ఉన్నట్టుండి గంట.. గణగణ మోగిందే!

అడవిలో అల్లరిచిల్లరగా తిరిగే అడవిపిల్లికి ఒకరోజు అది వెళుతున్న దారిలో ఒక చిన్న గంట దొరికింది. అడవి గుండా రాజధాని హీలాపురికి వెళుతున్న ఓ ఎడ్ల బండికి కట్టి ఉన్న ఓ ఎద్దు మెడలోని గంటలహారం లోంచి జారి పడిన చిన్న గంట అది. దాన్ని చూసి

Published : 15 Apr 2021 00:13 IST

అడవిలో అల్లరిచిల్లరగా తిరిగే అడవిపిల్లికి ఒకరోజు అది వెళుతున్న దారిలో ఒక చిన్న గంట దొరికింది. అడవి గుండా రాజధాని హీలాపురికి వెళుతున్న ఓ ఎడ్ల బండికి కట్టి ఉన్న ఓ ఎద్దు మెడలోని గంటలహారం లోంచి జారి పడిన చిన్న గంట అది. దాన్ని చూసి ముచ్చట పడిన అడవిపిల్లి ఓ మొక్క తీగకు దాన్ని తగిలించుకుని మెడలో అలంకరించుకుంది.
వాగునీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని, మురిసిపోసాగింది అడవిపిల్లి. అటుగా వెళుతున్న జింక దాన్ని చూసి ‘ఏమిటంతగా మురిసిపోతున్నావు?’ అని అడిగింది. మెడలో అలంకరించుకున్న గంటను చూపించి ‘గంట మెడలో వేసుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ!’ అని అడిగింది అడవి పిల్లి. ‘చాలా బాగున్నావు. ఈ గంట నీ మెడలో చాలా అందంగా ఉంది’ అని చెప్పి వెళ్లిపోయింది జింక.
మెడలో ఆ గంట కదులుతూ చేస్తున్న శబ్దానికి అడవి పిల్లి మురిసిపోతూ దార్లో కనిపించిన ప్రతీ జంతువునూ ఆపి మెడలోని గంటను చూపించి ‘ఎలా ఉంది?’ అని అడుగుతుంది. అవి మెచ్చుకునే వరకూ వదిలిపెట్టట్లేదు. అడుగు తీసి అడుగు వేస్తుంటే.. మెడలోని గంట కదులుతూ శబ్దం చేస్తుంటే.. ఆ ధ్వని చాలా మధురంగా అనిపించసాగింది పిల్లికి.
మధ్యాహ్నం కావడంతో ఆకలి వేసింది పిల్లికి. పొంచి ఉండి చిన్న చిన్న పిట్టల్నీ, ఉడతల్నీ, మిడతల్నీ పట్టుకోబోయింది. మెడలో ఉన్న గంట చేసే శబ్దం విని అవి ఆపద శంకించి పిల్లికి దొరక్కుండా తప్పించుకుని అవి పారిపోసాగాయి. ఎంతసేపు ప్రయత్నించినా పిల్లికి తినడానికి ఒక పిట్ట గానీ, ఉడుత గానీ దొరకలేదు. ఇక చేసేది లేక భూమిలో నుంచి దుంపలు పీక్కుతినడానికీ ప్రయత్నించింది. కానీ అలవాటు లేని ఆహారం కదా..! దానికి అంతగా రుచించలేదు.
సాయంత్రం అవుతున్న కొద్దీ ఆ గంట చేసే శబ్దం పిల్లికి నచ్చలేదు. అడుగు తీసి అడుగు వేస్తుంటే ఇంతకు ముందు మధురంగా అనిపించిన గంట చప్పుడు ఇప్పుడు కర్ణ కఠోరంగా వినపడసాగింది. చివరికి పిల్లి.. అటుగా వెళుతున్న తోడేలును ఆపి ‘ఈ గంట శబ్దం వినలేకపోతున్నాను. అది వినిపించకుండా ఏదైనా ఉపాయం చెప్పు మావా!’ అని ప్రాధేయపడింది. దానికి తోడేలు ‘దానిదేముంది అల్లుడూ!’ అంటూ.. మెడలోంచి గంట తీసేయడానికి ప్రయత్నించింది.
పిల్లి ఒప్పుకోలేదు. ‘నా మెడలో ఈ గంట చాలా అందంగా ఉంది. దాన్ని తీయకుండా శబ్దం రాకుండా ఆపలేవా?’ అని అడిగింది పిల్లి. ‘అలా చేయడం నాకే కాదు. ఎవరికీ చేతకాదురా అల్లుడూ’ అంటూ వెళ్లిపోయింది తోడేలు. అడుగడుక్కీ వినిపిస్తున్న గంట శబ్దం పిల్లి వినలేకపోతోంది. దార్లో కనిపించిన జంతువులన్నింటినీ ఆపి, మెడలో నుంచి గంట తీయకుండా నాకు ఆ శబ్దం వినబడకుండా ఏదైనా ఉపాయం చెప్పండి’ అంటూ ప్రాధేయపడింది.
అంతా విని నక్క ‘ఓస్‌! ఇంతే కదా! నీ మెడలో నుంచి గంట తియ్యకుండా గంట శబ్దం చెయ్యకుండా చెయ్యాలి. అంతే కదా! అని చిటికెలో ఏదో గమ్మత్తు చేసింది నక్క. ఇప్పుడు పిల్లి మెడలో గంట ఉంది గానీ అది శబ్దం చేయడం లేదు. పిల్లి నక్కకు కృతజ్ఞత తెలుపుకొని మెడలో ఉన్న అందమైన గంటను ఊపుకుంటూ వెళ్లిపోయింది. మెడలో గంట శబ్దం చెయ్యకపోవడంతో అది పిట్టల్నీ, ఉడుతల్నీ ఒడుపుగా పట్టుకుని భోం చేయసాగింది.
ఇంతకీ చేసిన ఉపాయం ఏమిటో చెప్పలేదు కదూ! ఏం లేదు. నక్క, పిల్లి మెడలోని గంట లోంచి అది మోగడానికి ఉపయోగపడే చిన్ని కాడని తీసేసింది అంతే!

- కోనే నాగ వెంకట ఆంజనేయులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని