చిట్టి.. నీ నవ్వంటే..!

ఒక అడవిలో ఓ బుజ్జి కుందేలు ఉండేది. దాని పేరు చిట్టి. అది ఒక రోజు ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతోంది. అనుకోకుండా ఒక రాయి దొర్లుతూ వచ్చి కాలు మీద పడింది. గాయమై బాధతో విలవిల్లాడింది. వైద్యుడైన కోతి వచ్చి పరీక్షించింది. కాలికి వైద్యం చేసి కట్టుకట్టింది....

Published : 09 Apr 2021 00:29 IST

క అడవిలో ఓ బుజ్జి కుందేలు ఉండేది. దాని పేరు చిట్టి. అది ఒక రోజు ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతోంది. అనుకోకుండా ఒక రాయి దొర్లుతూ వచ్చి కాలు మీద పడింది. గాయమై బాధతో విలవిల్లాడింది. వైద్యుడైన కోతి వచ్చి పరీక్షించింది. కాలికి వైద్యం చేసి కట్టుకట్టింది. ముందుకాలి పెద్ద ఎముక చాలా చోట్ల విరిగిపోయింది. ఇక శాశ్వతంగా ఒక కాలు పనిచేయదని బుజ్జి కుందేలు తల్లిదండ్రులకు విషయం చెప్పింది.
అది విన్న చిట్టి చాలా బాధతో తన బొరియలోకి వెళ్లి నిద్రాహారాలు మాని దిగులుగా కూర్చుండిపోయింది. తనను చూసి అందరూ నవ్వుతారని, ఒక కాలు లేనందున తనను ఎవరైనా చంపి తినేస్తారేమోనని మనసులో భయం పెట్టుకుని బయటకు రాకుండా చాలా రోజులు బొరియలోనే ఉండిపోయింది. అంతకు ముందు వరకు ఎప్పుడూ నవ్వుతూ ఉండే చిట్టి.. ఇప్పుడు నవ్వటమే మానేసింది. ఎప్పుడు చూసినా ఏదో పరధ్యానంలో ఉండేది.
బుజ్జి కుందేలు తల్లి ఎంతో బాధపడింది. నువ్విలా దిగులుగా కూర్చుంటే ఆరోగ్యం దెబ్బ తింటుందని చెప్పింది. నువ్వు భయంతో ఇలా ఎన్నాళ్లు బొరియలోనే ఉండిపోతావు. నీకు తెలుసో.. లేదో.. మీ తాతకు కూడా ఇలాగే కాలు విరిగితే అన్ని పనులూ చాలా ధైర్యంగా చేసుకునేవాడు. ఒక కాలు లేకపోతే ఏంటి? మిగతా మూడు ఉన్నాయి కదా.. వాటితో ప్రయత్నించు అంది.
చిట్టి.. తల్లి చెప్పినట్లే మెల్లగా మూడు కాళ్లతో నడవడానికి ప్రయత్నించి బాధతో విలవిల్లాడుతూ పడిపోయింది. ‘అమ్మా.. ఇక నేను నడవలేనమ్మా..’ అంటూ బోరున విలపించింది. లేదు చిట్టీ.. నువ్వు మళ్లీ ప్రయత్నించు.. నీకు అలవాటైపోతుంది. ఎవరో ఏదో మనల్ని హేళన చేస్తారని అనుకోకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని ధైర్యం చెప్పింది. ‘లేదమ్మా నా వల్ల కాదు. నన్ను బలవంతం చేయకు. నేను నడవలేను. నా బతుకు ఇక ఇంతే’ అని ఏడుస్తూ అంది చిట్టి కుందేలు.
సరే.. నీ ఇష్టం అని చెప్పి ఆహారం తేవడానికని బాధగా బయటకు వెళ్లిపోయింది తల్లికుందేలు. చిట్టి కుందేలుకు కొద్దిసేపటికి ఆకలిగా అనిపించింది. ఎంత పిలిచినా వాళ్ల అమ్మ రాలేదు. నడవలేని నన్ను వదిలేసి వీళ్లంతా ఎక్కడికి వెళ్లిపోయారు అని అనుకుంది. ఇక చేసేదేమీ లేక నిద్రలోకి జారుకుంది. గాఢ నిద్రలో ఉన్న కుందేలుకు మెలకువ వచ్చింది. తన కాలును ఎవరో కొరుకుతున్నట్లుగా అనిపించింది. ఉలిక్కిపడి కుందేలు చప్పున లేచి మూడు కాళ్లతో గెంతుతూ తప్పించుకుంది. కానీ ఎలుక కుందేలును వదలకుండా వెంటబడుతూనే ఉంది. దాని నుంచి కుంటుతూనే తప్పించుకునే ప్రయత్నం చేసింది. కొద్దిసేపటికి విసుగొచ్చిన ఎలుక.. ఇక తన వల్ల కావడం లేదని బొరియలోంచి బయటకు వెళ్లిపోయింది. చిట్టి కుందేలు బతుకు జీవుడా అనుకుంటూ.. తన కాళ్లను చూసుకుంది. నాలుగో కాలు అవసరం లేకుండానే చాలా సులభంగా మూడు కాళ్లతో గెంతగలుగుతోంది. ఇప్పుడు పెద్దగా నొప్పి కూడా ఏమీ అనిపించడం లేదు. ఇకపై హాయిగా తన పని తాను చేసుకోవచ్చు అనుకుంది.
తల్లిదండ్రులు ఇంటికి రాగానే వారితో.. ‘నన్నొదిలి మీరు ఎక్కడికి వెళ్లిపోయారు. ఈ రోజు ఆ మాయదారి ఎలుక బారి నుంచి నా ప్రాణాలను కాపాడుకున్నాను తెలుసా!’ అని ధైర్యంగా అంది. ‘చిట్టీ.. నిజానికి నిన్ను విడిచి మేము ఎక్కడికీ వెళ్లలేదు. ఇక్కడే పక్కనే చాటుగా ఉండి గమనిస్తూనే ఉన్నాం. మా బాధను చూడలేకే ఎలుక సాయం చేస్తానంది. చెప్పినట్లుగానే నీ భయం పోగొట్టి నిన్ను చక్కగా నడవగలిగేటట్లు చేసింది. ఇక నుంచి నీ ఆహారం నువ్వు సంపాదించుకోవచ్చు. నీ స్నేహితులతో ఆడుకోవచ్చు. ఏ జంతువూ నిన్ను చంపకుండా నిన్ను నువ్వు రక్షించుకోగల ధైర్యం నీకు వచ్చిందనుకుంటా’ అన్నాయి అవి.
చిట్టి కుందేలు ఆశ్చర్యంగా ‘అవునా! ఇదంతా నా కోసమే చేశారా?’ అని సంతోషంగా మూడు కాళ్లతో గెంతుతూ పల్టీలు కొడుతూ వారికి చూపించింది. చిట్టి స్నేహితులు కూడా వచ్చి చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. వాటిని చూసి ఇంకా సంతోషంతో గంతులు వేసింది. ఎలుక కూడా వచ్చి వారి సంతోషంలో పాలు పంచుకుంది. తన భయాన్ని పోగొట్టిన ఎలుక వంక చూసి కృతజ్ఞతలు చెప్పింది. ఇక అప్పటి నుంచి చిట్టి మునుపటిలా నవ్వుతోంది. అది చూసి దాని తల్లిదండ్రులు ‘చిట్టీ.. నీ నవ్వంటే మాకెంతో ఇష్టం. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి’ అని మురిసిపోయారు.

- గెడ్డం సుశీలరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని