టక్కరి మొసలి.. తెలివైన గోపి!

ఆ ఊరిపేరు కృష్ణాపురం. చుట్టూ పచ్చని పొలాలు, గలగలపారుతున్న నదితో చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. నదిని ఆనుకుని ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని ఊడలను పట్టుకుని పిల్లలు

Published : 22 Apr 2021 00:05 IST

ఆ ఊరిపేరు కృష్ణాపురం. చుట్టూ పచ్చని పొలాలు, గలగలపారుతున్న నదితో చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. నదిని ఆనుకుని ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని ఊడలను పట్టుకుని పిల్లలు ఆడుకుంటూ ఉంటారు.
గోపి అయిదో తరగతి చదువుతున్నాడు. చురుకైన పిల్లాడు. ఆ రోజు ఆదివారం స్కూలుకు సెలవు కావడంతో తన స్నేహితులతో కలిసి ఆ నది దగ్గర ఆడుకుంటున్నాడు. కొంతసేపటికి అందరూ వెళ్లిపోయినా, గోపి ఒక్కడే ఆ గట్టు మీద ఆడుకుంటున్నాడు. అయితే ఆ నదిలో ఏదో కదులుతున్న శబ్దం వినిపించింది. నదిలోకి చూస్తే.. మొసలి కనిపించింది. ఊరిలో పెద్దవారికి చెప్పాలనుకుని బయలుదేరబోతుండగా...
‘ఒకసారి ఇటు రావా?’ అనే మాటలు వినిపించాయి.. గోపి నదిలోకి చూశాడు. ఆ మొసలి గోపితో.. ‘నేను దారితప్పి ఈ నదిలోకి వచ్చాను. రెండు రోజులుగా తిండి లేదు. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను’ అంటూ కన్నీరు కార్చింది. గోపి దాని మాటలు
నిజమేననుకున్నాడు. కానీ అంతలోనే గోపికి ఓ సందేహం వచ్చింది.
‘నీవు మాంసాహారివి కదా! నీ ఆకలి నేనెలా తీర్చగలను?’ అని మొసలిని అడిగాడు.
అందుకు అది గోపితో ‘మనసుంటే మార్గముంటుంది. నువ్వు అనుకుంటే నాకు కచ్చితంగా ఆహారం తెచ్చిపెట్టగలవు’ అంది. ‘అంటే..’ సరిగా అర్థం కాక అన్నాడు గోపి.
గోపికి తన మీద నమ్మకం కలుగజేయాలనుకుంది మొసలి.
‘నాకు ఆకలి విలువ తెలిసింది. మాంసం తినకూడదనే నియమం పెట్టుకున్నాను. కాబట్టి నువ్వు ఆ ఊడలకు వేలాడి ఆకులను నాకు తెచ్చిస్తే వాటిని తిని ఆకలి తీర్చుకుంటానంది.
‘అందుకు నేనేం చేయాలి?’ మొసలి మాటలు నమ్ముతూ గోపి అన్నాడు.
‘చెప్పానుగా! ఆ ఊడలను నాకు అందించమని.. ఒకసారి చెబితే అర్థం కాదా!’ మొసలి విసుక్కుంటూ అంది.
దాని ప్రవర్తనకు గోపీకి అనుమానం వచ్చింది. ‘ఆకులను తినాలనుకుంటే వాటినే కోసి నదిలోకి వేయమని అడుగుతుంది. ఊడలను అందించమంటోంది ఏంటి? అనుకున్నాడు. అయినా ఏమీ తెలియనట్లుగానే ఊడలను గట్టిగా పట్టుకుంటూ మొసలి నోటికి అవి అందేలా చేశాడు. ఇదే అదనుగా మొసలి గోపి కాలును  పట్టుకునేందుకు అమాంతం పైకి ఎగిరింది. కానీ గోపి దాని నోటికి అందకుండా చాకచక్యంగా తప్పించుకున్నాడు. తన పన్నాగం విఫలమైనందుకు మొసలి నిరాశగా చూసింది. అయినా పైకి కనపడకుండా ‘ఊడను నాకందించలేదే?’ అని గోపిని అడిగింది.
అప్పుడు గోపి దానితో ‘మొసలి కన్నీరు నమ్మకూడదని పెద్దలు అంటారు. అయినా పన్నీరు పోసి పెంచినా ఉల్లి మల్లి అవుతుందా? నన్ను తినేద్దామని పన్నాగం పన్నావు. కానీ నీ వలలో నేను పడలేదుగా!’ అన్నాడు.
ఆలస్యం చేయకుండా ఊరిపెద్దలతో మొసలి విషయం చెప్పాడు. వారి సాయంతో జూ పార్కు వారికి ఫోన్‌ చేసి దాన్ని వాళ్లకు అప్పగించేలా చేశాడు.
చిన్నపిల్లాడైనా సమయస్ఫూర్తితో మొసలి బారినుంచి తప్పించుకుని, ఊరి వారినందరిని కూడా కాపాడినందుకు అందరూ గోపిని అభినందించారు.

- కె.వి. లక్ష్మణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని