చంద్రుడి సలహా

విజయపురి రాజ్యానికి రాజు చక్రసేనుడు. ఆ రాజ్యప్రజలు పొరుగురాజ్యానికి వెళ్లాలంటే అడవి మార్గం చాలా దగ్గరగా ఉంటుంది. ప్రజలు ఆ దారి వెంట కాలినడకన వెళ్లేవారు. ఒకరోజు ఆ దారిన వెళుతున్న కొందరు కనిపించకుండా పోయారు. ఆ రోజు నుంచి ఆ దారిన వెళ్లేవారు మాయమవుతున్నారు. రాజుకు ఫిర్యాదులు అందాయి. ఈ రహస్యం తెలుసుకోవడానికి రాజు కొందరు భటులను పంపాడు. భటులు కూడా కనిపించకుండా పోయారు. ఈ రహస్యం ఛేదించిన

Published : 07 Apr 2021 01:14 IST

విజయపురి రాజ్యానికి రాజు చక్రసేనుడు. ఆ రాజ్యప్రజలు పొరుగురాజ్యానికి వెళ్లాలంటే అడవి మార్గం చాలా దగ్గరగా ఉంటుంది. ప్రజలు ఆ దారి వెంట కాలినడకన వెళ్లేవారు. ఒకరోజు ఆ దారిన వెళుతున్న కొందరు కనిపించకుండా పోయారు. ఆ రోజు నుంచి ఆ దారిన వెళ్లేవారు మాయమవుతున్నారు. రాజుకు ఫిర్యాదులు అందాయి. ఈ రహస్యం తెలుసుకోవడానికి రాజు కొందరు భటులను పంపాడు. భటులు కూడా కనిపించకుండా పోయారు. ఈ రహస్యం ఛేదించిన వారికి ఐదు లక్షల వరహాలు బహుమతిగా ఇస్తానని రాజు ప్రకటించాడు.
కొందరు మెరికల్లాంటి యువకులు రాజు అనుమతి తీసుకుని అడవి మార్గంలో వెళ్లారు. నాలుగు రోజులైనా వారి ఆచూకీ లేదు. ఈ సంఘటన రాజుకు అవమానంగా ఉంది. ఈ పరిస్థితిలో సేనాధిపతి కుమారుడు చంద్రుడు రాజును కలిశాడు. చంద్రుడి తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు సేనాధిపతి ద్వారా విన్న రాజు అతను అడవిలోకెళ్లటానికి అంగీకరించాడు. చంద్రుడు ప్రయాణమై అడవి మధ్యకు చేరుకున్నాడు. అక్కడ ఓ కోయల గుంపు చుట్టుముట్టింది. వారికి లొంగిపోతే రహస్యం తెలుస్తుందని లొంగిపోయాడు. చంద్రుడిని బంధించి ఒక గుహలోకి తీసుకెళ్లారు. అక్కడ నలుగురు యువకులు బంధీలుగా ఉన్నారు. చంద్రుడు కోయల నాయకుడితో ‘మేం మీకు శత్రువులం కాదు. మరి మీరు మమ్మల్ని ఎందుకు బంధించారు?’ అన్నాడు. అందుకు కోయ నాయకుడు ‘కొంతకాలం వరకూ అడవిలో మేం సంతోషంగా ఉండేవాళ్లం. ఈ మధ్య ఒక రాక్షసుడు అడవిలోకి ప్రవేశించాడు. దొరికినవారిని దొరికినట్లు చంపసాగాడు. మేము వాడి వద్దకెళ్లి, రాక్షసుడికి శ్రమలేకుండా రోజూ ఇద్దరిని ఆహారంగా గుహకు పంపుతామని ఒప్పందం చేసుకున్నాము. అడవి దారిన వెళ్తున్న వారిని బంధించి తెచ్చి, వాడికి ఆహారంగా అప్పగిస్తున్నాం’ అన్నాడు.
చంద్రుడు నవ్వి ‘మీరు ఇలా ఎంతకాలమని వాడి ఆకలి తీరుస్తారు. ఇకముందు మా రాజ్యప్రజలు ఎవ్వరూ ఇటువైపు రారు. అప్పుడు బంధించడానికి మీకు ఎవరూ దొరకరు. అప్పుడు మీరే వాడికి ఆహారంగా పోవాల్సి వస్తుంది. కొంతకాలానికి మీరెవరూ మిగలరు’ అన్నాడు.
‘నీవు చెప్పింది నిజమే! మరి మేము ఏం చేయాలి?’ అన్నాడు కోయల నాయకుడు.
‘రాక్షసుడి ఆకారానికీ, అరుపులకూ భయపడకుండా మీరందరూ కలిసికట్టుగా దాడి చేసి, వాడిని చంపాలి. ఐకమత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మించినది ఏదీ లేదు. ఇవి ఉంటే సాధ్యంకానిది లేదు’ అన్నాడు చంద్రుడు. కోయనాయకుడు చంద్రుడి సలహా ప్రకారం విషాన్ని తెప్పించి, బాణాలకు పూయించాడు. చంద్రుడి సారథ్యంలో కోయలు కలిసికట్టుగా ముందుకు కదిలారు. గుహలోని రాక్షసుడిని చుట్టుముట్టారు. కన్నుమూసి తెరిచేలోగా వందలసంఖ్యలో విషపు బాణాలు రాక్షసుడి శరీరాన్ని తూట్లు చేశాయి. రాక్షసుడు మరణించాడు.
చంద్రుడు తెలివైన సలహాతో రాక్షసుడి పీడ వదిలించినందుకు కోయలు కృతజ్ఞతలు చెప్పారు. చంద్రుడు నలుగురు యువకులనూ తీసుకుని రాజ్యానికొచ్చాడు. జరిగిన విషయాలు రాజుకు చెప్పాడు. చక్రసేనుడు చంద్రుడి నేర్పును, ధైర్యసాహసాలను అభినందించాడు. ఐదు లక్షల వరహాలతోపాటు తన ఆస్థానంలో పదవినిచ్చి సత్కరించాడు.

- డి.కె.చదువులబాబు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని