సన్మానం.. మంచికి బహుమానం!

ములకలంక ద్వీప రాజ్యంలోని పోతుగడ్డ గ్రామం పచ్చని పంటలు, వర్తక వ్యాపారాలు, రకరకాల వృత్తుల వారితో, అనేక రంగాల్లో పేరుగాంచిన కళాకారులతో నిండి ఉండేది. ఒకసారి ఊరిలోని యువజన సంఘం వారు ఊరికి మేలు చేస్తున్న వారిని సన్మానించాలనుకున్నారు. ఆ విషయమై ఊరి పెద్దలను సంప్రదించారు...

Published : 12 Apr 2021 01:09 IST

ములకలంక ద్వీప రాజ్యంలోని పోతుగడ్డ గ్రామం పచ్చని పంటలు, వర్తక వ్యాపారాలు, రకరకాల వృత్తుల వారితో, అనేక రంగాల్లో పేరుగాంచిన కళాకారులతో నిండి ఉండేది. ఒకసారి ఊరిలోని యువజన సంఘం వారు ఊరికి మేలు చేస్తున్న వారిని సన్మానించాలనుకున్నారు. ఆ విషయమై ఊరి పెద్దలను సంప్రదించారు.
‘దానికి ఇంత పెద్ద ఆలోచన దేనికి? ఈ మధ్యనే ఒక మహాకావ్యం రాసి మహారాజుతో సత్కారం పొంది వచ్చిన మన ఊరి కవిని సన్మానించండి. కావాలంటే నేను కొంత చందా ఇస్తాను. కావాల్సిన సాయం చేస్తాను’ అన్నాడు గ్రామకరణం. ఆ కవి ఈయనకు స్వయాన బావమరిది.
తరవాత వాళ్లు మునసబు గారిని కలిశారు. ‘భలేవార్రా మీరు. దీని కోసం అందర్నీ అడుగుతున్నారా. మన వస్తాదు వీరయ్య రాజ్యంలోని మల్లయోధులనందర్నీ జయించి మహామల్లుడు అని బిరుదు కూడా పొందాడు కదా! ఆయన్ను గౌరవిస్తే ఊరిని గౌరవించినట్లే’ అన్నాడు. మహామల్లుడు ఆయన అన్న కొడుకు.
ఇలా కాదని ఊరి పెత్తందారును కలిశారు. ‘ఇది కూడా ఒక సమస్యేనా? నాట్యంలో పేరు గడించి రాజనర్తకిగా నియమితులైన మన మంజువాణిని సన్మానించండి’ అన్నాడు. ఆమె ఆయనకు సన్నిహితురాలు.
ఇలా తలాఒక్క మాట చెప్పేసరికి ఎవరిని సన్మానించాలో వారికి అర్థం కాలేదు. ఆ ఊరి ఉపాధ్యాయుడిని కలిసి సమస్యను ఆయన ముందుంచారు. ‘మీరు యువకులు. అయినా అల్లరిచిల్లరగా తిరక్కుండా ఒక మంచి పని చేయాలని అనుకుంటున్నారు. అలా చేయడం వల్ల వచ్చే ఏడాది మనం కూడా సన్మానం అందుకోవాలని కొంతమందైనా ప్రయత్నిస్తారు. అసలు అందుకు మిమ్మల్ని సన్మానించాలి’ అన్నాడాయన.
‘కానీ పంతులుగారూ! మమ్మల్ని మేము సన్మానించుకోవడం అంటే మన డప్పు మనమే కొట్టుకున్నట్లు ఉంటుంది కదా! దాని వల్ల మేము నవ్వుల పాలు కావడమే కానీ ఊరికి ఉపయోగం ఉండదు కదా?’ అనుమానంగా అన్నారు వాళ్లు. ‘ఇప్పుడు మీరు దారిలో పడ్డారు. ఊరికి ఎవరి వల్ల మేలు జరిగిందో వారికే సన్మానం జరగాలి. అప్పుడే, అదే దారిలో మరి కొందరు నడిస్తే మన ఊరుకు మంచి జరుగుతుంది. కవికి రాజసత్కారం జరిగింది. ఆయన కృషికి ఫలితం దక్కింది. వీరయ్యకు మహా మల్లుడనే బిరుదు వచ్చింది. మంజువాణి రాజనర్తకి కావడంతో ఆమెకు కూడా తగిన ఫలం దక్కినట్లే. వీరి వల్ల ఊరికి పేరు వచ్చింది నిజమే. కానీ గ్రామానికి జరిగిన మేలేంటి?
మన ఊరి నుంచి పట్నం వెళ్లే దారిలో తన స్వయంకృషితో రంగడు తవ్విన బావివల్ల మేలు జరిగింది. బడిలో చదువుకున్న పేద విద్యార్థులకు భోజన సదుపాయం కల్పిస్తున్న పేరయ్య వల్ల మేలు జరిగింది. పేద విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పలకలు, పుస్తకాలు ఇస్తున్న రైతు రామయ్య వల్ల మేలు జరిగింది. పేదలకు ఉచితంగా వైద్యం చేస్తున్న వైద్యుడు వేదాచారి వల్ల మన ఊరికి చెప్పరానంత మహోపకారం జరుగుతోంది. ఇలాంటి వారిని మీరు సన్మానించాలి. ఇంతకు ముందు ఊరి పెద్దలు చెప్పిన చాలా మంది ఇలాంటి వారి సహకారంతో పైకి వచ్చిన వారే. మీరు చేయబోయే సన్మానం వల్ల ఇంకెంతో మంది మంచి పనులు చేయడానికి ముందుకు రావచ్చు. ఇది మన ఊరికి మేలు చేస్తుంది.’ నవ్వుతూ చెప్పారు పంతులు గారు.
యువజన సంఘంవారికి ఆ ఏడాదికే కాదు రానున్న సంవత్సరాల్లో కూడా సన్మానం చేయడానికి చాలామంది ఉన్నారన్న నమ్మకం కలిగింది. ఆ ఏటికి బావి తవ్వి బాటసారులకు దాహార్తి తీరుస్తున్న రంగడినే మేటిగా నిర్ణయించి సన్మానించారు వాళ్లు!!

- ముసునూరి సుబ్బయ్య చౌదరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని