Updated : 01 Apr 2021 00:46 IST

భలే.. భలే.. బాలల చెరువు!

రామాపురం అనే గ్రామంలో ఒక ఉన్నత పాఠశాల ఉంది. దాని ఆవరణలో పచ్చని చెట్లు, చుట్టూ ప్రహరీ ఉన్నాయి. రాము, చందు స్నేహితులు, చాలా తెలివైన పిల్లలు. ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. రాము వాళ్ల నాన్న వెంకటయ్య తనకు ఉన్న రెండు ఎకరాల భూమిలో వరిని పండించేవాడు. మూడు సంవత్సరాలుగా వర్షాలు పడకపోవడం వల్ల బోరులో నీరు ఇంకిపోయింది. దాంతో కుటుంబపోషణ భారంగా మారింది. వెంకటయ్య భార్య లచ్చమ్మ కూలీనాలీ చేస్తూ రామును చదివిస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న రాము చదువు మీద శ్రద్ధ పెట్టలేక వెనుకబడిపోయాడు.
ఈ విషయాన్ని రాము స్నేహితుడు చందు తరగతి ఉపాధ్యాయుడికి చెప్పాడు. ఒక రోజు ఆయన విద్యార్థులకు పాఠం చెబుతూ ‘వర్షాలు పడినప్పుడు ఆ నీటిని భూమిలో ఇంకేలా చేయడానికి ఇంకుడు గుంతలు తవ్వాలి. అలాగే మన ఊరికి ఒక పెద్ద చెరువు ఉండాలి. అలా ఉన్నట్లైతే కొన్ని సంవత్సరాలు వర్షం పడకపోయినా బోర్లలో నీరు వస్తుంది’ అని చెప్పాడు.
ఏదో ఆలోచనలో ఉన్న రాముకు వెంటనే ఎవరో తట్టినట్లు అనిపించి ఉపాధ్యాయుడు చెప్పే మాటలు శ్రద్ధగా విన్నాడు. ‘మా బోరులో నీళ్లు ఎక్కువ కాలం ఉండకపోవడానికి కారణం చెరువు లేనందుకేనా?’ అని ఆలోచనలో పడ్డాడు. ‘చెరువును మా ఊరికి తీసుకురావడానికి నేనేం చేయాలి? ఎలా చేయాలి?’ అని తనలో తాను అనుకున్నాడు.
ఒక రోజు తెలుగు ఉపాధ్యాయుడు లేఖారచన గురించి విద్యార్థులకు చెప్పారు. మన సమస్యలను అధికారులకు తెలియజేస్తూ ఎలా రాయాలో వివరించారు. వెంటనే రాముకు ఒక మెరుపులాంటి ఆలోచన తట్టింది. ‘మన ఊరి సమస్యలను అధికారులకు లేఖ రూపంలో విన్నవిస్తే ఎలా ఉంటుంది?’ అని చందును అడిగాడు.
‘మనిద్దరమే రాస్తే.. అధికారులు పట్టించుకోరేమో. మన స్కూలు పిల్లలందరితో లేఖలు రాయిద్దాం’ అని చందు అన్నాడు. ప్రధానోపాధ్యాయుడి అనుమతి తీసుకున్నారు. ప్రతి తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు విషయం అంతా చెప్పి లేఖలు రాయించారు.
‘కలెక్టర్‌ గారూ! కొన్ని సంవత్సరాలుగా మా ఊరి అవతల అయిదు ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. దయచేసి ఆ ఖాళీ స్థలంలో చెరువును తవ్వించండి’ అని ఆ లేఖల సారాంశం. వీటన్నింటిని ఉపాధ్యాయుల సాయంతో పోస్టు చేశారు. కొన్ని రోజుల తర్వాత కలెక్టరు కార్యాలయం నుంచి ఓ అధికారి రామాపురానికి వచ్చి గ్రామపెద్దలను కలిసి విషయాన్ని వివరించాడు. ‘మీ గ్రామం అవతల ఉన్న స్థలంలో చెరువు తవ్వించమని కలెక్టరు ఆజ్ఞలు జారీ చేశారు. కాబట్టి చెరువు తవ్వకాన్ని మొదలు పెట్టాలి’ అని చెప్పాడు. పంచాయతీ అనుమతితో పనులు ప్రారంభించారు. నెలరోజుల్లోనే చెరువు పూర్తైంది. వర్షాకాలం వచ్చాక అది నిండి నిండుకుండలా తయారైంది.
రాము వాళ్ల బోరుతో పాటు ఊరి వాళ్లందరి బోర్లు, బావుల్లో పుష్కలంగా నీరు చేరింది. కరవు పోయి రామాపురం పచ్చని చెట్లు, పశుపక్ష్యాదులతో కళకళలాడింది. రాము వాళ్ల నాన్న చక్కగా వ్యవసాయ పనులు చూసుకున్నాడు. ఊరి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. రాము, చందుతోపాటు ఆ పాఠశాల విద్యార్థులంతా చదువుపై శ్రద్ధ పెట్టి మంచి మార్కులతో పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించారు.
లేఖలతో ఊరి స్థితిగతులనే మార్చిన రాము, చందును స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్‌ సన్మానించారు. ఈ విషయం పత్రికల్లో, టీవీల్లో ప్రముఖంగా వచ్చింది. బాలల కృషి ఫలితంగా ఏర్పడ్డ చెరువు కాబట్టి దానికి ‘బాలల చెరువు’ అని పేరు పెట్టారు.

- ఎం.జానకి రామ్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని