెట్టు దిగి కిందున్న రాళ్ల సందులోకి వెళ్లిపోయింది. ఉడత ఎంత పిలిచినా బయటకు రాలేదు. ‘నిన్ను నమ్ముకున్నందుకు నిండా ముంచావు. చిలుకమ్మ ముందు నా మాటలకు విలువ లేకుండా పోయింది’ అంటూ ఉసూరుమంటూ కూర్చుండిపోయింది ఉడత.
‘మన భావాలు అర్థం చేసుకొని చేదోడువాదోడుగా ఉన్న స్నేహితుణ్ని ఎంపిక చేసుకోవడంలో నువ్వు విఫలమయ్యావు. తొండ స్నేహం నీకు కలిసిరాలేదు. నీ మతిమరుపు మాలాంటి పక్షులకు ఒక వరం. నీ మతిమరుపే లేకపోతే భూమి మీద ఇంత వృక్ష సంపద పోగయ్యేది కాదు. నా స్వార్థం కొద్దీ పండ్లు తెంపొద్దని అన్నాను కానీ, నీ మతిమరుపు వెనక దాగి ఉన్న పర్యావరణ పరిరక్షణను గుర్తించలేపోయాను. నీ సేవలు అమూల్యమైనవి. బాధపడవద్దు’ అని ఉడతను ఓదారుస్తూ ఎగిరిపోయింది చిలుకమ్మ. తన మతిమరుపు వెనక దాగిఉన్న నిస్వార్థ సేవను గుర్తించిన చిలుకమ్మ వైపు కృతజ్ఞతాభావంతో చూసింది ఉడత.

- బి.వి. పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని