జున్ను బాబు అలక!

జున్ను బాబు అలిగాడు. అన్నం తినలేదు. పెరట్లోని జామచెట్టు కిందకు వచ్చాడు. వాడి అలకకు కారణముండదు. ఊరికే అలుగుతాడు. అదో సరదా వాడికి. వాడు అలిగినప్పుడు వాళ్లమ్మ పదిసార్లు బతిమిలాడాలి. తినరా బాబు.. తినరా బాబూ అని వెంటపడాలి. నువ్వు తినకపోతే నేనూ తిననని అనాలి. అప్పటికి గాని జున్నుబాబు అలక తీరదు....

Published : 24 Mar 2021 00:16 IST

జున్ను బాబు అలిగాడు. అన్నం తినలేదు. పెరట్లోని జామచెట్టు కిందకు వచ్చాడు. వాడి అలకకు కారణముండదు. ఊరికే అలుగుతాడు. అదో సరదా వాడికి. వాడు అలిగినప్పుడు వాళ్లమ్మ పదిసార్లు బతిమిలాడాలి. తినరా బాబు.. తినరా బాబూ అని వెంటపడాలి. నువ్వు తినకపోతే నేనూ తిననని అనాలి. అప్పటికి గాని జున్నుబాబు అలక తీరదు.
ఆ రోజు జున్నుబాబు వాళ్ల అమ్మ ఏం పనిలో పడిందో.. అలిగిన పిల్లాడి గురించి మరిచిపోయింది. అన్నం పట్టుకుని అతడి వెనక తిరగలేదు. అలిగి కూర్చున్న జున్నుబాబుకు ఒక పిల్లి కనిపించింది. పిల్లీ పిల్లీ అని పిలిచాడు. అది ఆగి జున్ను బాబును చూసింది. పిల్లాడు అప్పుడు ‘నేను అలిగాను. అమ్మ అన్నం పెట్టినా తినలేదు. నాకు ఊసుపోలేదు. ఏదైనా చెప్పు వింటాను’ అని పిల్లితో అన్నాడు.
పిల్లి విచిత్రంగా చూసింది. ‘అమ్మ ఉంది. అన్నం ఉంది. అలకెందుకు? నీతో కబుర్లాడుతూ ఉండిపోలేను. మేము మా తిండి కోసం నానా తంటాలు పడాలి. అంత చేసినా దొరుకుతుందో లేదో తెలియదు’ అని పిల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అది వెళ్లిపోయాక జున్నుబాబుకు ఒక బుల్లి పిచ్చుక కనిపించింది. బుల్లి పిచ్చుకా.. అని పిలిచాడు దాన్ని. అక్కడ నేలపైన ఏదో వెతుకుతున్న పిచ్చుక తలపైకెత్తి చూసింది. జున్నుబాబు పిల్లిని అడిగినట్లే పిచ్చుకను అడిగాడు. అది జున్నుబాబును ఎగాదిగా చూసింది.
‘అమ్మ అన్నం పెడతానంటే అలిగావా? మాకు ఆహారం కనిపిస్తే అపురూపం. మా తిండి మేమే వెతుక్కోవాలి. నీతో కబుర్లాడుతూ కూర్చుంటే ఎలా?’ అని ఎగిరిపోయింది.
అంతలో ఒక కుక్కపిల్ల అక్కడికొచ్చింది. జున్నుబాబు పిల్లి, పిచ్చుకను పిలిచినట్లే దాన్నీ పిలిచాడు. జున్నుబాబు వైపు కుక్కపిల్ల ‘కయ్‌.. కయ్‌..’మని అరుస్తూ చూసింది. ‘నీలాగే మా అమ్మ మీద అలిగాను. అమ్మనొదిలి దారి తప్పాను. ఇప్పుడు అమ్మ కనిపించడం లేదు. నాకు ఆకలేస్తోంది. అమ్మ కోసం వెతుకుతున్నాను.’ అని కుక్కపిల్ల తోక ఊపుకొంటూ వెళ్లిపోయింది.
జున్నుబాబు ఒక్కడే మిగిలాడు. ఇంటివైపు చూశాడు. అమ్మ అలికిడి లేదు.
ఇంతలో ఒక లేగదూడ చెంగుచెంగున గెంతుకుంటూ వచ్చింది. జున్నుబాబు.. పిల్లి, పిచ్చుక, కుక్కపిల్లను అడిగినట్లే అడిగాడు. ‘అలిగావా? ఆకలేస్తే అమ్మ దగ్గరకు పోయి కడుపు నిండా పాలు తాగడమే నాకు తెలుసు. నా కోసం అమ్మ చూస్తూ ఉంటుంది. నాకు ఆకలి కూడా వేస్తోంది. నీతో మాట్లాడుతూ ఉంటే నాకు కుదరదు’ అని ఆవు దగ్గరకు దూడ పరుగెత్తింది.
జున్నుబాబు అటూఇటూ చూశాడు. మరేవీ కనిపించలేదు. ఆలోచనలో పడ్డాడు. లేగదూడ చెప్పింది నిజమే అనిపించింది. అమ్మ ఉండగా, అన్నం ఉండగా అలగడం తప్పే అనిపించింది. అమ్మ దగ్గరకు పరుగెత్తాడు. అన్నం పెట్టమన్నాడు. అమ్మ ఆశ్చర్యపోయింది. ప్రేమతో గోరుముద్దలు తినిపించింది. ఆ తర్వాత ఇంకెప్పుడూ జున్నుబాబు అన్నం తిననని అలగలేదు.

- బెలగాం భీమేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని