ఆలస్యం.. ఇడ్లీ.. అమృతం!

కీళగరం కమలమ్మకి ఇడ్లీ అంగడి ఉండేది. ఇడ్లీలు దూది పింజెల్లా ఉంటాయని, కమ్మటి వేరుశనగ కాయల చట్నీ భలే రుచిగా చేస్తుందని చుట్టుపక్కల ఊళ్లో చెప్పుకునేవాళ్లు. కమలమ్మ మూడు గదులున్న ఇంట్లో ఇడ్లీ అంగడి నడిపేది. ఒకటి వంటకు, మరొకటి

Published : 29 Apr 2021 00:14 IST

కీళగరం కమలమ్మకి ఇడ్లీ అంగడి ఉండేది. ఇడ్లీలు దూది పింజెల్లా ఉంటాయని, కమ్మటి వేరుశనగ కాయల చట్నీ భలే రుచిగా చేస్తుందని చుట్టుపక్కల ఊళ్లో చెప్పుకునేవాళ్లు. కమలమ్మ మూడు గదులున్న ఇంట్లో ఇడ్లీ అంగడి నడిపేది. ఒకటి వంటకు, మరొకటి అల్పాహారశాలకు, చివరిది గల్లాపెట్టె గదులుగా వాడుకునేది. కొడుకు కామేశ్వరరావుకు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గుడిలో పెళ్లి చేసింది. కొత్త కోడలు కావేరి కాళ్లకు వెండి గజ్జెలు కట్టుకుని ఇంట్లో తిరుగుతుంటే ఘల్లుఘల్లు మనే శబ్దాలకు కమలమ్మ పరవశించిపోయేది.
జనాలు గుంపులుగుంపులుగా వచ్చి ఇడ్లీలు తిని ఆహా.. ఒహో! అంటూ తృప్తిగా ఉందంటూ వెళ్లేవాళ్లు. కడుపు నిండి బ్రేవ్‌మని తేన్చేవాళ్లు. కొడుకు కామేశ్వరరావు గల్లా పెట్టె దగ్గర కూర్చుని ఘంటసాల పాటలు పాడుకుంటూ డబ్బులు వసూలు చేసేవాడు. కొత్త కోడలు అల్పాహార శాలలో ఇడ్లీ అందించేది. కమలమ్మ మాత్రం వంట గదిలో ఉండేది. ఆ గదిలోకి ఎవ్వరినీ రానిచ్చేది కాదు. ఎంత జనం వచ్చినా కమలమ్మ తొణికేది కాదు. బెణికేది కాదు. వచ్చిన వారిని అల్పాహార శాలలో కూర్చోబెట్టి వంట గదిలోకి వెళ్లి గొళ్లెం వేసుకునేది. కాసేపటి తర్వాత వేడి వేడి ఇడ్లీలు అందించేది. జనం ఆవురావురుమని తినేవాళ్లు. లొట్ట లేసుకుంటూ చట్నీని జుర్రుకునేవాళ్లు.
అత్త తనని వంట గదిలోకి ఎందుకు రానివ్వదో కొత్త కోడలికి అర్థమయ్యేది కాదు. అయినా అత్త కాలం కొన్నాళ్లూ.. కోడలి కాలం కొన్నాళ్లూ.. ఉండడం సహజమే కదా అనుకుంది. అత్తమాట బంగారుమూటలా భావించింది.
జనాలు దండిగా వచ్చిన ఒకరోజు పాత్రలు కడుగుదామని పెరట్లోకి వెళ్లింది కొత్త కోడలు. పొరబాటుగా వంటగది కిటికీలోంచి తొంగి చూసింది. అత్త నార మంచం మీద పడుకుని అటకకేసి చూస్తూ కూనిరాగాలు తీస్తోంది.
ఇంత మంది జనాలు ఇడ్లీల కోసం ఎదురు చూపులు చూస్తుంటే అత్త ఏంటీ? ఇంత నింపాదిగా ఉంది? అని ముక్కున వేలేసుకుంది.
కిటికీలోంచి కొత్త కోడలు తొంగి చూసిన సంగతి కనిపెట్టేసింది కమలమ్మ. గబగబా పెరట్లోకి వచ్చి కొత్త కోడలి ముక్కుమీద వేలు తీసేసి ‘కోడలు పిల్లా! వ్యాపారం అంటే వంద రహస్యాలుంటాయి. వచ్చినోళ్లకి వచ్చినట్లే వేడి వేడిగా వెంట వెంటనే ఇడ్లీలు వడ్డిస్తే తిన్నవాళ్లు ‘కారం ఎక్కువ.. పులుపు తక్కువ.. ఉప్పు లేదు.. ఉడక లేదు..’ వంటి వంకలు చెబుతారు. అలా కాకుండా వచ్చిన వాళ్లని కాసేపు కూర్చోబెట్టి వాళ్లు ఎదురుచూసేలా చేయాలి. ఇడ్లీలు ఉడుకుతున్నాయని, కాసేపు ఉంటే పాత్ర దించేస్తానని చెప్పాలి. ఆ తర్వాత వేడివేడిగా ఇడ్లీలు అరటి ఆకులో వడ్డించాలి. అకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరగదు అని మనకు తెలిసిందే కదా! అప్పుడు వారికి మన ఇడ్లీలు వెన్నపూసలా, జున్ను ముద్దలా అనిపిస్తాయి. మన చట్నీ అమృతంలా, చెరకు రసంలా తియ్యగా అనిపిస్తుంది. రుచీపచీ చూడరు. బాగోగులు పట్టించుకోరు. అద్భుతంగా ఉన్నాయని పొగిడి కడుపారా తిని తృప్తిగా వెళతారు. ఈ నాలుగు ఊళ్లలో మంచి పేరు తెచ్చుకుని ఇరవై ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న మన వ్యాపార రహస్యమిదే’ అని చిన్నగా చెవిలో చెప్పింది. అత్త చెప్పిన సుతి మెత్తటి వ్యాపార రహస్యానికి కొత్తకోడలు సంతోషపడింది. తనకు బంగారంలాంటి అత్త దొరికిందని ఎగిరి గంతేసింది. అప్పట్నుంచీ అత్తాకోడళ్లు ఇద్దరూ ఇడ్లీ చట్నీల్లా కలిసిపోయారు. వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చేశారు.

- ఆర్‌.సి. కృష్ణస్వామిరాజు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని