తీయని వేడుక చేసుకుందామా!

‘ఈ మధ్య తాతయ్య రోజూ ఉదయాన్నే మన తోటలోకి ఎందుకు వెళ్తున్నట్లు’ అడిగాడు చింటు రాజీని. ‘బహుశా మామిడికాయలు తేవడానికి కాబోలు’ నవ్వుతూ అంది రాజీ. ‘వెటకారం కాదు. మనం ఆ లోగుట్టు తెలుసుకోవాలి.

Published : 28 Apr 2021 00:13 IST

‘ఈ మధ్య తాతయ్య రోజూ ఉదయాన్నే మన తోటలోకి ఎందుకు వెళ్తున్నట్లు’ అడిగాడు చింటు రాజీని. ‘బహుశా మామిడికాయలు తేవడానికి కాబోలు’ నవ్వుతూ అంది రాజీ. ‘వెటకారం కాదు. మనం ఆ లోగుట్టు తెలుసుకోవాలి. ఇంత ఉదయాన్నే తాతయ్య తోటలో తిరగడం వెనుక ఉన్న రహస్యం కనుక్కోవాలి’ అన్నాడు చింటు. ‘సరే ఈ ఆదివారం తాతయ్యకు తెలియకుండా ఆయన వెనకాలే వెళ్దాం. అప్పుడు తెలిసిపోతుంది కదా’ అంది రాజీ.
‘సరే.. వచ్చే ఆదివారమే అసలు విషయం తెలుసుకుందాం. నాయనమ్మకు చెబుదాం’ నవ్వుతూ అన్నాడు చింటు.
ఆ రోజు ఆదివారం.. ఉదయాన్నే తాతయ్యకు తెలియకుండా ఆయన వెనకాలే బయలుదేరారు చింటు, రాజీ. ఆయన తోటలోకి వెళ్లి అక్కడున్న నేలబావిలో నుంచి నీరు తోడి ఒక కుండలో నింపుతున్నాడు. తర్వాత ఆ నీటిని అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న తొట్లలో పోస్తున్నాడు.
‘తాతయ్యకు ఏమైనా మతిపోయిందా.. ఉదయాన్నే ఇలా ఎందుకు చేస్తున్నాడు. ఇంట్లో నాయనమ్మ ఏమైనా కాస్త పని చెప్పినా బద్ధకంగా కదిలే తాతయ్య ఇక్కడ ఇంత కష్టమైన పనినీ ఎంతో హుషారుగా చేస్తున్నాడేంటి?’ అన్నాడు చింటు.
‘నాయనమ్మ దగ్గరకు వెళ్లి తాతయ్య తోటలో ప్రతి చెట్టు కిందా నీటి తొట్టె పెట్టి వాటిని నింపడానికి నూతిలో నీరు తోడుతున్నాడు అని చెబుదాం పదా’ అంది రాజీ. చింటు, రాజీ నాయనమ్మ దగ్గరకు వెళ్లారు. తోటలో తాతయ్య చేస్తున్న పని గురించి చెప్పారు. నాయనమ్మ ముసిముసి నవ్వులు నవ్వి ‘చింటూ, రాజీ మీ ఇద్దరూ కవల పిల్లలు. మీకు తెలుసు కదా. మీ పుట్టినరోజు నాడే మీ తాతయ్య పుట్టిన రోజు కూడా. ఇంకా దానికి వారం రోజుల సమయం ఉంది. ఆ వేడుకలో మీకు నచ్చిన బహుమతులు తాతయ్య ఇస్తుంటారు. ఆయనకు ఇష్టమైన బహుమతులు మీరు ఇవ్వాలి. ముందు ఆ పని చూడండి. తాతయ్య తోటలో చేస్తున్న పని గురించి కొన్ని రోజులు మరిచిపోండి’ అంది.

‘చింటూ.. మన తాతయ్యకు ఇష్టమైన బహుమతి ఇచ్చే సంగతి చూద్దాం పదా మేడ మీదకు’ అంది రాజీ. రెండు రోజులు గడిచాయి. ‘మన చింటు, రాజీ ఖాళీ దొరికితే చాలు పుస్తకాల సంచులతో మేడ మీదకు వెళ్లిపోతున్నారు. పైగా ఆ సంచుల్లో ఏవో బరువులు కనిపిస్తున్నాయి. ఇంతకీ వాళ్లు మేడ మీద ఏం చేస్తున్నట్లు..? నేను వెళ్లి చూద్దామంటే మోకాళ్ల నొప్పులతో మెట్లు ఎక్కలేకపోతున్నా’ అంటూ నాయనమ్మ దగ్గర ఆరా తీయడానికి ప్రయత్నం చేశాడు తాతయ్య.
‘ఏమో బాబూ..! మీ తాతా మనవళ్లు మహా ఘనులు. మీరు ముగ్గురు ఏం చేసినా ఇతరుల మేలు కోసమే చేస్తారు. కొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది. ఆ పిల్లలు చేస్తున్న పని ఏంటో?’ అని నవ్వింది నాయనమ్మ.
ఆ కుటుంబం ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. తాతయ్య, చింటు, రాజీల పుట్టిన రోజు వేడుక ప్రారంభమైంది. తాతయ్య.. చింటు రాజీలను తోటలోకి తీసుకెళ్లాడు. వాళ్లు ఒక మూల చెట్టు కింద చాప వేసుకుని కూర్చొని కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఎండ తీవ్రత కాస్త ఎక్కువైంది. ‘తాతయ్యా మనం ఇంటికి వెళ్లిపోదాం పద. ఎండ ఎక్కువవుతోంది కదా’ అన్నారు చింటు, రాజీ.
‘చింటు, రాజీ మీకు ఇష్టమైన బహుమతి ఇస్తాను ఆగండి’ అన్నాడు తాతయ్య. ‘నిజమా తాతయ్యా! మాకు ఇష్టమైన బహుమతి ఈ తోటలో దాచావా!’ అన్నారు చింటు, రాజీ. అంతలో కుందేళ్లు, ఉడతలు, చిలుకలు, పావురాళ్లు, కోతులు ఒక్కొక్కటిగా వచ్చి తోటలో తాతయ్య చెట్ల కింద ఏర్పాటు చేసిన తొట్టెల్లోని నీళ్లు తాగుతున్నాయి.
‘పిల్లలూ! మీకు ఇష్టమైన చిట్టి జంతువుల దాహం తీర్చడానికి నేను ఈ మధ్య ప్రతిరోజూ ఉదయాన్నే తోటకు వచ్చి నూతిలో నీళ్లు తోడి ఈ తొట్టెలు నింపుతున్నాను. మీకు నచ్చింది కదా.. నా పని. ఇదే నేను మీకు ఇస్తున్న పుట్టిన రోజు బహుమతి’ అన్నాడు తాతయ్య. చింటు, రాజీలు సంతోషంతో తాతయ్యకు ధన్యవాదాలు చెప్పారు.
ఇంటికి వెళ్లిన వెంటనే ‘తాతయ్యా! మేము కూడా మీకు   బహుమతి ఇస్తాం. మేడ మీదకు రండి’ అన్నారు చింటూ, రాజీ. అతికష్టం మీద మెట్లు ఎక్కుతూ తాతయ్య మేడ మీదకు చేరాడు. అక్కడ చిన్న చిన్న మట్టిచిప్పల్లో నీటిని నింపి చింటు, రాజీ ఉడతలు, పక్షుల దాహం తీర్చడానికి చేసిన ఏర్పాట్లు చూసి ఆనందపడి వాళ్లను మెచ్చుకున్నాడు తాతయ్య. ‘ఇదీ మేం మీకు ఇచ్చే పుట్టినరోజు బహుమతి తాతయ్యా! బాగుంది కదా’ అన్నారు చింటు, రాజీ.
అంతలో నాయనమ్మ మేడ మీదకు వచ్చింది. ‘ముగ్గురూ ముగ్గురే.. అందరూ ప్రకృతి ప్రేమికులే. మూగజీవుల సంరక్షకులే. మీ మంచి పనులకూ నేనూ ఒక సాయం చేస్తాను. మీరు వేసవిలో వాటి దాహం తీరిస్తే.. నేను  ఆహారాన్ని అందిస్తాను. తీసుకోండి ఈ తిండి గింజలు, ఆకుకూరలు, కూరగాయల మూటలు. కొన్ని తోటలో పెట్టండి. మిగిలినవి మేడ మీద పెట్టండి. ఇదీ నేను మీ ముగ్గురికీ ఇస్తున్న కానుక’ అని ఆ మూటల్ని వారికి అందించింది.
అంతలో చింటు, రాజీల అమ్మానాన్న మేడ మీదకు వచ్చారు. వాళ్ల చేతుల్లో పక్షులు, పశువులకు దాణా సరకులతో పాటు, తాతయ్య, చింటు, రాజీలకు కొత్త దుస్తులు, మిఠాయిలు ఉన్నాయి. వాళ్లంతా కలిసి వేడుకగా పుట్టినరోజు జరుపుకున్నారు.

- మీగడ వీరభద్రస్వామి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని